అప్పుడెప్పుడో 1947లోనే మన దేశం పరాయి పాలన నుంచి విముక్తి పొందింది… కానీ మనవాళ్లకు ఇంకా ఆ బ్రిటిష్ వాళ్లకు దాస్యం చేసే బుద్ధులు పోలేదు… అంత త్వరగా పోవు… మన కలల్ని, మన కళల్ని, మన జీవితాల్ని, మన ప్రస్థానాన్ని ఇంకా ఆ కళ్లతోనే చూస్తున్నాం… తాజా ఉదాహరణ ఏమిటంటే..? సర్దార్ ఉధంసింగ్ సినిమాను ఆస్కార్ అవార్డుల పోటీ నుంచి తప్పించడం..! మొత్తం 14 సినిమాల్ని ప్రాథమికంగా ఎంపిక చేసింది జ్యూరీ… అందులో 15 మంది సభ్యులు… విక్కీ కౌశల్ నటించిన ఈ సర్దార్ ఉధం సినిమాతోపాటు విద్యాబాలన్ సినిమా షేర్ని, మలయాళ సినిమా నాయత్తు, తమిళ సినిమా కూళంగల్, మరో తమిళ సినిమా మండేలా తదితర సినిమాలు పరిశీలనకు వచ్చినయ్… ఈ జ్యూరీ అంతిమంగా కూళంగల్ సినిమాను ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక చేసింది…
నో డౌట్… కూళంగల్‌కు ఆ అర్హత ఉంది… కొత్త దర్శకుడు వినోద్‌రాజ్ కలలుగన్న సినిమా అది… తాగుబోతు తండ్రి, వదిలేసి వెళ్లిన తల్లి, ఓ కొడుకు… ఈ కథ యూనివర్శల్… కానీ కథను చెప్పిన తీరు మీద క్రిటిక్స్ నుంచి అప్లాజ్ పొందిన సినిమా… నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల సొంత సినిమా అది… దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు… సినిమా అంటేనే దృశ్యప్రధానం… వినిపించాల్సిన మాటలకన్నా చూపించాల్సిన సీన్లే బలంగా పడాలి… క్రియేటివిటీ ఉండాలి… దర్శకుడు వినోద్‌రాజ్ టేకింగ్ ఆ స్పిరిట్‌తోనే కొత్తగా, క్రియేటివ్‌గా సాగింది… ఫార్ములా, మసాలా సినిమాలకు సమాంతరంగా తమిళ కొత్త దర్శకులు తమిళ సినిమాకు కొత్త క్రియేటివ్ రెక్కలు తొడుగుతున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా కొన్నాళ్లుగా..! కొంతమేరకు మలయాళ సినిమా కూడా..! ఆ పరంపరలోనే ఈ సినిమా… అయితే..?
Ads
సర్దార్ ఉధం భారతీయ సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్లిన హిందీ సినిమా… చరిత్రకెక్కని ఓ ఫ్రీడమ్ స్ట్రగుల్ హీరో కథను దృశ్యబద్ధం చేసిన సినిమా… జలియన్‌వాలాబాగ్ ఉదంతం నాటి రోజుల్ని యథాతథంగా మన కళ్లముందు ఉంచుతాడు దర్శకుడు… ఆ నరమేధానికి ప్రతీకారంగా అప్పటి పంజాబ్ గవర్నర్‌ను లండన్ దాకా వెళ్లి మరీ హతమారుస్తాడు ఉధంసింగ్… బ్రిటిష్ పాలనపై సాగిన తిరుగుబాటుకు మరో పార్శ్వం… గాంధీలు, నెహ్రూలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాగించిన స్వాతంత్ర్య పోరాటమే తప్ప ఇతరత్రా సాగిన తిరుగుబాట్లు ఇప్పటివరకూ పెద్దగా చరిత్రలో రికార్డ్ కాలేదు… కాంగ్రెస్ కూడా నేతాజీ సాగించిన పోరును, భగత్‌సింగ్ తదితరులు సాయుధంగా సాగించిన తిరుగుబాటును కూడా ఎక్స్‌పోజ్ కానివ్వలేదు… అప్పుడూ, ఇప్పటిదాకా..!! మాటలు కాదు, 1930, 1940 నాటి రోజుల్ని కళ్లముందు పరచడం… సినిమా చిత్రీకరణలో భలే పర్‌ఫెక్షన్ కనిపిస్తుంది… కానీ అది ఆస్కార్ బరిలోకి రాకుండా పోయింది, కారణం :: జ్యూరీ ఈ సినిమాను బ్రిటిషర్లపై ద్వేషాన్ని వెళ్లగక్కిందట..!!
ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, జ్యూరీ సభ్యుడు ఇంద్రదీప్ దాస్‌గుప్తా వెల్లడించింది… ఒక చరిత్రను చెబితే అది కొత్తగా ద్వేషాన్ని చిమ్మడం ఎలా అవుతుంది..? రేప్పొద్దున ఇంకెవరైనా ప్రతిభావంతుడైన దర్శకుడు నేతాజీ జీవితచరిత్రను ఓ కొత్తకోణంలో చెబితే దాని మీద కూడా ఇలాగే ముద్రవేస్తారా..? చట్టాల ప్రకారం ఉధంసింగ్ చేసింది నేరమే కావచ్చుగాక, కానీ సగటు భారతీయుడి కోణంలో తను వీరుడు, యోధుడు… మాతృభూమి రుణం తీర్చుకున్న కొడుకు… ఈ భావనలతో జ్యూరీ సభ్యులు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయినట్టు..? జ్యూరీలో పంజాబ్ నేపథ్యమున్న సభ్యుల పాత్ర పెద్దగా లేకపోవడమా..? స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర హైలైట్ కావడం ప్రస్తుత బీజేపీ పాలకులకు ఇష్టం ఉండదని భావించారా..? సినిమాను ఆస్కార్ బరికి పంపిస్తే దాని గుణవిశేషాలేమిటో అంతర్జాతీయ జ్యూరీ ఆలోచిస్తుంది కదా, ఇక్కడే ఈ సంకుచిత మెదళ్లు తొక్కేయడం దేనికి..? హిస్టరీని జనానికి గుర్తుచేస్తే అది పాత గాయాల్ని కెలికినట్టు, ద్వేషాన్ని రేపినట్టు ఎందుకు అవుతుంది..? ఇది దేశాల నడుమ సంబంధాల్ని ప్రభావితం చేస్తుందా..? ఈ సినిమాతో లండన్ నారాజ్ అయిపోయి, ఇండియా మీద కోపం పెంచేసుకుంటుందా..? ఏం జ్యూరీ కోడిమెదళ్లురా బాబూ..!!
Share this Article