దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు… ఇండస్ట్రీలో ఇన్నేళ్ల మనుగడకు ఓ అపురూపమైన పురస్కారం… ఎవరికి అంకితం ఇవ్వాలి..? ఫ్యాన్స్..? నిర్మాతలు..? దర్శకులు..? నా ఫ్యామిలీ మెంబర్స్..? దేవుడు..? ప్రేక్షకులు..? అరె, ఇవన్నింటినీ మించిన నా గుండెను విప్పి కృతజ్ఞత చెప్పాల్సిన వాడు ఒకడున్నాడు కదా… ఎలా మరిచిపోగలను..? ఈ స్టార్డమ్, ఈ వేల కోట్ల సంపద, ఈ ఫ్యాన్స్, ఈ కెరీర్ అంతా వాడి పుణ్యమే కదా… నిజమే, వాడికి అంకితం ఇవ్వడమే కరెక్టు… మనిషిగా నా ధర్మం… వాడిని మరిచిపోతేనే నేను మనిషినెలా అవుతాను..? ఇక స్నేహానికి విలువేముంటుంది..? చెప్పనే లేదు కదూ… వాడి పేరు రాజ్ బహదూర్… అది 1970, బెంగుళూరు… 10 ఏ నంబర్ సిటీ బస్సు… వాడు డ్రైవర్, నేను కండక్టర్… నాలో నటుడిని గుర్తించిందీ తనే… వెళ్లు వెళ్లు అంటూ చెన్నై ఫిలిమ్ ఇన్స్టిట్యూట్కు తరిమిందీ తనే… అస్సలు ఊరుకోలేదు…
పంపించగానే సరిపోతుందా..? ఆ చెన్నైలో బతికేదెలా..? వాడికొచ్చే 400 రూపాయల జీతంలో 200 నాకే పంపించేవాడు… నన్ను హీరోగా తెర మీద చూడాలి, పోస్టర్లలో కనిపించాలి, అది వాడి డ్రీమ్… నాకన్నా వాడికే ఎక్కువ… రెండుమూడేళ్లు వాడు పంపించిన డబ్బులతోనే బతికాను… ఓసారి బాలచందర్ ఏదో ప్రోగ్రాంలో నన్ను చూశాడు, దగ్గరకొచ్చాడు, తమిళం నేర్చుకోవోయ్ అన్నాడు… నిజమే, తమిళం రాకపోతే చెన్నై ఇండస్ట్రీలో ఏం చేయాలి..? అప్పుడూ మా రాజ్ బహదూరే ముందుకొచ్చాడు… అదీ నేర్పించాడు… హీరోనయ్యాను… యాభై ఏళ్ల స్నేహం మాది… రిటైరయ్యాడు… సోదరుడి ఇంట్లో ఉంటాడు… మనసు చికాగ్గా ఉన్నప్పుడో, బెంగుళూరులో మావాళ్లు గుర్తొచ్చినప్పుడో హఠాత్తుగా వెళ్తాను… ముందు వెళ్లేది వాడి ఇంటికే… వాడిని చూస్తే, మాట్లాడితే మనసు ప్రశాంతం… పొద్దున్నే విమానం దిగేసి, ఇంకా రద్దీ పెరగకముందే, జనం గుర్తుపట్టకముందే నేరుగా వాడి ఇంటికి వెళ్లిపోవడమే… నేనెప్పుడొస్తానో తెలియదు కదా, నా కోసం ఓ గది ఎప్పుడూ అలాగే నాకోసం ఖాళీగా ఎదురుచూస్తూనే ఉంటుంది…
Ads
తను ఓ స్నేహితుడే కాదు… నేను నిర్ణయం తీసుకోలేని సందిగ్ధావస్థలో ఉన్న ప్రతిసారీ తనే గురువయ్యేవాడు… వాడు చెబితే ఇక ఆ అరుణాచలం శాసించినట్టే, నేను పాటించడమే…! అసలు నా జీవితంలో తనకు తెలియని అంశమేముంది..? ఏమీలేదు..! దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అంకితం ఇవ్వడానికి తనకు మించినవాళ్లు ఎవరో మీరే చెప్పండి… తన పేరును నేను పురస్కార స్వీకరణ సమయంలో ప్రస్తావించినప్పుడు అక్కడున్నవాళ్లు ఆశ్చర్యపోయినట్టు అనిపించింది… వాడికి నేను రజినీకాంత్ కాదు, జస్ట్, శివాజీ… వాడు శివా అని పిలిస్తేనే నేను నా పాత రోజుల్లోకి వెళ్లిపోతాను ఒక్కసారిగా… ఈ బిజీ ప్రపంచం, ఒత్తిళ్లు, షూటింగులు, ఇతర చికాకుల నుంచి దూరంగా పోవాలంటే వాడింటికి వెళ్లాల్సిందే… ముచ్చట్లలో పడిపోతాం, వాడలాగే మంచం మీద పడుకుంటాడు… ఓ పరుపు నేల మీద పరుచుకుని నేను ముసుగుతన్నేస్తాను… ఐనా వాడి దగ్గర నేను సూపర్ స్టార్ ఏమిటి..? స్టేటస్ ఏమిటి..? వాడు, నేను… అంతే… నిజానికి నా దృష్టిలో తనే తలైవా… ఇద్దరమూ కలిసి ఎవరికీ తెలియకుండా ఎటో వెళ్లిపోతుంటాం… మమ్మల్ని మేం మరిచిపోయి బతికే క్షణాలన్నమాట…
కడలికాయె పరిషె… ఏటా బసవనగుడిలో జరిగే వేరుశెనగ జాతర… చూడాల్సిందే గానీ మాటల్లో చెప్పలేం… ఓసారి వెళ్దాంరా అన్నాను… కానీ జనం నన్ను గుర్తుపడితే..? అసలు ఈ స్టార్డంతో జీవితంలో ప్రైవసీ ఏం మిగిలిందని..! దాక్కుంటూ, దాచుకుంటూ, సెక్యూర్డ్ జోన్లో కాలం వెళ్లదీయడమే కదా… ఏదో ఆ హిమాలయాలకు వెళ్లినప్పుడే నేను, మనసారా ఆస్వాదించే నా ఒంటరిక్షణాలు… కాస్త మేకప్ మార్చుకుని, రూపాలు ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తగా ఆ జాతరకు వెళ్లాం… ఎంజాయ్ చేస్తున్నాం… అక్కడికీ ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి పట్టిపట్టి చూసింది… నువ్వు రజినీకాంత్ కదా అనేసింది… ప్రాణం డక్కుమంది ఒక్కసారిగా… కాదు, ఏమిటలా అడిగావ్ అన్నాను నవ్వుతూ… నీ పక్కనున్నాయన్ని ఏదో టీవీ ఇంటర్వ్యూలో చూశాను, నీ గురించే చెప్పాడు, నీ దోస్త్ కదా, నువ్వు రజినీవే… అన్నదా అమ్మాయి ఖండితంగా… ఆమెను తప్పించుకుని, హడావుడిగా బయటపడేసరికి తలప్రాణం తోకకొచ్చింది… అలా ఉంటయ్ మా అడ్వంచర్స్, అవును, అవే మాకు చిన్న చిన్న అడ్వంచర్స్ మరి..! ఒరేయ్, బహదూర్… ఈ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం నిజానికి నీదేరా.,.! నీదే…!!
Share this Article