మనకు తెలిసిన ముఖ్యమంత్రులు… ప్రతిపక్షాలపై బూతులు, దాడులకు ప్రోత్సాహాలు, అక్రమాలు, ఆర్జన, వేల కోట్ల డీల్స్… చాలామంది… పేర్లు అనవసరం..! కానీ వాళ్లకు వ్యక్తిగత జీవితాలు లేవా..? ఉంటే గింటే మందు, పొగ, గెస్ట్ హౌజ్ రాసకార్యాలు, ఇతర విలాసాలు మాత్రమేనా..? ఇంకే అభిరుచులూ ఉండవా..? ఎప్పుడైనా అనిపించిందా ఇలా..? ఒక చిన్న వీడియో చూశాక నాకైతే అనిపించింది… మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో చేరితే, అదీ వారస రాజకీయాల్లో మునిగితే, ఇక సగటు భారతీయ రాజకీయ నాయకుడిలా సకల అవలక్షణాల్ని అలవర్చుకుని, మందలో ఒకడిగా బతకాల్సిందేనా..? అప్పుడప్పుడూ అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ వార్తలు వింటే ఆశ్చర్యం వేసేది… పర్వతారోహణకు పనికొచ్చే వెహికిల్స్ తీసుకుని, తనే డ్రైవ్ చేస్తూ, వందల కిలోమీటర్లు గుట్టల్లో, కాలువల్లో, అడవుల్లో పడుతూ లేస్తూ చిన్న చిన్న గ్రామాలను చేరుకుంటాడు… వెంట గన్‌మెన్ ఉన్నారా లేదా కూడా చూసుకోడు… రియల్లీ ఇంప్రెసివ్…
ఈయన్ని చూడండి… 43 ఏళ్ల వయస్సు… తనూ వారస రాజకీయ నాయకుడే… తండ్రి పేరు పీఏ సంగ్మా… ఆయన తెలుసు కదా, లోకసభ మాజీ స్పీకర్, అప్పట్లో విదేశీయత అంశంలో సోనియాపైనే తిరగబడ్డ ముఖ్యుల్లో ఒకడు… బడా నేతలంతా ఆమెను సీడబ్ల్యూసీ భేటీలో రాష్ట్రమాత అని కీర్తిస్తూ, భజిస్తుంటే, ఆమె విదేశీయత పార్టీకి గుదిబండ అవుతుందని బల్లగుద్ది వాదించాడు… అదుగో ఆ నాయకుడి కొడుకు పేరు కొన్రాడ్ సంగ్మా… పైన ఫోటోలో కనిపిస్తున్నది తనే… అమెరికా, లండన్‌లలో చదువుకున్నాడు, తరువాత తండ్రికి చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ పగ్గాలు చేపట్టాడు… ఇప్పుడు మేఘాలయ సీఎం తను… ఉంటయ్, ఒక సీఎంగా బోలెడు ఒత్తిళ్లు, వ్యాపకాలు, బిజీ షెడ్యూళ్లు ఉంటయ్… కానీ మనిషిగా తనేమిటి..? ఎంతసేపూ అధికారులు, కార్యకర్తలు, దిక్కుమాలిన రాజకీయ కార్యక్రమాలేనా..? మనిషికి ఓ వ్యక్తిగత జీవనం అంటూ ఏమీ ఉండదా..? తమ అభిరుచుల్ని పాతరేసుకోవాలా..? ఓసారి ఈ వీడియో చూడండి…
Ads
vintage classic ‘Summer of 69 ఆలపిస్తున్నాడు తను… ఒక్కడే… వెనుకాముందూ ఏ గన్‌మెనూ లేరు… ఏ అధికారిక పటాటోపాలు, అట్టహాసాలు, చుట్టూరా భజన బృందాలు లేవు, సహజంగానే ఈ వీడియో వైరల్ అయ్యింది… కాదా మరి..? మనకు తెలిసిన ముఖ్యమంత్రుల వ్యవహార ధోరణులు తెలుసు కదా… మరి ఈ వీడియో చూస్తే భిన్నంగా, ఆనందంగా ఉండదా ఏం..? వాళ్లదేముంది బ్రదర్, చిన్న స్టేట్, పెద్దగా తల్నొప్పులు ఏముంటయ్ అనేవాళ్లు కూడా ఉండొచ్చు… కానీ ఈశాన్య రాష్ట్రాల్లోనే ముఖ్యమంత్రులకు ఎక్కువ భద్రత సవాళ్లు, ఒత్తిళ్లు… చిటుక్కుమంటే చాలు, ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టేసి, కుర్చీ దింపేస్తారు… అంత చంచలమైన అధికారం… ఆ స్థితిలోనూ తన వ్యక్తిగత అభిరుచిని వదులుకోకుండా, ఓ మంచి ఆలాపనను అందుకున్న ఈ వారస సంగ్మాను చూస్తే ముచ్చటేసింది… ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా సరే…!!
Share this Article