కొడుకు డాక్టర్ కావాలన్నది తండ్రి కల.. యాక్టర్ కావాలన్నది కొడుకు సంకల్పం. అందుకే ఆ రైతు కొడుకు ఇప్పుడు మనందరికీ వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాయ్ గా సుపరిచితుడైనాడు. ఏడేళ్లకే చదువుల పేరిట హాస్టల్ బాట పట్టిన మనోజ్.. తాను చిన్ననాట సీనియర్ల ర్యాగింగ్ కీ.. ర్యాగింగ్ పేరిట వేధింపులకీ గురైనవాడే. ఒక మ్యాగజీన్ లో నసీరుద్దీన్ షా ఇంటర్వ్యూ పరోక్షంగా మనోజ్ బాజ్ పాయ్ లోని నటుణ్ని తట్టిలేపింది. ఆ కాంక్షే బలపడి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు దరఖాస్తు చేసుకునేలా చేసింది. ఇక అక్కడినుంచి ప్రారంభమైన మనోజ్ జర్నీ.. ఎప్పటికప్పుడు పునర్ జీవితాన్ని నిర్మించుకునే ఓ ఫినిక్స్ పక్షి తరహాలో కనిపిస్తుంటుంది.
ఒక రాజ్ బబ్బర్, ఓ ఓంపురి వంటి నటులంతా వచ్చిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు దొరికితే.. తానాశించిన రంగంలో స్థిరపడవచ్చన్నది మనోజ్ బాజ్ పాయ్ ఆశ. కానీ అంత ఈజీగా సీటు దొరికుంటే కథ ఇప్పటిలానే ఉండేదో, కాదో ఊహించలేం కానీ… అందులో రిజెక్టైన ప్రతీసారీ కసి పెరిగింది. అయితే ఆ కసిలోంచి డెస్పరేషన్ లెవల్స్ కు చేరుకున్న మనోజ్ ఒకానొక దశలో ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకునే స్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో తనను బాగా గమనించిన స్నేహితులు.. కనీసం తనను ఒక్కసారి కూడా ఒంటరిగా వదిలేందుకు సిద్ధపడలేకపోయారని.. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటారు మనోజ్. ఇదే విషయాన్ని కలర్స్ ఛానల్ లో ప్రసారమవుతున్న అనుపమ్ ఖేర్ షోలో కూడా ఈమధ్యే మనోజ్ చెప్పుకొచ్చాడు కూడాను!
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు తను మొదటిసారి సెలక్ట్ కాకపోవడం మనోజ్ లో తీవ్ర వేదనకు గురైంది. ఎలాగోలా స్నేహితుల రూపకంగా మనోజ్ తను మళ్లీ వీథి నాటకాలు వేసుకోవడంలో బిజీ అయ్యాడు. అలా మళ్లీ కాలం మెల్లిగా గడుస్తున్న సమయంలో మరోసారి ఎన్ఎస్డీకి అప్లై చేశాడు మనోజ్. కానీ మళ్లీ తిరస్కరణే ఎదురైంది. అప్పుడు ది ఫ్రీ బర్డ్స్ కలెక్టివ్ పేరుతో నటన, దర్శకత్వ శాఖల్లో ట్రైనింగ్ ఇచ్చే బారీ జాన్ తో పరిచయం ఏర్పడింది. బారీ జాన్ ఢిల్లీలోని ప్రముఖ థియేటర్ యాక్షన్ గ్రూప్ వ్యవస్థాపకుడు కూడాను! ఆ పరిచయంతో చిన్నాచితకా వేషాలతో తన బతుకుచిత్రం నడిచేది. అయినా మనోజ్ ఫోకసంతా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు దక్కించుకోవడం కోసమే! అలా మూడోసారీ ఎన్ఎస్డీకి దరఖాస్తు చేసుకున్నాడు మనోజ్ బాజ్ పాయ్.
