మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్… అలియాస్ మా… పట్టుమని వేయి వోట్లు లేని ఈ అసోసియేషన్ ఎన్నికలు కులరొచ్చును కెలికీ కెలికీ కంపు కంపు చేశాయి… ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి రాయబడుతూనే ఉంది… మొన్న ఏపీ రాజకీయాల్లో కులసమీకరణాలకు, భావి పరిణామాలకు ఇవే సంకేతాలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొస్తే, నిన్న కన్నడ-తెలుగు చారిత్రక బంధాలకు ఎలా గండిపడ్డాయో ఏబీకే రాసుకొచ్చాడు… అంటే పెద్ద పెద్ద కలాలు సైతం స్పందించి ఆ ఎన్నికలకు ఓ విశేష ప్రాధాన్యాన్ని కల్పిస్తున్నయ్… ఇటు ప్రకాష్‌రాజ్, అటు మంచు విష్ణు… వాళ్ల వెనుక ఉన్న ‘మర్యాద రామన్న’లు బొచ్చెడు ప్రవచనాలు చెబుతూనే ఉన్నారు… జనం చూస్తున్నారు కదాని మీడియా కూడా అదుపు తప్పి తెగ చూపించేస్తోంది… కానీ నిజానికి ఇతరత్రా ట్రేడ్ యూనియన్లతో పోలిస్తే అది చాలా సబ్‌స్టాండర్డ్ అసోసియేషన్… వాళ్లది అదో ప్రపంచం… (అధో ప్రపంచం కాదు)… వాళ్ల ఆలోచనలు, అడుగులు, చేష్టలు అన్నీ అదోరకం… అధోరకం…
ఫేస్‌బుక్ వాడు ఇదుగోనోయ్ నీ మూడేళ్ల క్రితం మెమొరీ అంటూ ఓ లెటర్ హెడ్ చూపించాడు… ఏమైనా రాయవోయ్ అన్నట్టుగా..! ఆ లెటర్ హెడ్ చూడగానే తెగనవ్వొచ్చింది… ఆపుకోలేనంత… అదేసమయంలో కొన్ని చేదు నిజాల్ని కూడా అది స్పష్టం చేస్తోంది… ‘డొల్ల బుర్రల’ గురించే కాదు, స్వకులమర్దనాల గురించి…! కమ్మ ఆధిపత్యాన్ని బ్రేక్ చేసి, కాపును ప్రతిష్టించాలనే మెగాక్యాంపు తాపత్రయానికి ఓ అర్థం చెబుతోంది… ఒకసారి జాగ్రత్తగా చూడండి ఈ లెటర్ హెడ్… మా లోగోకు అటువైపు ఎన్టీయార్, ఇటువైపు ఏఎన్నార్… దిగువన ఆ ఇద్దరి దివ్య ఆశీస్సులతో అని ఓ వాక్యం ప్రముఖంగా కనిపిస్తుంది… తెలుగు ఇండస్ట్రీ అంటే ఆ ఇద్దరేనా..? వాళ్ల రేంజ్ కేవలం నటులేనా..? అంతకుమించి చాలా ఎక్కువా..? పైగా ఇండస్ట్రీలోని నటీనటులందరికీ ప్రాతినిధ్యం వహించే అసోసియేషన్‌కు ఆ ఇద్దరి బొమ్మలే ఎందుకు కావల్సి వచ్చినయ్..? ఇది ఏం చెబుతోంది..?
Ads
ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ చిరంజీవి (?) అని గుర్తుచేస్తున్నారు సరే, బాగానే ఉంది… పద్మభూషణ్ కూడా గుర్తుచేస్తున్నారు, అదీ బాగానే ఉంది… ఇటు పక్కన గౌరవనీయ ప్రధాన సలహాదారుగా ఉన్న డాక్టర్ కృష్ణ కూడా పద్మభూషణే సుమా అని గుర్తుచేస్తున్నారు… అదీ నిజమే… పర్లేదు… కానీ దిగువకు వస్తే H.E. Dr. Naresh. V.K అని రాసి ఉంటుంది… తను సంఘానికి ప్రధాన కార్యదర్శి ఆ సమయంలో… అంటే హిజ్ ఎక్సలెన్సీ… ఈ పదాన్ని ఎవరికి వాడతారో కూడా ఆ సంఘంలో ఎవరికీ తెలియదు… (ఏమో.., వాడితే గీడితే ఆ పదం మాకే కరెక్టు అనే సుపీరియర్ భావన కూడా కావచ్చు…) ఇంకా నవ్వొచ్చే అంశం ఏమిటంటే… ప్రధాన కార్యదర్శికి హిజ్ ఎక్సలెన్సీ… ఆ పక్కనే పాపం అధ్యక్షుడు పేరు కూడా రాసి ఉంటుంది… కానీ ఏ విశేషణలూ ఉండవు… ఏ స్తుతి పదాలూ కనిపించవ్… (ప్రస్తుత లెటర్ హెడ్ ఎలా ఉందో మనకు తెలియదు… మంచు మోహన్‌బాబు గౌరవార్థం మరో చీఫ్ అడ్వయిజర్ పోస్టు క్రియేట్ చేసి, చిరంజీవి- కృష్ణ మధ్యలో పద్మశ్రీ మోహన్‌బాబు అని తాజాగా రాస్తారేమో కూడా తెలియదు…)
చివరగా చెప్పుకునేది ఏమిటయ్యా అంటే..? మూడేళ్ల క్రితం తీత్లి తుపాన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి… తెలంగాణ కష్టాలంటే పెద్దగా స్పందించదు ఈ సంఘం కానీ… ఏపీకి నష్టం అంటే కొంత పెయిన్ ఫీలవుతుంది కదా పాపం… కానీ అసలే పేద సంఘం, డబ్బుల్లేవు… అందులో సభ్యులు కూడా ఏదో రోజువారీ జీతాలకు, కూలీకి పనిచేసే అణగారిన వర్గం… ఐనాసరే, ఆదుకోవాలనే తపనతో, కష్టమైనా సరే, 5 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించింది సంఘం… ఇదీ ‘మా’ తెలివి… ఆ విరాళాన్ని, ఆ సంకల్పాన్ని గౌరవిద్దాం, కానీ ఆ సభ్యుల రేంజ్ ఏమిటి..? ఈ విరాళం ఏమిటి..? హీరో సంపూర్ణేష్ (బాబు అనే సఫిక్స్ ఉంటుందా..? ఉండి ఉండదులే, మరీ అంత పెద్ద బాబు ఏమీ కాదుగా…) మొదట స్పందించి కొంత తనకు చేతనైనంత ప్రకటించాక, ఇక తప్పనిసరై మా అసోసియేషన్ ఇలా స్పందించినట్టుంది… ఇదండీ సదరు సంఘం రేంజ్… మనమేమో తెగ అంగీలు చింపేసుకుని, వాళ్లకు పెద్ద పెద్ద కిరీటాలు తగిలించేసి, భుజకీర్తులు తొడిగేసి, అపర దైవ స్వరూపుల్లా కీర్తించేసి… తరించిపోతున్నం..!! (ఈ 5 లక్షలు అనే సంఖ్య… ఏ తరుణ్ బాబు పబ్బులోనో ఏ వర్ధమాననటుడో తన ఆరేడుగురు దోస్తులకు ‘మత్తు పార్టీ’ ఇస్తే అయ్యే బిల్లులో ఎన్నో వంతు..?)
Share this Article