స్మితా పాటిల్…! నిన్నటికి సరిగ్గా 37 ఏళ్లు ఆమె కన్నుమూసి..! ఆమె సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్లల్లో ఆమె నటనా ప్రతిభ మెరుస్తూనే ఉంది… నిజం, ఆమె కనుమరుగైంది గానీ ఎప్పుడూ కళ్లల్లోనే ఉంటుంది… అలా మరుపుకు రాని మహానటి… అసలు మహానటి అనే పేరుకు అసలైన ఐకన్ ఆమె… బతికి ఉంటే 68 ఏళ్ల వయస్సు… కానీ 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది… ఇండియన్ సినిమా తెర మళ్లీ ఇలాంటి నటిని చూడలేదు అంటే అతిశయోక్తి కాదు… అసలు నటి అంటే ఆమే…
ఇప్పటి పాపులర్ సినిమా మహిళా నటుల అడ్డమైన వేషాలతో పోలిస్తే స్మిత వేల రెట్లు ఆదర్శం… అందరికీ ఆమె ఓ పారలల్ సినిమా నటిగానే తెలుసేమో… కానీ నమక్ హలాల్ సినిమాలో అమితాబ్ పక్కన ఆమెను చూసి పిచ్చెక్కిపోయింది ప్రేక్షకసమాజం… ఆమె ఏ పాత్రయినా చేయగలదు… ఆమె పుట్టింది 1955, అక్టోబరు 17న… కాన్పు అనంతర కాంప్లికేషన్స్‌తో 1986, డిసెంబరు 13న కన్నుమూసింది… మొన్నామధ్య ఎక్కడో చదివాను… మహేశ్ భట్ అంతటి దర్శకుడు ఆమె కాళ్లావేళ్లా పడ్డాడు… అది షేర్ చేసుకోవాలనే ఈ కథనం… (ఆమె జీవితకథ గురించి ఎన్నిసార్లు చెప్పుకుంటాం…?)
Ads
తజుర్బా సినిమా షూటింగ్ జరుగుతోంది… మహేశ్ భట్ వెళ్లాడు, ఆమెకు కథ చెబుతాను అన్నాడు… షూట్ బయటికి వచ్చి కారుకు ఆనుకుని నిలబడి కథ విన్నది, పాత్ర నచ్చింది, చేస్తాను అని చెప్పేసింది… అగ్రిమెంట్ మీద సంతకం చేయండి అన్నాడు మహేశ్, ఓ చెక్ ఇచ్చాడు… ఆమె మొహంలో ఆశ్చర్యం… ‘‘ఇంత మంచి పాత్రతోపాటు డబ్బు కూడా ఇస్తారా..?’’ అనేసింది…
భట్ మొహంలో అంతకుమించి ఆశ్చర్యం.,. నిజానికి ఆమె అంతే… పారలల్ సినిమాలకు ఆమె పనిచేస్తూ ఎవరెంత ఇస్తే అంత తీసుకునేది, కొన్నిసార్లు పైసా రెమ్యునరేషన్ లేకుండా…!! ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి తారలతో పోల్చండి… నిజానికి ఆమె స్త్రీవాద ఉద్యమాల్లో యాక్టివిస్ట్… ఆమె లోకం వేరు… పారలల్ సినిమాకు అప్పట్లో పెద్ద దిక్కు… ఉదాత్తమైన, అభ్యుదయ పాత్రలు కావాలి ఆమెకు… అందుకే ఆమె డబ్బు ఇస్తాననేసరికి అంతగా ఆశ్చర్యపోయింది… గ్రేట్ యాక్ట్రెస్… నెవ్వర్, ఆమె వంటి హీరోయిన్ మళ్లీ కనిపించదు…
మహేశ్ భట్ అర్థ్ సినిమాలో క్రమేపీ షబానా అజ్మీ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వసాగాడు… స్మితాపాటిల్‌కు నటనలో స్పర్థ… తనకు మంచి పాత్ర, నటించే స్కోప్ కావాలి… తన పాత్ర తగ్గిపోతుందేమో అనుకుని భట్‌తో మాటలు బంద్ చేసింది… తప్పించుకుని తిరగసాగింది… ఓసారి ఏదో హోటల్‌లో ఆమె లిఫ్ట్ దిగుతుంటే గబగబా మెట్ల మీద నుంచి చెమటలు కక్కుతూ, దిగిపోయి ఆమె ఎదుట నిలబడ్డాడు… చేతులు పట్టుకున్నాడు… నువ్వు లేక నా సినిమా లేదు అన్నాడు…
