‘బన్సీలాల్ ఈజే బాస్టడ్. వీసీ శుక్లా ఈజే బాస్టడ్. భజన్ లాల్ ఈజే బాస్టడ్. గవర్నర్ రామ్ లాల్ ఈజే బాస్టడ్ అండ్ సంజయ్ గాంధీ ఈజ్ ఆల్సో ఏ బాస్టడ్. ప్రైమ్ మినిస్టర్ మిసెస్ ఇందిరాగాంధీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ దీజ్ బాస్టడ్స్,’ అన్న ధైర్యవంతుడు ఎవరో కాదు– ప్రఖ్యాత జర్నలిస్టు అరుణ్ శౌరీ. సరిగ్గా 37 సంవత్సరాల క్రితం 1984 సెప్టెంబర్ లో హైదరాబాద్ బసంత్ టాకీస్ ఫంక్షన్ హాలులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, శౌరీ చాలా సునాయాసంగా– నలుగురు బతికున్న బడా కాంగ్రెస్ నేతలను, సాక్షాత్తూ ప్రధాని పదవిలో ఉన్న ఇందిరమ్మ దివంగత చిన్న కొడుకు సంజయ్ ను మనమందరం కాస్త తిట్టుగా పరిగణించే– బాస్టడ్ అని అభివర్ణించడం సభలో ఉన్న వారికి షాక్ కొట్టినంత పనైంది. కాని, సభ ముగిశాక ఎవరైనా ఆ విషయం ఎత్తితే ఒట్టు. ఇంగ్లిష్ డైలీలు కాని, తెలుగు దినపత్రికలు గాని ఒక్కటంటే ఒక్కటి కూడా– అరుణ్ శౌరీ అన్న మాటలను (బాస్టడ్స్) తమ వార్తల్లో రాయనే లేదు. ఈ మాటలు రాసే ధైర్యం ఆరోజున ఏ రిపోర్టరుకూ లేకపోయిందో లేక ఒకవేళ రాసినా ప్రచురించే సాహసం ఏ ఎడిటరుకూ లేకపోయిందో తెలియదు.
ఇంతకీ సందర్భం ఏమంటే, 1984 ఆగస్టు 16న తెలుగుదేశం స్థాపకుడు, ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావును ఇందిరాగాంధీ ప్రోద్బలంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గవర్నర్ ఠాకూర్ రామ్ లాల్ రాజ్యాంగ విరుద్ధంగా పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఈ పనిచేసిన కొద్ది గంటలలోపే నాదెండ్ల భాస్కరరావును సీఎంగా ప్రమాణం చేయించారు రామ్ లాల్. నెలరోజులపాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట జరిగిన ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో ఏపీసీఎల్సీ మొదలుకుని పీయూసీఎల్ వరకూ అనేక సంస్థలు రామ్ లాల్ చర్యను ఖండిస్తూ బహిరంగ సభలు జరిపాయి. ఈ ప్రజస్వామ్య వ్యతిరేక చర్యకు నిరసనగా ఎందరెందరో జాతీయ స్థాయి ప్రముఖులు, ఉద్యమకారులు దిల్లీ, ముంబై నుంచి నగరానికి వచ్చి సభల్లో మాట్లాడారు. ఈ క్రమంలోనే పీయూసీఎల్ హైదరాబాద్ శాఖ ఎంవీ రామమూర్తి ఆధ్వర్యంలో బసంత్ టాకీస్ లోపల పెట్టిన సభకు అరుణ్ శౌరీని ఆహ్వానించింది. అప్పట్లో నేను (ఇంకా పుట్టని ఉదయం దినపత్రిక కోసం) ట్రెయినీ సబ్ ఎడిటర్‌గా శిక్షణ పొందుతూ ఇలాంటి సభలకు హాజరయ్యేవాడిని. అరుణ్ శౌరీ గురించి అప్పటికే తెలిసిన నాకు ఆయన వాడిన బాస్టడ్ అనే మాట తప్పు అనిపించలేదు.
పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో పుట్టిన అరుణ్ శౌరీకి ఎంత ధైర్యం పదవిలో ఉన్న ప్రధాని ‘ఐరన్ లేడీ’ ఇందిరను బాస్టర్డ్స్ తల్లి అనడానికి? అనే ఆలోచన రాగానే, ‘ఉన్నత కుటుంబంలో పుట్టి దిల్లీ సెయింట్ స్టీవెన్స్ కాలేజీలో, అమెరికా యూనివర్సిటీలో (న్యూయార్క్ సిరాక్యూస్ వర్సిటీ) చదువుకుని ప్రపంచ బ్యాంక్ లో పనిచేసిన ఆంగ్ల జర్నలిస్టు శౌరీ కాకపోతే పెద్ద సదువులు ఉండని ఏ తెలుగు పాత్రికేయుడు అలా అనగలరు?’ అని నాలో నేను సర్దిచెప్పుకున్నా. అన్యాయం అనిపిస్తే పరుషంగా మాట్లాడే పంజాబీ అయిన శౌరీ ‘బాస్టడ్’ అనే మాట ఆ మాత్రం జంకు లేకుండా వాడడం సాధారణమే కదా, అని సరిపెట్టుకున్నా. కృష్ణా జిల్లా నడిబొడ్డున ఉన్న ఓ మోస్తరు పట్టణం నుంచి వచ్చిన నేనే ఎందరెందరిపైనో ఎగిరెగిరి పడుతూ ఎన్నో విషయాలు తెలిసీతెలియక మాట్లాడుతుండగా, గొప్ప చదువు చదివిన హస్తినవాసి ప్రధాని ఇందిరమ్మను ఆ మాత్రం తిట్టకపోతే ఎలా? అనుకున్నా. అదీగాక అరుణ్ శౌరీ ప్రస్తావించిన విద్యాచరణ్ (వీసీ) శుక్లా ఎమెర్జనీ కాలంలో బాలీవుడ్ హీరోయిన్ ఒకరిని తాను బసచేసిన బొంబాయి 5 స్టార్ హోటల్ గదికి రమ్మని అడిగేంత సాహసం చేస్తే, బీఆర్ చోప్ఢా జోక్యంతో ఆమెకు ప్రమాదం తప్పింది. హరియాణా మాజీ సీఎంలు బన్సీ, భజన్ లాల్ లు ఇద్దరూ ఎంత దిగజారిన నేతలో చెప్పాల్సిన పనిలేదు. ఇక సంజయ్ గాంధీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆయన భార్య మేనక, కొడుకు ఫిరోజ్ వరుణ్ ఇప్పుడు అంత సంతోషపడతారు. చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన రామ్ లాల్ ఏడు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో చేయకూడని పనిచేసి ఎన్టీఆర్ చేయి చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు.
Ads
బాస్టడ్ అనే ఆంగ్ల పదానికి అప్పట్లో చెడు అర్ధం ఉన్నట్టే మేం అనుకునేవాళ్లం. మొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి– బోషడికే అన్న మాటకు అర్ధం–లం..కొడక అని పొరపడినట్టుగానే బాస్టడ్ అనే మాటకు కూడా పెయిడ్ సెక్స్ వర్కర్ లేదా మన తెలుగు డిక్షనరీల్లో చెబుతున్నట్టుగా ‘జారజ’ అనే అర్ధం ఒక్కటే ఉందనుకునే వాళ్లం. నిజానికి ఇద్దరు స్త్రీపురుషులు పెళ్లికాకుండా పెట్టకున్న సంబంధం వల్ల పుట్టినోళ్లనే అర్ధంలో బాస్టడ్ ను వాడతారని తెలిసినా, ఎందుకనో లం..కొడక అనే అర్ధమే తెలుగోళ్లకు స్ఫురించేది. నీచుడు అనే అర్ధంలోనే తెల్లోళ్లు, చదువుకున్నోళ్లు దీన్ని తిట్టుగా ఎక్కువగా వాడతారనే వాస్తవం బుర్రకు ఎక్కేది కాదు. గత కొన్నేళ్లుగా పెళ్లి లేని సహజీవనం వల్ల పుట్టిన సంతానానికి కూడా సమాజంలో సమాన గౌరవం, అన్ని చట్టబద్ధ వారసత్వ హక్కులు ఇవ్వడం చాలా దేశాల్లో ఆరంభమైంది. 20వ శతాబ్దం చివరి నాటికే వివాహబంధం లేని జంటలకు పుట్టే సంతానం సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో బాస్టడ్ అంటే నీచ బుద్ధి కలవాడనే అర్ధంలోనే తిట్టుగా వాడుతున్నారు. మరి ఓ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున (కోఠీకి సమీపంలో) జరిగిన బహిరంగ సభలో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ వ్యతిరేక జర్నలిస్టుగా ముద్రపడిన అరుణ్ శౌరీ ‘బాస్టడ్ ప్రయోగం’ వల్ల ఎలాంటి ఇబ్బందిపడలేదు. వేధింపులు ఎదుర్కోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఇందిరాగాంధీని బాస్టడ్స్ కు మాతృమూర్తి అనడం వల్ల కనీసం ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా తనపై దాఖలు కాకుండానే అరుణ్ శౌరీ అదే రాత్రి విమానంలో దిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ ఊసు ఎత్తినోళ్లు లేరు.
