వాడెవడో బోసిడీకే అని తిట్టాడుట… (ఈమాటను ఇలాగే రాయాల్సి వస్తున్న ఖర్మకు నా కలం మీద నాకే జాలేస్తోంది… కానీ ఇప్పుడు ఏపీలో చర్చ, గొడవ, ఉద్రిక్తత, దాడులు, రాజకీయాలు అన్నీ ఆ పదం మీదే కదా… రాయాల్సిన అనివార్యత…) తిడితే తిట్టాడు, వాడి సంస్కారం అది, సింపుల్‌గా లేపుకొచ్చి, ట్రిపుల్ ఆర్కు, అచ్చెన్నాయుడు చేసిన ‘కస్టడీ మర్యాదలు’ ఇంకాస్త గట్టిగా చేసి ఉంటే సరిపోయేది కదా… చేయరు, తిట్టడం వెనుకా ఓ ప్లాన్, ఆ తిట్టును బేస్ చేసుకుని పచ్చక్యాంపులో బీభత్సాన్ని క్రియేట్ చేయడం రియాక్షన్… పాలిటిక్స్ సాధించిన పరిణతి అన్నమాట ఇది… ఓ ఖాకీ పెద్దాయన అంటాడూ, ముఖ్యమైన పోస్టుల్లో అధికారంలో ఉన్నవారిని తిట్టడం తప్పు కదా అని..! తిడితే కేసు పెట్టు, జన్మలో మళ్లీ ఆ మాట అనడానికి కలలో కూడా సాహసించకుండా చేయి, అంతేతప్ప, పదవిలో ఉన్నవాళ్లను తిడితే తప్పు అనే సూత్రీకరణ ఏమిటి..? అంటే ఏ పదవిలో లేనివాళ్లను తిడితే పర్లేదనా..? తిట్లకు అధికారం ఇమ్యూనిటీ ఇస్తుందనా..? ఇదేం వాదన..?
మేం అంతే, తిడితే తన్నడమే, ఇకపైనా చూస్తారు అని మన సలహాలరెడ్డి గారు మరోసారి కస్సుమన్నాడు, అంటే బరాబర్ ఇలాగే చేస్తం, ఇంకా చేస్తం, మేం అధికారంలో ఉన్నాం, ఏం పీక్కుంటారో పీక్కొండి అని చెబుతున్నట్టా..? నన్ను తిడితే మావాళ్లకు బీపీ పెరిగి ఉంటుందిలే అని అధినేతే అర్జెంటుగా తెరమీదకు వచ్చి సమర్థిస్తాడు, ఇదేం ధోరణి..? వాడేదో తిట్టాడు, మరి ఈ పచ్చక్యాంపు బాసు మందలించలేదేం..? అంటే తమ రాజకీయాల్లో ఉద్దేశపూర్వకంగా తిట్టి, రెచ్చగొట్టి, బజారుకీడ్చి, రచ్చ చేసి, చలికాచుకునే ఎత్తుగడా..? లేక మా సంస్కారమే అంత అనే భావనా..? ఇక ఆ బాసు కొడుకు అయితే బోసిడీకే అనేది తిట్టే కాదంటాడట… సో, తిట్లు, వాటి తీవ్రతలను బట్టి, అర్థాలను బట్టి ఇలా ఉద్రిక్తతలు అన్నమాట..? మరి బెజవాడ నాని తిట్ల తీవ్రత అంత లేదు కాబట్టే తెలుగుదేశం పెద్దగా రియాక్ట్ కాలేదనుకోవాలా..? లేక లోపలేసి, తంతారు, అసలే అధికారంలో ఉన్నారు, కేసులు పెట్టేసి, సతాయిస్తారు అనే వెరపా..? మళ్లీ ఇప్పుడు నిరాహారదీక్షలట… బందులట… పాతాళస్థాయికి ఇంకా లోపల ఏముందని చూస్తున్నయ్ ఏపీ పాలిటిక్స్..?!
