తిండిగింజలు సాగుచేస్తే ఖబడ్దార్ అని ఉరుముతున్నది సర్కారు… వరి వేస్తే గంజాయి వేసినట్టే అన్నంత సీరియస్‌గా కలెక్టర్లు రెచ్చిపోయి ఆంక్షల కొరడా పట్టుకున్నారు… నాగరికత, వ్యవసాయం నేర్చిన తరువాత ఇలా తిండిగింజల సాగు మీద నిషేధాన్ని అమలు చేస్తున్నది ప్రపంచ చరిత్రలోనే ఇది మొట్టమొదటి ప్రభుత్వం కావచ్చు బహుశా… ఉద్యమానంతరం ఏర్పడిన తెలంగాణ తొలిసర్కారు చరిత్రలో నిలిచిపోతుంది… ఒక్క గింజ కూడా కొనబోం అని మంత్రులే ప్రకటనలు చేస్తున్నారు… అదేమంటే..? మోడీ కొనడు, కొంటలేడు… సో వాట్..? నువ్వు ఆలోచించిన ఆల్టర్నేటివ్స్ ఏమిటి..? మోడీ దుర్మార్గుడు సరే, నీ సాయం ఏమిటి..? నీకు చేతకాదా..? ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవకాశాల్ని ఎందుకు ఎక్స్‌ప్లోర్ చేయవు..? అసలు ఇన్నాళ్లుగా చేస్తున్నదేమిటి..? పంచిపెట్టే పథకాల్లో ప్రపంచానికి మార్గదర్శివి, ఈ ఒక్కటీ ఎందుకు చేతకాదు..? మొక్కజొన్న కొనబోం, బంద్ పెట్టు, వరి కొనబోం, బంద్ పెట్టు… ఏమిటీ నిషేధాలు… మరి ఏం సాగు చేసుకుని బతకాలె…
ఎవరు అడగాలి..? ప్రతిపక్షం అడగాలి, మీడియా అడగాలి, పౌరసమాజం అడగాలి, కవులు-రచయితలు అడగాలి… కానీ అవన్నీ నిస్తేజమై పాలకుల పాదాల భజనలో పునీతమయ్యే పనిలో బిజీగా ఉన్నాయి… కాంగ్రెసే నయం… వెంటనే అందుకుంది… అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి పొద్దున్నే ప్రెస్‌మీట్ పెట్టి కడిగేశాడు… బీజేపీ ఇంకా సోయిలోకి వచ్చినట్టు లేదు… అసలు దేనిపై స్పందించాలో దానికి ఓ దశ, ఓ దిశ లేదు, ఏదో కొట్టుకుపోతోంది అలా… ఇంకా డప్పు రచయితలు వరిసాగుతో సామాజిక నష్టాలేమిటో, కేసీయార్ భావిదర్శనం వెలుగులేమిటో ఇంకా వ్యాసాలు స్టార్ట్ చేయలేదు… సంతోషం… మీడియా సంగతి చూద్దాం… ప్రధాన పత్రికలు నాలుగు… నమస్తేను వదిలేయండి, అది అధికారిక డప్పు… వీలైతే వరి వేసే వాడి మీద దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టకూడదు అని ప్రత్యేక సంచికలు, వ్యాసాలు, కథనాలకు తెగబడుతుంది… ఇక నమస్తే సాక్షి అనే ఓ దిశ, దశ లేని పత్రిక కేసీయార్ పాదాల సాక్షిగా ఏమీ రాయదు… నమస్తే ఈనాడు అనేది ఇప్పటికే గజగజా వణికిపోతూ, కింద తడిచిపోతోంది… అది ఏమీ రాయదు… ఇదుగో ఇలాంటి వార్తలు రాసుకుంటుంది…
Ads
మక్కలు ఎండబెట్టుకునే వసతి లేక రైతులు రోడ్ల మీద ఆరబెట్టుకుంటున్నారు… కూలీలు దొరక్క పత్తి ఏరడానికి రైతులు నానా అవస్థలూ పడుతున్నారు అని రెండు ఫోటో వార్తలు… అవైనా ఒక్కచోట వేసి కాంప్రహెన్సివ్‌గా ప్రజెంట్ చేసే తెలివి ఉందా అంటే… అదీ గతి లేదు… ఒరే బాబూ… మక్కలు రోడ్డెక్కితే నష్టమేమిటి..? ఊరూరికి కల్లం అన్న ప్రభుత్వం హామీ ఏమైందో అడుగు..? అది చేతకాదు… రోడ్డెక్కిన మక్కలు, పత్తి కూలీల కోసం వెతలు వార్తలు కావని కాదు… కానీ అసలు వరి మీద నిషేధం వార్తేదీ..? నువ్వూ, నీదో పాత్రికేయం, నీదో ప్రజాకోణం..? ఇన్నివేల కోట్లు ప్రజల నుంచి దండుకున్నవ్, ప్రజల పట్ల కనీసబాధ్యతో, కృతజ్ఞతో అవసరం లేదా..? ఐనా అంతగా భయపడి చచ్చేవాడికి పత్రిక దేనికి..? ఈరోజుకు మళ్లీ ఆంధ్రజ్యోతే హీరో… బ్యానర్ స్టోరీ… చంద్రబాబు-ఆంధ్రజ్యోతి బంధాల మీద, ఆ అనుకూల కథనాల మీద మనకు సవాలక్ష అభ్యంతరాలు ఉండవచ్చుగాక… వేసే మసాలా మోతాదు మీద అసంతృప్తి ఉండవచ్చుగాక… కానీ జనం కోణంలో కథనాలు, ప్రొఫెషనల్ టెంపర్‌మెంట్ విషయంలో అదే గెలిచింది… నిలిచింది…!!
Share this Article