ఇందిర అప్పటికి తాను పదిహేను సంవత్సరాలుగా ప్రధాని పదవిలో ఉండడం, తండ్రి నెహ్రూ అదివరకు 17 ఏళ్లు అదే కురిసీలో అధికారం చెలాయించడం వల్ల పుట్టిన అహంకారంతో రాజ్యాంగ విరుద్ధ చర్యకు ఏపీ గవర్నర్ ను పురమాయించారు. ఎన్టీఆర్ బర్తరఫ్ జరిగిన రెండ్రోజులకే అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ పత్రికలు ఈ చర్యను నిరసిస్తూ సంపాదకీయాలు రాశాయి. అసలు ఇందిర ‘ప్రపంచ ప్రఖ్యాత డెమొక్రాట్’ నెహ్రూ కూతురేనా? అంటూ సభ్య సమాజం అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో బాస్టడ్ కన్నా పెద్ద బూతు మాటలు ఇందిర పేరు ప్రస్తావించి వాడినా ఆమె ఏమీ చేయలేని పరిస్థితి దేశంలో కనిపించింది. అప్పటికే అమృత్ సర్ స్వర్ణదేవాలయంలోకి సైనికులను పంపిన తర్వాత, ప్రధాని ఇందిరకు పూర్వమున్న గౌరవమర్యాదలు తగ్గిపోతున్న పరిస్థితి. ఇందిరమ్మ తన చావుకు నెలా పదిహేను రోజులు ముందు ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ తో చేయించిన దుర్మార్గాన్ని వెంటనే జనం మరిచిపోవడానికి ఆమె హఠాన్మరణం తోడ్పడింది. నెల రోజులకే ఇందిరమ్మ తన తప్పు దిద్దుకున్నాగాని తెలుగు ప్రజలు ఆమె చర్యను క్షమించలేదు.
డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొత్తం 42లో కేవలం ఆరు లోక్ సభ సీట్లు మాత్రమే దక్కాయి. మరి ఈ రోజుల్లో అరుణ్ శౌరీ మాదిరిగా ప్రధానిని అలాంటి పదాలతో దూషించే పరిస్థితులు ఉన్నాయా? 1984లో మాదిరిగా కాకుండా ఎవరైనా ప్రధాని పదవిలో ఉన్న నేతను శౌరీ శైలిలో దూషిస్తే పత్రికలు ఇప్పుడు ఆ తిట్లను తప్పకుండా తమ వార్తల్లో రాస్తాయి. పత్రికలు రాయకపోతే లైవ్ లోనో, రికార్డు చేసో ఇలాంటి తిట్లను ప్రసారం చేసే డైనమిక్ టీవీ చానళ్లు ఉన్నాయి. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనే జంటల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో బాస్టడ్ ఇంకే మాత్రం ఇతరులను కించపరిచే తిట్టు కాదని మనం అనుకోవచ్చేమో! (అరుణ్ శౌరి తనలోని ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక, ఆనాడు ఆ పదాల్ని బహిరంగంగా, ఫ్లోలో వాడి ఉండవచ్చుగాక… అప్పుడు ఆంధ్రాలో ఇందిర చర్య పట్ల నెలకొన్న ఆగ్రహవాతావరణంలో ఆ పదాలు తీవ్ర అభ్యంతకరకరంగా ధ్వనించకపోవచ్చుగాక… కానీ ఆయన ఆ పదాల్ని వాడటం తప్పేననీ, సంయమన రాహిత్యమేననీ ‘ముచ్చట’ నిశ్చితాభిప్రాయం…)
Share this Article