Ads
దొరికింది కదాని… ఇటు సాక్షి, అటు ఆంధ్రజ్యోతి జజ్జనకరి జనారే అన్నట్టు ఉసిగొల్పే కథనాలు… సమర్థనలు… ఎదుటిపక్షంపైకి రాళ్లు… అసలు బోసిడీకే పదానికి అర్థం ఇది, ఆ బూతు పుట్టుక ఇలా అని సోషల్ మీడియాలో వివరణలు, విశ్లేషణలు… ఆ బూతు గాఢతకు ఇతర బూతులతో పోలికలు… నిజానికి జనబాహుళ్యంలో అది మామూలు తిట్టుగా మారిపోయింది గానీ నార్త్ భాషలో పరమబూతు… అయితే మనవాళ్లు అలవోకగా వాడేసే అనేక పదాల్లాగే, అంటే కొందరికి ఊతపదాల్లాగే… ఇది కూడా… నీయమ్మ, నీయక్క అనేవి ఇంకా బూతులు కాదా..? కాస్త వినోదచానెళ్లు నయం, సోషల్ మీడియా కష్టపడి, కేసుల భయంతో ఆవిష్కరించిన మింగడం, గువ్వ, మొగ్గ అనే భాషను అలవాటు చేసుకుంది, కానీ న్యూస్ చానెళ్లకు మాత్రం ఆ సంస్కారం లేదు… యథాతథంగా నాయకుల సంస్కారభాషను ప్రసారం చేస్తూ, వాటిపై డిబేట్లు పెడుతూ తమ ‘సంస్కృతి’ని బట్టి తామూ పండుగ చేసుకుంటున్నయ్… వాటికి ఏ నియంత్రణా లేదుకదా, పైగా చలికాచుకోవడంలో ముందుంటయ్… ఎటొచ్చీ., రెచ్చగొట్టే కథనాలు ఇస్తున్నాయేమో తప్ప ఆ బూతుల్ని ప్రింట్ మీడియా యథాతథంగా అచ్చేయడం లేదు, అక్కడికి సంతోషం… తిట్ల మీద ఎడిటోరియల్ వ్యాసాలు కూడా పబ్లిష్ చేయవద్దని కోరుకుందాం…
కొన్నేళ్లక్రితం ఓ ఆంధ్రాయన మా ఊరికొచ్చాడు, పొలాలు లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు, తన ఊతపదం ‘తల్దెంగ’… ప్రతి వాక్యం ముందో, చివరో అది ఉండాల్సిందే… అలవాటైపోయింది… నీయమ్మ అనే తిట్టుకు మరింత వికృతరూపం అది… ఓసారి ఏదో పంచాయితీలో కూర్చుని పదే పదే ఈ మాట వాడుతూ ఉంటే, అక్కడే ఉన్న ఇద్దరుముగ్గురు యువకులు బడితె చేతబట్టి, మళ్లీ ఆ పదం వాడితే మూతిపళ్లు రాలతాయి నీయమ్మా అని బెదిరించారు… మీరు తిట్టిందీ అదేకదా అంటాడు ఆ పెద్దాయన.., నీయమ్మ, మేమం తిట్టామురా అంటారు వీళ్లు… అంటే వీళ్ల దృష్టిలో నీయమ్మ అనేది పెద్ద తిట్టు కాదు… అసలు పంచాయితీకన్నా ఈ పంచాయితీ ముదిరి, తన్నుకుని, కేసులు పెట్టుకున్నారు… ఆ ఊళ్లోనే ఒకింట్లో ఓ కొడుకు ఎక్కడెక్కడో తిరిగి అంటించుకున్న భాషాసంస్కారంతో బాడ్ఖావ్ అనే తిట్టు వాడాడు… ఆ తల్లి, ఆ తండ్రి వాడితో నాలుగురోజులు మాటలు మానేశారు… అది శిక్ష, అది ఆ కుటుంబసంస్కారం… కానీ ఇప్పుడు తిట్లతో చలికాచుకోవడమే వర్తమాన రాజకీయ సంస్కారం..! ట్రిపుల్ ఎక్స్ రేంజ్ కూడా దాటేసి, హార్పిక్ లెవల్‌కు చేరుకున్న నూతన ఒరవడి… ఉరవడి… మన రాజకీయాలు మన సమాజగతిని భ్రష్టుపట్టించగల ఏ కోణాన్ని కూడా వదలడం లేదు..! థూమీబచె..!! (కొన్ని తిట్లను అలాగే రాసేసినందుకు.., రాయబడినందుకు సిగ్గుపడుతూ…) సన్నాసి, థూమీబచె దగ్గరే ఆగిపోయిన తెలంగాణ సంస్కారం ఇంకా ఏమాత్రం ఎదగడం లేదు… ప్చ్, బాగా వెనకబడిపోయిన ప్రాంతం…!!
Share this Article