Ads
కానీ మళ్లీ అక్కడ నటనలో తర్ఫీదు పొందేందుకు అనర్హుడయ్యాడు మనోజ్ బాజ్ పాయ్. కానీ మూడుసార్లు ఎన్ఎస్డీలో తిరస్కరణకు గురైన మనోజ్ ఏకంగా.. అదే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నాల్గోసారి నటనలో తర్ఫీదిచ్చే ఫ్యాకల్టీ పోస్టునే అందుకునే స్థాయికెదిగాడు. 1994లో మనోజ్ బాజ్ పాయ్ జీవితంలో ఓ మలుపు మొదలైంది. తిగ్మాన్షూ దూలియా అనే స్క్రీన్ రైటర్, క్యాస్టింగ్ డైరెక్టర్ తన డొక్కు స్కూటర్ పై ఢిల్లీ వీథుల్లో గల్లీలో ఓ టీ కొట్టులో కొలువైన బాజ్ పాయ్ కోసం వెతుక్కుంటూ వచ్చాడు. చాయ్ షాపులో ఉన్న మనోజ్ ని కలిసి బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఛాయ్ పడితే ఎలా ఉంటుందో అలాంటి వార్తోటి చెప్పాడు. శేఖర్ కపూర్ తను తీయబోతున్న బ్యాండిట్ క్వీన్ సినిమాలో మనోజ్ బాజ్ పాయ్ కి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడన్నదే ఆ వార్త! కానీ ముంబైకి వెళ్లాలి. తన ఆర్థిక పరిస్థితికి అదప్పటికి కష్టమైన విషయం. కానీ, పట్టువదలని విక్రమార్కుడై ఎలాగోలా ముంబై చేరుకున్నాడు. ఐదుగురు దోస్తులతో కలిసి ఓ కోలీ పట్టుకున్నాడు. ఇక యాక్టర్ గా తన జీవిత అదృష్టాన్ని పరీక్షించుకుంటూ తిరుగుతున్నాడు. కానీ, ఎక్కడా నో రోల్స్! ఇదే నిరాశపర్చే మాట వినిపించేది మనోజ్ కి. ఒకరోజు ఓ అసిస్టెంట్ డైరెక్టరే మనోజ్ ఫోటోను చించిపారేశాడు. నేను కూడా చాలా అవకాశాలు కోల్పోయాను. నువ్వు పెద్దగా బాధ పడాల్సిందేమీ లేదని చెప్పి పంపించేశాడు. మొత్తంగా బిగ్ స్క్రీన్ కి మనోజ్ బాజ్ పాయ్ పనికిరాడని.. ఆయన్ను స్క్రీన్ టెస్టులు చేసినవారంతా తేల్చేశారు ఆయన తొలినాటి ప్రయత్నాల్లో! పైగా వడాపావ్ మీద ఎందరో బతికే ముంబైలో… అదే వడాపావ్ కూడా మనోజ్ కు కాస్ట్లీ ఫుడ్ ఐటమైన వేళది!!
మొత్తమ్మీద ఇవాళ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న మనోజ్ బాజ్ పాయ్ జీవితంలో 1993 నుంచి 1997 వరకూ ఓ గడ్డుకాలంగా.. దినదినగండంగా గడిచిన పరిస్థితి. ఆ సమయంలో కాళ్లకున్న చెప్పులరిగేలా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా మనోజ్ తిరగని స్టూడియో లేదు. అంతపెద్ద ఆర్థిక రాజధానిలో నా అన్నవాళ్లెవ్వరూ లేక.. తాననుకున్న ఫీల్డ్ లో అవకాశాలు దక్కక.. బతుకీదడం నిజంగా ఓ సవాల్ గా పరిణమించింది మనోజ్ కి. అయితే తన కడుపులో ఉన్న ఆకలి మాత్రం తను విజయం సాధించాలన్న ఆకలి ముందు తలవంచింది. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకు ఓ సీరియల్ లో అవకాశమొచ్చింది. ప్రతీ ఎపిసోడ్ కు 1500 రూపాయలు రావడంతో.. తరిమి తరిమి తంతున్న విధి నుంచి కొద్దిగా ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత 1998లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సత్య ఇండియన్ సెల్యూలాయిడ్ పై ఒక చరిత్ర సృష్టించి… ఇక మనోజ్ బాజ్ పాయ్ జీవిత చరిత్రనే తిరగరాసింది. మూడు సార్లు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటుకు తిరస్కరణకు గురై.. ఇప్పుడు భారతదేశ నాల్గో అత్యుత్తమ పద్మశ్రీ పౌర పురస్కారాన్నందుకున్న నటుడిగా అవతరించిన పట్టుదల మనోజ్ బాజ్ పాయ్!
ఆ తర్వాత వచ్చిన శూల్ నుంచి ఈమధ్యే ప్రైమ్ లో హిట్టైన సెకండ్ సీజన్ ఫ్యామిలీ మ్యాన్.. ఆ తర్వాత ప్రాజెక్టుల వరకూ మనోజ్ ఓ సక్సెస్ ఫుల్ అండ్ వెర్సటైల్ యాక్టర్ గా తనను తాను నిరూపించుకున్న ఓ తిరుగులేని నటుడు. 2018లో వచ్చిన మరో అద్భుతమైన సినిమా భోంస్లేలో నటనకుగాను.. 67వ జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా.. ఈ అక్టోబర్ 25న రెండోసారి ఉత్తమ నటుడి అవార్డునందుకున్న పద్మశ్రీ మనోజ్ బాజ్ పాయ్ SUCCESS కథకు.. మరో కోణమే స్టార్ గా ఎదిగేకంటే ముందు ఆయన ఈ STRUGLE వ్యథ!………………………… రమణ కొంటికర్ల…✍🏼
Share this Article