ఆమె కరిగిపోయింది, కదిలిపోయింది, తన సందేహాలు చెప్పింది… భట్ ఏదో సమాధానం చెప్పాడు, ఆమె క్షమించింది… ఆ సినిమా సూపర్ హిట్… షబానాకు జాతీయ అవార్డు… స్మిత అవన్నీ మరిచిపోయి మరో సినిమాకు చాన్స్ ఇచ్చింది… అయిదేళ్ల తరువాత రిలీజైంది ఆ సినిమా… పేరు ఠికానా… ఫ్లాప్… నిజానికి అర్థ్ వంటి సినిమా స్మిత లేకపోతే లేదు… అది మహేశ్ భట్ సొంత లైఫ్, పర్వీన్ బాబీతో ఎఫయిర్ కథనూ కొంత కలిపాడు… అప్పటికి స్మిత కూడా అంతే కదా…
ఓసారి అమితాబ్ స్వయంగా షేర్ చేసుకున్న సంగతే మరొకటి… ఓరాత్రి రెండు గంటల సమయంలో తను పడుకున్న హోటల్‌కు కాల్ వచ్చింది… స్మిత కాల్… సార్, మీరెలా ఉన్నారు, సేఫ్‌గా ఉన్నారు కదా, ఇబ్బందేమీ లేదు కదా..? అనడిగింది… ఈ టైంలో ఈ పరామర్శలేమిటీ అన్నాడాయన నవ్వుతూ… నాకో పీడకల వచ్చింది, సార్, ప్లీజ్ బీకేర్‌ఫుల్ అన్నదామె… తెల్లవారి కూలీ షూటింగులో భారీ ప్రమాదం, అమితాబ్‌కు తీవ్ర గాయాలు, అందరూ మరణించాడనే అనుకున్నారు…
ఒక దశలో హాస్పిటల్ వాళ్లు తనను బ్రెయిన్ డెడ్ అని ప్రకటించి, మళ్లీ వెంటనే వెనక్కి తీసుకుని ఐసీయూలో చేర్చారని అమితాబే చెప్పుకున్నాడు… స్మితలో ఏదో నాకు తెలియని శక్తి ఉండేది అంటాడు అమితాబ్… అమితాబ్, స్మిత అనగానే మరొకటీ గుర్తొస్తుంది… అది నమక్ హలాల్ షూటింగ్… పాపులర్, కమర్షియల్ సినిమా అంటేనే హీరో హీరోయిన్లు కిందా మీదా పడటాలు, రెచ్చిపోయి హత్తుకోవడాలు గట్రా ఉంటయ్ కదా… అసలే అది ‘ఆజ్ రపట్ జాయేతో’ పాట… ఫుల్లు మాస్…
ఆ షూటింగ్ జరిగిన రోజు రాత్రి స్మితా పాటిల్ వెక్కి వెక్కి ఏడ్చింది, నిద్ర రాలేదు… తనేమిటి..? ఈ పిచ్చి పాటలేమిటి అని..! తెల్లవారి అమితాబ్‌తో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది… ఆమెను ఓదార్చిన అమితాబ్ పాపులర్ సినిమా అంటే అంతే… అదొక పాత్ర, అదీ ఒక నటన… అంతకుమించి ఆలోచించకు అని చెప్పాడు… (తరువాత కూడా కొన్ని కమర్షియల్ సినిమాలు చేసింది)…
అదీ ఆమె కేరక్టర్… ఇప్పుడు ఒక సాయిపల్లవి నేను కిస్ సీన్లు చేయను, అగ్లీ డ్రెస్సులు వేసుకోను, నా పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద చెక్కొచ్చినా సరే డోన్ట్ కేర్, ఏమీ దిక్కులేకపోతే డాక్టర్ ప్రాక్టీస్ చేసుకుని బతుకుతా, అంతేతప్ప ఆత్మను అమ్ముకోను, చెత్తా యాడ్స్ కూడా చేయను అంటుంటే మనం వింతగా చదువుతున్నాం… కానీ స్మితా పాటిల్ అనే ఆ నటి గురించి చదవాలి.., జస్ట్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి జస్ట్, చిన్న శాంపిల్స్… స్మితాపాటిల్, మళ్లీ ఓసారి పుట్టమ్మా…!!
Share this Article