Sarve Bhavantu Sukhinah, Sarve Santu Niramaya…. అంటే… ‘అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి’… ఈ దిశలో మోడీ ప్రభుత్వం సాధించిన 100 కోట్ల వేక్సినేషన్‌ను మెచ్చుకోవచ్చు… ప్రపంచంలో ఇంత భారీ సంఖ్యలో టీకాలు వేసిన దేశం చైనా తరువాత భారతే… నిజానికి కరోనా హయాంలో మోడీ ప్రభుత్వపు డ్రగ్ అప్రూవల్ పాలసీలు, డ్రగ్ రేట్ పాలసీలు, మొదట్లో వేక్సిన్ అడ్డగోలు ధరల ఖరారు, రాష్ట్రాలపై భారం, ఆక్సిజెన్ కొరత, కీలకమందుల బ్లాక్‌మార్కెటింగ్, వేరే వేక్సిన్లను రానివ్వకపోవడం వంటి అనేకానేక వైఫల్యాలు మోడీ ఇమేజీని దారుణంగా దిగజార్చాయి… వేక్సిన్ల పాలసీలో మార్పులు చేసుకుని, ఫ్రీవేక్సిన్ పాలసీ తీసుకుని, ఆ పాత తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేసింది… ఇప్పుడు 100 కోట్ల మైలురాయితో కొంతమేరకు మరకను తొలగించుకోగలిగింది… అయితే..? ఇక్కడ మోడీ ప్రభుత్వాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం ఏమిటంటే..? మన దేశంలో ప్రతిపక్షాలది వితండ రాజకీయం… మైండ్ లెస్ పాలిటిక్స్.., ఎక్కడ ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా సమర్థించాలో, ఎక్కడ వ్యతిరేకించాలో తెలియదు… తెలియక కాదేమో, తెలిసిన మూర్ఖత్వమే కావచ్చు… అఫ్‌కోర్స్, బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే కదా… మరీ ప్రాంతీయ పార్టీల పైత్యం దేశరాజకీయాల్లో ఓ కరోనా వైరస్…
ఉదాహరణకు… సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వాటిని బీజేపీ వేక్సిన్లు అని ముద్రేసి, నేను నమ్మను, ఆ టీకాలు వేయించుకోనుపో అన్నాడు… నిలువెత్తు మూర్ఖత్వం… ఆ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ సిన్షా అయితే ఆ వేక్సిన్లు వేయించుకుంటే మగతనం పోతుందని వ్యాఖ్యానించాడు… ఇలాంటి పోకడలు మొత్తం వైద్య వ్యవస్థల్ని, పరిశోధనల్ని అవమానించినట్టే… ఆ సోయిలేదు ఆ పార్టీకి… ప్రాణాల మీద తీపి ఎవడినైనా పరుగు తీయిస్తుంది కదా, అదే అఖిలేషుడి తండ్రి ములాయం ఎంచక్కా వేక్సిన్ వేయించుకుని, ఫోటో కూడా దిగాడు… అఖిలేష్ టీకా వేసుకున్నాడా లేదా తెలియదు… కాంగ్రెస్ కూడా కొన్ని పిచ్చి వ్యాఖ్యలకు దిగినట్టు గుర్తు… ఇవేవీ పట్టించుకోకుండా ఓ యజ్ఞంలాగా వేక్సినేషన్ కొనసాగించడం పట్ల మోడీ సర్కారుకు అభినందనలు… దేశీయ వేక్సినేషన్‌కు అదనంగా వేక్సిన్ మైత్రి పేరుతో దాదాపు 95 దేశాలకు ఆరేడు కోట్ల వేక్సిన్లను సరఫరా చేసిన తీరు కూడా గుడ్… మొదట హైరిస్క్ కేటగిరీ, తరువాత 45 వయస్సుపైబడిన వాళ్లకు, ఆ తరువాత 18 ఏళ్లు పైబడినవాళ్లకు… ప్రయారిటీలవారీగా టీకాలను వేస్తూ, ఇప్పుడు పిల్లలకు కూడా వేక్సినేషన్ ఆలోచన దాకా వచ్చారు…
Ads
మొత్తం మన జనాభా 140 కోట్లుగా ఉజ్జాయింపు లెక్కేసుకుంటే… అందులో 18 ఏళ్లలోపు పిల్లల్ని తీసేస్తే… వేక్సిన్ అవసరమైన వారి సంఖ్య వంద కోట్లు అనుకుందాం… ఇప్పుడు వేసిన వంద కోట్ల టీకాల్లో 30 శాతం వరకూ డబుల్ డోస్… అంటే 60 కోట్ల వేక్సిన్లు వాళ్లవే… మిగతా 40 కోట్ల వేక్సిన్లు సింగిల్ డోస్ అని రఫ్‌గా లెక్కవేసినా… మొత్తం వేక్సిన్లు అవసరమున్న జనాభాలో దాదాపు 70 శాతం దాకా కనీసం సింగిల్ డోస్ లేదా డబుల్ డోస్ కవర్ చేసినట్టే… అంటే ఏ కోణంలో చూసినా మెరుగైన పనితీరే… కొత్త వేరియంట్లు కొత్తగా మనమీద పడకపోతే, థర్డ్ వేవ్ అనే ఓ ఊహాత్మక ప్రమాదం పైనబడకుండా ఉంటే… ఈ భారీ వేక్సినేషన్ మన జాతికి ఆ చైనా వైరస్ నుంచి ఎంతోకొంత రక్షణఛత్రాన్ని పట్టినట్టే..!!
Share this Article