……… By…. Badari Narayan………….. కార్గిల్ కథలు- రాబిన్ మరియు రుక్సానా
రాజ్పుఠాణా రెజిమెంట్ లో లెఫ్టినెంట్ గా భాధ్యతలు. కాశ్మీర్ లో టెరరిజం నియంత్రణల పెట్రోలింగ్ యూనిట్లలో డ్యూటీ. డ్యూటీపై ఇంటి నుంచి వెళ్ళేదారిలో ఓ మూడేళ్ల పాప రోజూ కనిపించేది. పాప పేరు రుక్సానా. Kupwara దగ్గర కాండీ అన్న పల్లెలోని చిన్నగుడిసె ముందు నిలబడి, ఈ పాప ప్రతిరోజూ ఆ దారిలో వెళుతున్న మిలిటరీ బెటాలియన్ని చూస్తూండేది. అదే యూనిట్లలో ఉన్న మన రాబిన్ ఆ పాపను గమనించేవాడు. ముద్దుగా వున్న పాప అమాయకమైన కళ్ళలో ఏదో భయాన్ని కూడా గమనించాడు. ఆ పాప గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. రుక్సానా తండ్రి వృత్తిరీత్యా కార్పెంటర్. కానీ, మన సైన్యానికి ఇన్ఫార్మర్ అన్న అనుమానంతో, టెరరిస్టులు అతన్ని కాల్చి చంపారు. ఏడాదిక్రితం.., అంతే… తన రెండేళ్ల వయసులో కళ్ళ ముందే తండ్రిని ఇలా దారుణంగా కాల్చి చంపడం చూసిన రుక్సానాకు మాట ఆగిపోయిందిట..!
ఇదంతా తెలిసి విజయంత్ థాపర్ చాలా బాధపడ్డాడు. అప్పటినుంచి రోజూ ఆ పాపను చూసి చిన్నగా Smile చేసి, చేయూపేవాడు. క్రమేణా ఆ పాప కూడా జవాబుగా విజయంత్ ను చూసి smile చేసేది. అప్పుడప్పుడూ పాపకి చాక్లెట్ ఇచ్చేవాడు. అలాగే రుక్సానా వాళ్ళమ్మకు ఇంటి ఖర్చులకు డబ్బులిచ్చేవాడు. ఇలా మెల్లిగా రాబిన్, రుక్సానా మధ్య స్నేహం, ఆప్యాయతల బంధం కుదిరింది. అత్యంత ఆశ్చర్యకరంగా, ఈ మాటలాగిపోయిన రుక్సానా మళ్ళా మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ విశేషాలన్నీ తన తల్లికి తెలుపుతూ రుక్సానా కోసం కొత్త సల్వార్ కమీజ్ లు కుట్టించి పెట్టమని, సెలవులకొచ్చినప్పుడు తీసుకెళ్లి గిఫ్ట్ చేస్తానని చెప్పాడు. రాబిన్ వాళ్ళమ్మ కూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకుంది. ఇంతేకాక, తనకేదైనా జరిగినా రుక్సానాకు తప్పక సహాయం చేయాలని, వాళ్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ పాపకు ఆశ్రయం ఇవ్వాలనీ తన తండ్రికి వుత్తర రాశాడు. తర్వాత కొన్నాళ్ళకే కార్గిల్ యుద్ధం మొదలయింది.
Ads
పంజాబ్, హిమాచల్ రాష్ట్రాల సరిహద్దులో సట్లెజ్ నదీతీరంలోని “నయానంగల్” వూరివాడైన, విజయంత్ ధాపర్ అన్న పేరుగల, స్నేహితులు రాబిన్ అని ప్రేమతో పిలుచుకునే ఆ యోధుడు యుద్ధంలో వీరమరణం పొందాడు. అప్పటికి విజయంత్ వయస్సు కేవలం 22 సంవత్సరాలు. మన దేశం ఒక వీరుణ్ణి, దయా హృదయుడిని కోల్పోయింది. అంతేగాక మూడేళ్ళ పాప రుక్సానా అదృష్టవశాత్తు దొరికిన ఒకే ఒక్క ఆసరానూ కోల్పోయింది. దేశంకోసం పోరాడి చనిపోయిన 22 ఏళ్ళ విజయంత్ చివరి కోరిక తీర్చడం కోసం అతని తలిదండ్రులు రుక్సానా కోసం చాలా కష్టపడి వెదికి, చివరికి ఎలాగోలా రుక్సానాను కలవగలిగారు. *అప్పటి నుండీ రుక్సానా అన్ని బాధ్యతలు తామే తీసుకుని, చదివిస్తున్నారు…
రుక్సానా ఇప్పుడు 22 ఏళ్ళ కాలేజీ విద్యార్థిని. 22 ఏళ్ళకే దేశం కోసం ప్రాణాలిచ్చిన యోధుడు “వీరచక్ర విజయంత్ ధాపర్ ” సహృదయత, సేవాగుణం, రుక్సానాకు ఈనాటికీ అందుతున్నది. ఆమెకు పెళ్ళయితే, “విజయంత్ ” తరపున బహుమతి ఇవ్వడానికి సంతోషంగా ఎదురుచూస్తున్నారు మేజర్ వీరేంద్ర దంపతులు. విజయంత్ డైరీ రాసుకునేవాడట. అందులో ఒకచోట,
“నేను ముందడుగు వేస్తే
నన్ను అనుసరించండి.
ఒకవేళ పిరికివాడినై
వెన్నుచూపి తిరిగొస్తే
నన్నక్కడే కాల్చేయండి.
నేను పోరాడి మరణిస్తే
ప్రతీకారం తీర్చుకోండి”
…. అని రాసుకున్నాడు. మాతృభూమి కోసం పోరాడుతూ ప్రాణాలివ్వడం సైనికులకు గర్వకారణం అంటారు విజయంత్ తండ్రి మేజర్ వీరేంద్ర ధాపర్.
మనకు తెలియని, మనందరం తప్పక తెలుసుకోవలసిన ఇలాంటి అద్భుతమైన విషయాలను, గాధలను *KARGIL , Untold Stories from the War*,
పుస్తకంలో ( 2019 లో ప్రకటన) మనకు అందిస్తున్న రచయిత్రి Rachana Bisht Rawat…. ఆమె కుటుంబమంతా, తండ్రి, భర్త, సోదరుడు, అందరూ సైనికులు. 20 ఏళ్ళ పైబడి సాగుతున్న ఆమె రచనావ్యాసంగం చాలావరకు దేశం గురించి, సైనికుల గురించే వుంటుంది. చాలావరకు, Penguins Random House లో ఈమె రచనలు publish అవుతాయట. (బహ్రేన్ నివాసి కిరణ్ ఉపాధ్యాయ గారు “విశ్వవాణి” కన్నడ దినపత్రిక 30.8.2021 లో రాసిన కాలమ్ నుండి సేకరణ, అనువాదం ఇది.. ధన్యవాదాలు. (Post credit to Sri Kiran Upadhya, Bahrain article in VishwaVani kannada daily. )…
Share this Article