‘‘హెలో, చంద్రబాబుజీ… ఆప్ కైసా హై… సారీ, రెండురోజులు నా కోసం ట్రై చేశారట, మా ఆఫీసులో చెబుతున్నారు… మీరు రాగానే వెంటనే అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసేయాలనీ చెప్పాను… ఐనా మీకు అపాయింట్‌మెంట్ ఏమిటి బాబూజీ… నేరుగా వచ్చేయడమే… ఈలోపు మోడీ పిలిచి కాశ్మీర్ వెళ్లమన్నాడు… అక్కడ ఇబ్బందులు తెలుసు కదా మీకు.., ఐనా మీకు తెలియనివి ఏముంటయ్..? అక్కడికి మోడీకి చెప్పాను, భాయ్, బాబూజీ వస్తున్నారు అని… పోనీ, నేను ఉండను కదా, నువ్వు మాట్లాడు అన్నాను… కానీ నీ ఎదుట కూర్చుని తాపీగా మాట్లాడి, నీ ప్రశ్నలకు బదులు చెప్పేంత మాటపటుత్వం లేదన్నాడు… కాశ్మీర్ వెళ్లినా సరే, నా దృష్టి అంతా ఇక్కడే… అసలే మీరు కోపం మీద ఢిల్లీ వస్తున్నారు… ఆంధ్రజ్యోతిలో మీరు రాయించిన వార్తలు, ప్రత్యేకించి ఆ థంబ్ నెయిల్స్ కూడా మావాళ్లు గుజరాతీలోకి అనువాదం చేసి పెట్టారు… ఉగ్రరూపం, విశ్వరూపం, బీభత్సమే, రీసౌండే, పూనకాలే అని ఏమేమో రాశారు కదా… చదివాను… భయపడ్డాను… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫోన్ చేసి అలర్ట్ చేశాను కూడా…
మీరు మామూలుగా ఉంటేనే మీతో మాట్లాడటం కష్టం… అలాంటిది మహోగ్రరూపంతో వస్తున్నారంటే తట్టుకోవడం మరీ కష్టం… అందుకే ఎస్పీజీ వాళ్లను కూడా అలర్ట్ చేసి, వెంటనే కాశ్మీర్ ప్రోగ్రాం సగంలోనే ముగించుకుని హడావుడిగా బయల్దేరాను… నమ్మండి బాబూజీ… నేనొస్తున్నాను, బాబు గారు ఎక్కడుంటే అక్కడికి నేనే వెళ్లి కలుస్తాను అని మీకు కాల్ చేసి చెప్పమన్నాను మా స్టాఫ్‌కు… మీరేమో అప్పటికే కోపంతో ఢిల్లీ వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారట… విమానాన్ని అలాగే హైదరాబాద్ వైపు తిప్పు అని చెప్పాను పైలట్‌కు… కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉందని గుర్తొచ్చింది… ఢిల్లీలో దిగిపోవాల్సి వచ్చింది…
Ads
ఇదేనండీ మా మోడీతో సమస్య, పిలిచి, కప్పులో కాసింత చాయ్ పోసి, నేరుగా అడిగేస్తే పోయేది… పార్టీని విలీనం చేస్తావా అని… అదొక్కటే మార్గం, జగనేమో చెప్పినట్టు వింటాడు… వినకపోతే సంగతి వేరు… మీరేమో పొద్దున బాగానే ఉండి, రాత్రి ఉల్టా మాట్లాడే తత్వం… రాళ్లేయించగలరు, అంతు చూస్తాను అని బెదిరించగలరు, మా ప్రత్యర్థులకు డబ్బులిచ్చి, రింగ్ ఫామ్ చేయగలరు, మీరేమైనా చేయగలరు..? సో, ఇంకా మీతో దోస్తీ అనేది కుదరదు బాబూజీ… ఆల్‌రెడీ మా చేతులూమూతులూ కాలిపోయినయ్, ఇంకెలా నమ్మగలం..? ఐనాసరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజం అంటారు, అందుకే చాలా సహజంగా విలీనం చేసేస్తే వన్స్ ఫర్ ఆల్ దోస్తీ ఫిక్సయిపోతుంది కదా… తమరు తోకజాడించడానికి కూడా ఏమీ ఉండదు… మోడీని వెన్నుపోటు పొడవడం కూడా అంత వీజీ కాదు… నేనే నేరుగా ఇవన్నీ నిర్మొహమాటంగా చెప్పాలని అనుకున్నాను… కానీ మీరేమో వెళ్లిపోయారు… మీరు రండి సార్, జగన్‌ను జైలుకు పంపించమని అడుగుతారు, రాష్ట్రపతిపాలన పెట్టమని అడుగుతారు, అంతేకదా… ఓసోస్, అదెంత పని… ఓసారి వీలుచూసుకుని రండి… కాస్త ప్రశాంత చిత్తంతో రండి, ఉగ్రరూపాలు వద్దు… లేదంటే నన్ను రమ్మంటే నేనే వస్తాను, అక్కడో ఇక్కడో ఎందుకు..? ఆంధ్రజ్యోతి ఆఫీసులోనే కలుద్దాం… ఏమంటారు..?’’
Share this Article