ష్… గ్రహాంతర జీవులు ఉన్నారు… అప్పుడప్పుడూ వచ్చిపోతున్నారు… అంతేకాదు, అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తున్నారు… ఆ ధూర్తదేశం ఆ సమాచారాన్ని మరే ఇతర దేశంతోనూ షేర్ చేసుకోవడం లేదు… ఎవరైనా రాస్తే వెంటనే నాసా వాడు ఖండించేస్తాడు… ఠాట్, అంతా అబద్దం అనేస్తాడు… మా ట్రంపు మీదొట్టు, అలాంటిదేమీ లేదోయ్ అని నమ్మబలుకుతాడు… అసలు నాసా ఆధ్వర్యంలో ఈ గ్రహాంతర జీవుల కోసం ఓ రహస్య ప్రాంతంలో ఓ కాలనీయే మెయింటెయిన్ చేస్తున్నారు… ఎవరినీ పోనివ్వరు… బోలెడు వార్తలొచ్చినయ్…
గత ఎన్నికల ముందు హిల్లరీ క్లింటన్ అందరికీ చెప్పింది… నన్ను గెలిపించండి, ఈ ఏలియెన్స్ గురించి ప్రపంచానికి వెల్లడిస్తాను అని ఆశచూపింది… కానీ అమెరికా జనమేమో ఆమెను ఓడించారు… ఆ రహస్యాలు బయటపడకుండా పోయాయి… ఈ వాచాల ట్రంపుడు అయినా బయటికి కక్కేస్తాడేమో అనుకున్నాం గానీ… ఇదొక్కటీ తమాయించుకున్నాడు… బహుశా నాసా వాళ్లు గ్రహాంతర జీవులతోనే దాడి చేయిస్తాం అని బెదిరించి ఉంటారులే…
Ads
అవునూ, మరి గ్రహాంతర జీవులతో కలిసి పనిచేస్తూ… ఆ ధూర్త చైనాకు, ఉత్తర కొరియాకు భయపడటం దేనికి అంటారా..? ఏమో… ఏం మిస్టరీ దాగుందో… అన్నట్టు… అసలు ఈ భూగోళం మీదే కాదు… గ్రహాంతరజీవులు ఈ అమెరికన్ శాస్త్రవేత్తలతో కలిసి అంగారక గ్రహం మీద ఓ అండర్ గ్రౌండ్ స్థావరం కూడా మెయింటెయిన్ చేస్తున్నారట… అంటే అప్పుడప్పుడూ వెళ్లి వస్తుంటారన్నమాట… వావ్… బాగుంది…
భూమిపై ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని, అప్పుడప్పుడూ మనుషుల్లో కలిసిపోయి తిరుగుతున్నారనేది తాజా వార్త… అబ్బే, ఎవరో రచయితో, సినిమా స్క్రిప్టరో, అవతార్ సినిమా నిర్మాతో చెప్పడం లేదు… ఇజ్రాయిల్ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ చెబుతున్నాడు… మరి ఈయనకెలా తెలుసు అంటారా..? సదరు గ్రహాంతర జీవులు ఇజ్రాయిల్‌తో కూడా కలిసి పనిచేస్తున్నారట…
ఎహె… అన్నీ పిచ్చి మాటలు… వయస్సు ఎక్కువై, ఏదేదో సంధి ప్రేలాపనకు దిగుతున్నాడేమో అని కొట్టేద్దామంటారా..? నో, నో… 87 ఏళ్ల ఈ పెద్ద మనిషి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అమ్మతోడు, నన్ను నమ్మండి బాస్ అంటున్నాడు… అయిదేళ్ల క్రితం అయితే ఇవన్నీ చెబితే తనను పిచ్చాసుపత్రిలో వేసేవారేమో, ఇప్పుడు పర్లేదు, నాకొచ్చిన నష్టమేమీ లేదు అట… ఈయన తక్కువవాడేమీ కాదు… ఆ దేశ స్పేస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌కు ముప్ఫయ్ ఏళ్లపాటు చీఫ్…
మనుషులు, అంతరిక్ష జీవులతో ఒక గాలాక్టిక్ ఫెడరేషన్ కూడా ఏర్పాటైందంటున్నాడు… స్పేస్ స్టేషన్లాగే అంగారక గ్రహం అండర్ గ్రౌండ్లో ఒక స్థావరం ఉందట… అక్కడ అమెరికన్, ఏలియన్ సైంటిస్టులు కలిసి పనిచేస్తున్నారట… ఏం పనిచేస్తున్నారు అంటే, అది మాత్రం తనకు తెలియదు అంటున్నాడు…
‘నాకు బోలెడు డిగ్రీలున్నయ్, డాక్టరేట్లున్నయ్… ఇప్పుడు నన్ను ఎవరైనా పిచ్చోడు అనుకున్నా పెద్ద ఫరక్ పడదు… నిజాల్ని చెబుతున్నాను’’ అని నమ్మకంగా చెబుతున్నాడు… ఇంకా ఈ ఇంటర్వ్యూ చదివాడో లేదో మన తెలుగు ప్రముఖుడు ఒకాయన… చదివితే… అప్పుడప్పుడూ నన్ను కూడా కలుస్తున్నారు అని చెప్పేవాడేమో… నేనే వాళ్లను అజ్ఞాతంగా ఉండమని చెప్పాను అని కూడా అనేవాడేమో…! అయినా మనకెందుకులెండి…!!
Share this Article