సినిమా అంటేనే దృశ్య ప్రధానం… కథను సీన్లు చెప్పాలి, పెద్ద పెద్ద స్పీచులు కాదు… డైలాగులు కాదు… వోకే, సినిమాకు మంచి డైలాగులు బలం, కానీ డైలాగులే ఏ సినిమాకూ బలం కాదు..! బొమ్మరిల్లు అని అప్పట్లో ఓ హిట్ సినిమా తీసిన భాస్కర్‌కు ఈ విషయం తెలియక కాదు, కానీ ఆయన నమ్ముకున్న పంథా అదే..! మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనే ఓ డైలాగ్… తామరాకు మీద రసం… అవును, ఈ దర్శకుడు ఏదో చెప్పాలనుకుని ఎటో దారితప్పి, కన్‌ఫ్యూజన్‌లో ఎటెటో వెళ్లిపోయాడు… ఈ సినిమా చూస్తున్నంతసేపూ షాదీ ముబారక్ సినిమా గుర్తొస్తే అది మీ తప్పు కాదు, బహూశా ఈ దర్శకుడు ఆ సినిమాను చూసి ఉండకపోవచ్చు..!
ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కామెడీ లేకపోతే నడవదు… జనానికి సినిమాల్లో వినోదం కావాలి… అందుకే అందరు దర్శకుల్లాగే ఫస్టాఫ్ మొత్తం కామెడీని నమ్ముకున్నాడు దర్శకుడు… కానీ అదొక్కటే సరిపోదు కదా, సెకండాఫ్‌లోనైనా సీరియస్ మూడ్‌లోకి పోవాల్సిందే… కానీ దాన్ని ఎటు తీసుకెళ్లాలో దర్శకుడికి ఓ క్లారిటీ లేకుండా పోయింది… పదే పదే పెళ్లిచూపుల సీన్లు బోర్ అనిపిస్తాయి… సెకండాఫ్‌లో పలు సీన్లు కూడా బోర్… అనేకచోట్ల సినిమాటిక్ ట్రీట్‌మెంట్… సిల్లీగా ఉంటయ్… ఈ దర్శకుడు సినిమా తీసి చాలా రోజులైంది కదా, అందుకే కన్‌ఫ్యూజన్ ఆవరించినట్టుంది… పూజా హెగ్డే అంటే కేవలం కాళ్లు, తొడలు మాత్రమే అని మరీ త్రివిక్రమ్ తరహాలో ఆలోచించలేదు ఈ దర్శకుడు భాస్కర్… వాటిని ప్రేమించినా సరే, మరీ ‘నీ కాళ్లను పట్టుకు…’ అంటూ ఆ కాళ్ల మీద పడిపోలేదు… అయితే… పూజా కాస్త ముదురు, అఖిల్ లేత… అందుకే కెమిస్ట్రీ సరిగ్గా శృతి కలిసినట్టు ఉండదు…
Ads
పూజా తనకు చేతనైనంతమేరకు బాగానే నటించడానికి కష్టపడింది… కానీ అఖిల్ ఇంకా చాలా చాలా దూరం ప్రయాణించాలి… నాగార్జున కొడుకుగా పుట్టగానే నటన రాదు అఖిల్… బాగా సాధన కావాలి, శిక్షణ కావాలి, ఇన్వాల్వ్‌మెంట్ కావాలి… సింగిల్ ఎక్స్‌ప్రెషన్‌తో కెరీర్ నిర్మాణం సాధ్యం కాదు బిడ్డా…! కాకపోతే ఈ పాత్ర ఎంపికలో తన జడ్జిమెంట్ కరెక్టు… మరీ బోరింగ్ కమర్షియల్ ఫార్మాట్‌లోకి వెళ్లిపోకుండా, సగటు తెలుగు హీరో అవలక్షణాల్లేకుండా, ప్లెయిన్‌గా ఉన్న లవబుల్ పాత్ర ఇది… కథకే ప్రాధాన్యం… మురళిశర్మ, ప్రగతి, వెన్నెల కిషోర్, పోసాని తదితరులు కూడా ఉన్నారు సినిమాలో… సినిమా అంతా అయిపోయాక, థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా… మీకు ప్రేమకూ రొమాన్స్‌కూ తేడా మీద క్లారిటీ రాకపోతే… ఇంతకీ పెళ్లికి అర్హత ఏమిటో, ఆ ఫార్ములా ఏమిటో క్లారిటీ రాకపోతే అది దర్శకుడి తప్పు… ఫాఫం, అఖిల్‌ను ఏమీ అనకండి… అసలే శ్రేయాతో పెళ్లి సంబంధం బెడిసికొట్టాక ఇప్పటికీ తనకే ఇంకేమీ సెట్ కాలేదు… సినిమాలు చూస్తేనేమో అయిదేళ్లుగా ఎక్కడేసిన గొంగడి అక్కడే… ఈ సినిమాయే కాస్త నయం… అఖిల్‌ను కొంతమేరకు నిలబెట్టొచ్చు… చాలా అంశాల్లో అసంతృప్తి అనిపించినా సరే, ఓవరాల్‌గా సగటు తెలుగు సినిమాకు భిన్నంగా ఉండటం కాస్త రిలీఫ్… అదే నడిపించాలి సినిమాను నాలుగు రోజులు…!!
Share this Article