ఏదైనా ఇంగ్లిషు పదానికి ఈనాడు వాడు ఏదో పిచ్చి అనువాదం చేస్తాడు… అందరూ ఆహా, ఓహో అని కళ్లకద్దుకుంటారు… అంతర్జాలం దగ్గర నుంచి గుత్తేదార్ల వరకు ఎన్నెన్ని పదాలు..?! అలాగే తెలుగు అకాడమీ చేసే అనువాద పదాలు ఇంకా సంక్లిష్టంగా, అదేదో భాష అనుకునేలా ఉంటాయి… తెలుగు పాఠ్యగ్రంథాలు చదివితే బోలెడు ఇనుప గుగ్గిళ్లు దొరుకుతాయి… ఇక చట్టసభల్లో కనిపించే తెలుగు భాష అది వేరే ప్రపంచం… ప్రత్యేకించి బిల్లులు, చట్టాలు, వివరణలకు సంబంధించి అదో విషాదం… ఎవరో ఏదో తెలుగు పదాన్ని సృష్టించి వదిలితే ఇక అదే శరణ్యమా..? పోనీ, భాషకు పట్టుగొమ్మలుగా నిలవాల్సిన మీడియా ఆ అనువాద పదాల వ్యాప్తిలో కాస్త వెనుకామూందు ఆలోచించకూడదా..? గుడ్డిగా ఫాలో కావడమేనా..? ఇక మీడియాలో ఉన్న క్వాలిటీ సెల్స్‌కు, భాష తెలిసిన పెద్దలకు పనేమున్నట్టు..? సాక్షిలో ఈరోజు కనిపించిన ఓ శీర్షిక ఈ ఆలోచనల్లోనే పడేసింది… ఆఫ్టరాల్, ఇది ఓ చిన్న ఉదాహరణ కావచ్చు, కానీ విషయం చెప్పుకోవడానికి ఇది సరిపోతుంది ప్రస్తుతానికి…
ఇది సాక్షిలో వచ్చే వ్యవసాయ పేజీలో కనిపించిన హెడ్డింగ్… భేషైన బదనికలు… పత్రిక దృష్టిలో బదనికలు అంటే రెక్కల పురుగులు అట… అందులో సల్ఫిలాకార అనే పదం కూడా విచిత్రంగా ఉంది… సరే బదనికల దగ్గరకు వద్దాం… సదరు వ్యాసరచయిత కోణంలో బదనికలు అంటే పంటలను, చెట్లను ఆశించే తెగుళ్లు, పురుగులకు సహజమైన శత్రువులు… అవి దోమ తదితర చిన్న జీవులను తినేసి, చెట్లను, పంటలను కాపాడే మిత్రపరుగులు లేదా మిత్రజీవులు… నిజానికి బదనికలు అంటే ఆయుర్వేదంలో గానీ, తెలుగు సాహిత్యంలో గానీ, నిఘంటువుల్లో గానీ అర్థం వేరు… అవి పరాన్నమొక్కలు లేదా పరాన్న వృక్షజాతులు… చెట్ల కాండాలపై, కొమ్మలపై పెరిగి, తమ వేళ్లను హోస్ట్ చెట్టులోకి జొప్పించి, ఎంచక్కా తమకు కావాల్సిన పోషకాల్ని సంగ్రహిస్తూ బతికేస్తుంటయ్… చూడండి, సాక్షి వాడిన బదనికల అర్థానికీ, ఈ అర్థానికీ ఎంత తేడాయో…
Ads
కొద్దిరోజులుగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు బదనికలు అంటే సహజ జీవశత్రువులు అనే అర్థంలో వాడేస్తున్నారు కావచ్చు… ఎవరో యూనివర్శిటీలో ఆ పదాన్ని మొదట వాడటం స్టార్ట్ చేసి ఉండొచ్చు… ఇక దాని సరైన అర్థం తెలుసుకోకుండా అందరూ అనుసరిస్తూనే ఉన్నారు… సేమ్, మనం ముందే చెప్పుకున్నట్టు ఎవరో తప్పుడు అర్థం వచ్చేలా అనువదిస్తే, ఇక మీడియా కూడా దాన్ని శిరసావహించాలా..? ఇది బదనికలు అనే పదానికే కాదు, మనకు తెలియకుండానే మన బుర్రల్లోకి బలంగా ఎక్కించబడుతున్న చాలా చాలా అనువాద పదాలకు సంబంధించిన బాధ… భాష తెలిసినవాడు బదనికల గుడ్లు అనే పదాల్ని చదివి ఎంత క్లేశానికి గురవుతాడో…! ఎంత విరక్తిగా నవ్వుకుంటాడో…!! అవున్లెండి.., ఈమధ్య మీడియా ప్రయోగిస్తున్న రుధిర భాష ముందు… ఆఫ్టరాల్, ఇవెంత..! మనమే ఈ రెక్కల పురుగుల్ని భూతద్దంలో చూస్తున్నామేమో…! ఈనాడును చూసి సాక్షి వాతలు పెట్టుకుంటే మనకెందుకు బాధ..?!
Share this Article