ఒక పాత్ర అరవయ్యేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ చెబుతుంటుంది… కానీ ఆ ఫ్లాష్ బ్యాక్‌లో కూడా డ్రెస్సులు, ట్రెండ్లు అన్నీ తాజావే… అదెలా..? ఈ ఒక్క మెతుకు చాలు కదా పెళ్లిసందD అనబడే తాజా సినిమా గురించి చెప్పడానికి..! నిజానికి ఈ సినిమాకు ఓ రివ్యూ కూడా వేస్ట్… కానీ దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు అని ఉండటం, హీరో రోషన్ శ్రీకాంత్, ఊహ కొడుకు కావడం, అప్పట్లో పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ కావడం కారణాలతో ఈ సినిమా ఎలా ఉందీ అని ఓసారి చెప్పుకోవడం..! రాఘవేంద్రరావు పని ఎప్పుడో అయిపోయింది, అది అందరికీ తెలుసు, ఆయనకే ఇంకా తెలియడం లేదు… జీతెలుగు టీవీలో కృష్ణతులసి అని ఓ సీరియల్‌కు కూడా తనదే దర్శకత్వ పర్యవేక్షణ… అది ఫ్లాప్… తలాతోకాలేని కథనం, సగటు తెలుగు టీవీ సీరియల్ పైత్యమంతా కనిపిస్తుంది ఇందులో కూడా… కానీ రాఘవేంద్రరావే కనిపించడు… ఈ సినిమాలో కూడా అంతే… కథనంలో రాఘవేంద్రరావు కనిపించడు, కాకపోతే ఓ పాత్రలో కనిపిస్తాడు… అంతే…
ఆహా… అప్పటి పెళ్లిసందడి… ముద్దబంతి వంటి రవళి, పోకబంతి పూవు దీప్తి భట్నాగర్… నడుమ శ్రీకాంత్… కథ చిన్నదే… కానీ కీరవాణి పాటలు అదరగొట్టేశాడు… గోదావరోళ్ల మార్కు మర్యాదలు, హాస్యం… బ్రహ్మానందం, భరణి, శివాజీరాజా, ఏవీఎస్, బాబూమోహన్, శ్రీలక్ష్మి… ఫుల్ కామెడీ… అవే సినిమాను హిట్ చేశాయి… అదే సినిమా పేరు, అదే రాఘవేంద్రరావు, అదే కీరవాణి, ఆ హీరో కొడుకే… ప్చ్, ఏమైంది..? ఓ రుచీపచీ లేని వంట… రంగూరుచీవాసనాచిక్కదనం ఏమీ లేని ఏదో వింత వంటకం… ఆ పాటలు సోసో, ఆ కథనం సోసో, ఆ కథ సోసో… విపరీతంగా నిరాశపరిచింది దర్శకురాలు గౌరీ రోణంకి… అసలు ఇందులో రాఘవేంద్రరావు ఉద్దరించిన దర్శకత్వ పర్యవేక్షణ ఏమిటో మరి..? తన పేరు వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టున్నాడు అంతే…
Ads
సినిమా ఓ చెత్త… సరే, మరి నటులు..? రోషన్ సాదాసీదా సీన్లలో వోకే… డాన్సుల్లో, లుక్సులో వోకే… కానీ వాచికం, భావప్రదర్శన గట్రా చాలా చాలా మెరుగుపర్చుకోవాలి… భలేవారే, అవేవీ తెలియకుండా ఏళ్లుగా తెలుగు తెరను ఏలుతున్న హీరోలు లేరా అంటారా..? అయితే సరే..! హీరోయిన్ శ్రీలీల పర్లేదు… అసలు కథ, కథనమే అలా ఉంటే, నటీనటులకు చేయడానికి ఏముంటుంది..? ఏదో కనిపించారు, పోయారు… సరే, థియేటర్‌కు వెళ్లం గానీ, ఓటీటీకి వచ్చినప్పుడు చూడొచ్చా, టీవీల్లో వచ్చినప్పుడు చూడొచ్చా..? ఇదే మీ ప్రశ్న అయితే… మీ ఓపిక, మీ ఇష్టం… ఇంతకుమించి ఈ సినిమా గురించి ఏం రాసినా క్రూరమైన స్పేస్ వేస్ట్… వేస్టున్నర…!!
Share this Article