రాంకో గ్రూప్ ఆడపడుచు… సత్యం గ్రూపు కోడలు… తను స్వతహాగా ఓ స్పిన్నింగ్ మిల్ ఎండీ… కాల్ హెల్త్ సర్వీసెస్ కొత్త ఆలోచనకు ప్రేరణ… అడుగు తీసి అడుగేస్తే విలాసం, సంపద, వైభోగం… కానీ ఆమె అభిరుచి వేరు… సర్టిఫైడ్ స్కూబా డ్రైవర్… శాస్త్రీయ నృత్యకారిణి… నాట్యం అంటే ఆమెకు పిచ్చి… నిశృంఖల అనే ఓ డాన్స్ స్కూల్ పెట్టింది… డాన్స్ మీద ఏదో మలయాళీ సినిమాలో నటించింది… నాట్యం పేరిట ఏదో షార్ట్ ఫిలిమ్ కూడా తీసింది… ఇప్పుడు దాన్నే ఫుల్ లెంత్ సినిమా చేసింది… దేనికి..? అది తన నాట్యానికి ఓ ప్రదర్శన… దానికోసం ఓ కథ… ఆ కథలో ఆమె, ఆమె డాన్స్, ఓ సినిమా… ఇదీ నాట్యం అనే సినిమా నేపథ్యం, ఈ సంధ్యారాజు నేపథ్యం… అయితే..? నాట్యమే ప్రదర్శించాలంటే దానికి సినిమా అవసరం లేదు, సంగీతమే కావాలంటే కచేరీ చాలు, కథ మాత్రమే కావాలంటే పుస్తకం సరిపోతుంది… సినిమా వేరు… దాని లక్షణం వేరు… రకరకాల ఎమోషన్స్ ఉండే కథలో సంగీతమైనా, నాట్యమైనా ఇమడాలే తప్ప, అవి మాత్రమే కథావస్తువులు కాలేవు… నాట్యం సినిమా దర్శకుడు కోరుకొండ రేవంత్ దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు… ఈ సినిమాకు తనే దర్శకుడు, కథ, ఛాయాగ్రహణం, కూర్పు, స్క్రీన్‌ప్లే… ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నీ తనే…
ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి… యండమూరి అప్పట్లో రచయితగా దూకుడు మీదున్న రోజుల్లో… వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందోబ్రహ్మ… అవి చదివి అనుభూతించాలే తప్ప వాటిని సినిమాగా దృశ్యబద్ధం చేయడం కష్టం… అందుకే ఆ కథలతో టీవీ సీరియల్, సినిమా ప్రయోగాలు విఫలమయ్యాయి… కొన్ని అక్షరాల్లోనే బాగుంటయ్, పాఠకుడు వేరు- ప్రేక్షకుడు వేరు… కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇద్దరూ ఒక్కటవుతారు… సేమ్, ఒక సిరిసిరిమువ్వను విశ్వనాథ్ మాత్రమే తీయగలిగాడు… ఒక ఆనంద భైరవిని జంధ్యాల మాత్రమే చేయగలిగాడు… ఆ సినిమాలు కమర్షియల్ సక్సెసా, కాదా అనేది వేరే సంగతి… కాకపోతే కళల్ని ప్రధానంగా ఫోకస్ చేసే సినిమా అంటే ఎమోషన్స్ బలంగా పండాలి… అదే ఈ నాట్యం సినిమాలో లోపించింది… సాగరసంగమం, శంకరాభరణం, సప్తపది, స్వర్ణకమలం, ఆనందభైరవి వంటి సినిమాల్లో నాట్యం ఓ అంతర్భాగం మాత్రమే… అలాగే శంకరాభరణం, స్వాతికిరణంలో సంగీతం ఓ పార్ట్… ఈ నాట్యం సినిమా సంధ్యారాజు సొంత సినిమా కాబట్టి లాభనష్టాల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవచ్చు, అలాంటప్పుడు కథ మీద, కథనం మీద ఇంకా బాగా కసరత్తు జరిగి ఉండాల్సింది… అప్పుడు ఆమె కోరుకున్నట్టుగా జనంలోకి సినిమా, తద్వారా ఆమె నాట్యం విస్తృతంగా రీచయ్యేది…
Ads
స్వర్ణకమలంలో భానుప్రియను, సిరిసిరిమువ్వలో జయప్రదను, సాగరసంగమంలో కమల్‌హాసన్‌ను కాసేపు పక్కనపెట్టండి… శాస్త్రీయనాట్యంలో మంచి ప్రతిభ కనబరిచేవాళ్లు ఎందుకో గానీ వాళ్లు సాధన చేసిన గీతాలకు మాత్రమే ఎమోషన్స్ కాస్త పలికించగలరు… జనరల్ నటనకొచ్చేసరికి మొహంలో ఏ ఫీలింగ్సూ పలకవు… ఒక సప్తపదిలో ఒక సబిత, ఒక శంకరాభరణంలో ఒక మంజుభార్గవి, ఒక ఆనందభైరవిలో ఒక మాళవిక… తాజాగా నాట్యంలో సంధ్యారాజు… నాట్యంలో ముద్రలు ఎంత ముఖ్యమో మొహంలో ఎమోషన్స్ పలకడం కూడా అంతే ముఖ్యం… ఇవన్నీ పక్కనపెడితే ఈ కథ ఓ నీరసం… కథనం మరీ నీరసం… ఒక్క కాదంబరి నృత్యరూపకం వరకూ బాగుంది… సంధ్యారాజు టేస్ట్ గుడ్, సంకల్పం గుడ్, ప్రయత్నం గుడ్, ప్రయాస గుడ్… కానీ వంట సరిగ్గా కుదరలేదు మేడమ్… అందుకే చప్పట్లు కొట్టలేకపోతున్నాం… సారీ…!!
Share this Article