ఒక వార్త చక్కర్లు కొడుతోంది… నాగార్జున మలయాళంలో తీసిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడనేది ఆ వార్త… నిజమే కావచ్చు, కాకపోవచ్చు.., కానీ ఆశ్చర్యమే…! నిజమే అయితే అది సరైన నిర్ణయం కాదని చెప్పొచ్చు… నిజానికి ఆ సినిమా నాగార్జునకు ఏమాత్రం సూట్ కాదు… కారణాలున్నయ్… కాస్త వివరంగా చెప్పాలంటే… నాగార్జున పెద్దగా రీమేకుల్ని ఇష్టపడడు… తనవి స్ట్రెయిట్ సినిమాలే… ముందుగా ఆ సినిమా గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలి… చదువుకుని, కాస్త స్వేచ్చాభావనలున్న ఓ డాన్సర్ ఓ సంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా వస్తుంది… అక్కడి నుంచి ఆమె ఏ కష్టాలు పడిందనేదే కథ… చివరకు ఆమె ఆ ఆంక్షలు, చాకిరీ, కట్టుబాట్లను తెంచుకుని, ఆ బందీఖానా నుంచి బయటికి వచ్చేస్తుంది… నిజానికి ఇది హీరోయిన్ సెంట్రిక్ కథ… సంప్రదాయిక పోకడలు, అత్తింటి పద్ధతుల నడుమ బాగా అవస్థలు పడే ఓ కోడలి కోణంలో కథ నడుస్తుంది…
ఓ సాదాసీదా నటుడికయితే ఆ పాత్ర వోకే… కానీ నాగార్జున రేంజ్ వేరు… మనకు బాగా అలవాటైపోయిన తెలుగు సినిమా హీరో లక్షణాలు వేరు… ఆ లక్షణాల్లో ఈ కథ ఇమడదు… నాగార్జున ఇమడడు… నాగార్జున అంటేనే సోగ్గాడు, బంగార్రాజు, మన్మథుడు టైపు… ఆడవాళ్లు ఇష్టపడే హీరో… అలాంటిది నెెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ శాడిస్ట్ భర్త పాత్రలో నాగార్జునను తెలుగు ప్రేక్షకులు చూస్తారా..? నెవ్వర్…! అసలు తెలుగులో వర్ధమాన హీరోలే ఈ పాత్ర ఇష్టపడరు… పైగా ఇది హీరోయిన్ ప్రాధాన్యమున్న కథ… పోనీ, తను నటించకుండా కేవలం ఇతర నటీనటులతో తను స్వయంగా నిర్మిస్తాడా..? సినిమా బిజినెస్ మీద పరిజ్ఞానమున్న నాగార్జునకు ఈ సినిమా తెలుగులో తీస్తే దాని రిజల్ట్ ఏమిటో తెలియకుండా ఉండదు… ఇలాంటి కథలు మలయాళానికి వోకే… తెలుగులో కూడా సీరియస్ సినిమా వీక్షకులకు మాత్రమే కొంతమేరకు నచ్చవచ్చు గానీ సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు…
Ads
వాష్ బేసిన్ పైపు లీకేజీ, బొద్దింకలు… కట్టెలపొయ్యి మీదే అన్నం వండాలనీ, మిక్సీ వాడకుండా రుబ్బురోలు వాడాలనీ, వాషింగ్ మెషిన్ వాడకుండా బట్టల్ని చేత్తో ఉతకాలనీ ఆంక్షలు పెట్టే కుటుంబాలు ఇప్పుడు ఊహించగలమా..? బ్రష్షు మీద పేస్ట్ పెళ్లామే పెట్టివ్వాలి, బయటికి వెళ్తుంటే చెప్పులు తెచ్చి రెడీగా ఉంచాలి… ఇలాంటివి ఏ ఇళ్లల్లో ఉన్నాయి…? పోనీ, కథను ప్రేక్షకుడికి బలంగా ఎక్కించడానికి దర్శకుడు కాస్త ఎగ్జాగరేట్ చేశాడు అనుకుందాం… కథను శబరిమలలోకి రుతుమహిళల ప్రవేశం, నెలసరిలో అడవాళ్ల వర్క్, స్త్రీ సమస్యలపై మాట్లాడేవాళ్లపై కాషాయధారుల దాడులు వంటి పలు అంశాల్లోకి వెళ్లిపోతాడు దర్శకుడు… ఎందుకొచ్చిన తంటా అనుకుని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద ఓటీటీలు ఈ సినిమాను తీసుకోవడానికే నిరాకరించాయి… దాంతో మలయాళీ ఓటీటీ నీస్ట్రీమ్లో విడుదల చేయాల్సి వచ్చింది… తరువాత కొన్నాళ్లకు ప్రైమ్ తీసుకుంది… ఇలాంటి కంటెంటు ఓ సగటు తెలుగు అగ్ర హీరో సినిమాలో, అదీ నాగార్జున సినిమాలో ఊహించడం కష్టం…
సినిమా చివరలో హీరోయిన్ బయటికి వెళ్లిపోయి డాన్స్ శిక్షకురాలు అయిపోతుంది, భర్త మరో పెళ్లి చేసుకుంటాడు… పోనీ, నాగార్జున ఇమేజీకి తగ్గట్టుగా కథను మారిస్తే అసలు ఇక కథలో ఆ మలయాళీ సినిమా ఒరిజినాలిటీయే లేకుండా పోతుంది… ఏ సాయిపల్లవో, ఏ ఐశ్వర్యా రాజేషో ఇలాంటి పాత్రలకు సై అంటారు, కానీ శాడిస్ట్ భర్త పాత్ర చేయడానికి ఏ తెలుగు హీరో ముందుకు రావాలి..? భిన్న పాత్రలు చేసే హీరోలు కావాలని, భిన్నమైన కథలు తెరకెక్కాలని మనం కోరుకోవడమే గానీ అలాంటి కథల్ని, పాత్రల్ని యాక్సెప్ట్ చేసేవాళ్లు ఎందరున్నారు మన ఇండస్ట్రీలో..? అంతెందుకు.., అదే నాగార్జున కుటుంబానికి చెందిన చైతూ, అఖిల్, సుమంత్లే ఒప్పుకోరు..!! కారణం :: మనం ఓ టిపికల్ తెలుగు హీరో లక్షణాలకు అలవాటుపడిపోయాం… తెలుగు టీవీ సీరియళ్లు ఎంత చెత్తా నాన్సెన్స్ అయినా మనం చూస్తూనే ఉంటాం కదా… అలాగన్నమాట…!!
Share this Article