నాకొచ్చిన పెద్ద డౌట్ ఏమిటంటే..? ఈ వార్తలో ఆమె ఫోటోలో మొహాన్ని ఎందుకు బ్లర్ చేశారు..? ఆమె తప్పు చేసిందా..? ఆమె ఐడెంటిటీ బయటపడకూడదా..? ఎందుకు..? ఆమె పెళ్లి చేసుకుంది… మరి మొహం ఎందుకు చూపించకూడదు..? అసలు ఈ వార్తను ఈ పేజీలో పెట్టిన సబ్ఎడిటర్ భావన ఏమిటి..? ఆమె ఏ కేసులోనూ నిందితురాలూ కాదు, పోలీస్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అక్కర్లేదు… ఆమె ఏ కేసులోనూ బాధితురాలు కాదు, మొహం ప్రచురించకుండా ఉండటానికి..! ఇదేమీ నిర్బంధ వివాహం కాదు, ఆమె ఫేస్ హైడ్ చేయడానికి..! ఈమాత్రం కూడా ఆలోచించడం లేదా మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, అంత కాజువల్‌గా పనిచేసుకుంటూ పోతున్నాయా..? పైగా ఈ వార్త మెయిన్ పేజీలో వచ్చింది, ఏ జోన్ పేజీలోనో, జిల్లా పేజీలోనో వచ్చింది కాదు… కాస్త సీనియర్ల లుక్కు ఉండే మెయిన్ పేజీలో… దానికి ఎడిటర్, సెంట్రల్ డెస్క్ ఇన్‌ఛార్జి గట్రా ఉండే ఉంటారు కదా… వాళ్లకు ఈ డౌట్ రాలేదా..? ఏమోలే, మనదే అనవసర సందేహం కావచ్చులే..!
అసలు వార్త కూడా డౌట్ ఫుల్లే… నిర్మల్ జిల్లా, భైంసా… ఆయన పేరు రాథోడ్ కిషన్… ఆ ముసలాయనకు 73 ఏళ్లు… ఆమె పేరు సునీత… ఆమెకు 26 ఏళ్లు… తేడా 47 ఏళ్లు… మనసులు కలిశాయి అనే వాక్యం దగ్గరే మన అభ్యంతరం….. ఇందులో నిజానికి లవ్వు ట్రాకేమీ లేదు… ఆయన భార్య ఈమధ్య చనిపోయింది, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు… అందరికీ పెళ్లిళ్లయ్యాయి… కానీ తనవాళ్లు ఎవరూ తనతో ఉండటం లేదు… మంచికీ, చెడుకూ ఆయనకు ఈ వృద్ధాప్యంలో ఓ తోడు కావాలి… అది ఆయన అవసరం… ఆయన పరిణయం కావాలని కోరుకున్నాడు తప్ప ప్రణయం కథేమీ లేదు ఇక్కడ… ఆమెకు ఐదేళ్ల క్రితం భర్త మరణించాడు… ఓ పాప… కూలీ పని చేస్తూ పొట్టుపోసుకుంటోంది… ఒంటరిగానే ఉంటోంది… ఈ ముసలాయన అడగ్గానే అంగీకరించింది… ఆర్థికంగా ఓ ఆసరా… తన అవసరం అది… అవే ఒకరికొకరు చెప్పుకున్నారు, ఇద్దరూ కన్విన్సయ్యారు… వాళ్ల కుటుంబసభ్యులూ ఒప్పుకున్నారు… సింపుల్‌గా ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు… ఇందులో తప్పేమీ లేదు… ఇద్దరూ జీవితాన్ని చూసినవాళ్లే… అన్నీ అర్థం చేసుకునే దండలు మార్చుకున్నారు… అందరికీ నచ్చాలని ఏమీ లేదు… నచ్చి చప్పట్లు కొట్టేవాళ్లూ ఉంటారు… ఏం, అప్పట్లో ఎన్టీయార్ లక్ష్మిపార్వతిని పెళ్లిచేసుకోలేదా..? ఇదే సమాజం ఆమోదించలేదా..? ఇదీ అంతే… ఏజ్ తేడా పెళ్లిళ్లు బోలెడు జరుగుతూనే ఉంటయ్… అయితే ఆమె మొహాన్ని ఈ వార్తలో ఫోటోలో బ్లర్ చేయడం దేనికి..? ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారూ… మీకేమైనా ఐడియా ఉందా..? అరెరె, నేను గమనించనేలేదు సుమీ అంటారా..?!
Ads
Share this Article