ఈ పోస్టు బాగా నచ్చింది… అల్లోపతీ వైద్యం డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా చేతుల్లో చిక్కి, దోపిడీ శక్తుల పరమయ్యాక…. ప్రతి పల్లె, ప్రతి ఇల్లు ఈ దోపిడీతో నిలువునా చచ్చిపోతున్న దశలో…. మన దేశీయ వైద్యం, మన వారసత్వ వైద్యం, అందులోని ‘మంచి’, మన నిర్లక్ష్యం ఇంకా ఇంకా వెలుగులోకి రావాలి… రావాలీ అంటే ఇలాంటి కొన్ని ఉదాహరణలు కావాలి…
పరిశోధనలు సాగాలి… ఢిల్లీలోని బ్యూరోక్రాట్ల మెదళ్లను ఆవరించిన అవినీతి, అక్రమాల వైరస్ చచ్చిపోవాలి… దేశీయ వైద్యం గొప్పదనీ కాదు, అల్లోపతి వైద్యం గొప్పదనీ కాదు… ప్రతి వైద్యవిధానంలోని మంచిని స్వీకరించే విధానం కావాలి… మన విధాన నిర్ణేతల బుర్రలు కుళ్లిపోయాయి కాబట్టి ఇవేమీ అర్థం కావు…
జనంలోనే కాస్త చైతన్యం పెరగాలి… అయితే చదివేదంతా మంచే అని కాదు… ఆ మంచిని గుర్తించి, నిర్ధారించి, జనంలోకి తీసుకురావాలనే భావనే ఈ పోస్టు నచ్చడానికి కారణం… ఈ పోస్టు Mandala Senareddy… వాల్ మీద కనిపించింది… ఒరిజినల్‌గా రాసింది Imran Baig Mughal అని మిత్రులు గుర్తుచేస్తున్నారు…
Ads
(ఈ పోస్టులో చెప్పిన నల్లాలం, గడ్డిచేమంతి మొక్క నడుం నొప్పులకు కూడా పనిచేస్తుందని కొందరు ఆయుర్వేద వైద్యుల వీడియోలు ఈమధ్య కనిపించినయ్… ఇది యాంటీ సెప్టిక్… గాయాలకు అద్భుతమైన మందు… చిన్నప్పుడు ఆటల్లో దెబ్బలు తగిలితే అప్పటికప్పుడు ఈ ఆకుల రసం పిండేయడమే… రకరకాల పేర్లు… బూసిరొడ్డ, పుటపుటాల అల్లం అని కూడా అంటారు…) (ఈ పోస్ట్ రికమండేషన్ కాదు, ఒకరి అనుభవాన్ని షేర్ చేయడం మాత్రమే…)
మూడేళ్ల క్రితం నాటి ఈ కథనాన్ని మళ్లీ ఎందుకు చెప్పుకోవడం అంటే… హైదరాబాదులో బత్తిన సోదరుల చేపమందు పంపిణీ టైమ్ రాగానే కొందరు పనిగట్టుకుని, చర్చలు పెడుతూ, అజ్ఞానం, మూఢత్వం మన్నూమశానం అని విమర్శలకు దిగుతారు… ఆ మందు కోసం ప్రతి ఏటా వచ్చేవాళ్లు కోకొల్లలు, వాళ్లకు ఆ మందు మీద నమ్మకం…
ఈమధ్య తిప్పతీగ ఆకులు తిని, కషాయం తాగి బీపీ నయం చేసుకున్నవాళ్లు బోలెడు మంది… విటమన్ డీ లోపం చాలామందిలో చూస్తున్నాం కదా… ఈమధ్య అశ్వగంధ, తిప్పతీగ, విటమన్ డీ, జింక్, విటమిన్ సి కలిసిన కొన్ని టాబ్లెట్లు వచ్చాయి… ఇమ్యూనిటీకి మంచి డ్రగ్… విపరీతంగా వాడుతున్నారు డాక్టర్లు కూడా… మన మూలికలు, మన ఆయుర్వేదం మీద ఇంకా ఇంకా రీసెర్చ్ జరగకపోవడంతో మనం మన చౌక దేశీయ అమృతాన్ని కాదనుకుంటున్నాం… సరే, ఆ పాత కథనం మరోసారి… కాకపోతే కాస్త పెద్దది…
చాలామందికి ఆయుర్వేద వైద్యం అంటే చులకన భావం. నాక్కూడా ఒకలాంటి అనుమానపు భావం ఉండేది ఆయుర్వేదంపైన. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్న చందానా. ఇప్పుడు నేను చెప్ప బోయేది ఆయుర్వేదంతో నా ప్రత్యేక అనుభవము. 2015 సెప్టెంబరు ఇద్దరు అమ్మయిల తరువాత నాకు అబ్బాయి పుట్టాడు, ఒకరకమైన ఆనందములో ఉన్నాను. ఇద్దరు రత్నాల్లాంటి అమ్మాయిలు, వజ్రం లాంటి అబ్బాయి, ఒక కంప్లీట్ ఫామిలీ అయిన ఫీలింగు.
నేను అనందాన్ని అనుభవిస్తున్న వేళ నా అందం కొంచం తగ్గిపోయే రోగం తగులుకుంది. అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో, ఇప్పటికి అర్థం కాలేదు. తరువాత తెలుసుకున్న దేమిటంటే అది ఒక చర్మ రోగం అని… పేరు పేనుకోరుకుడని, వైద్య భాష లో Alopecia అంటారని..! ఈ రోగం వస్తే వచ్చింది గాని, నా గడ్డాన్ని ఎటాక్ జేసింది, నా గడ్డపు వెంట్రుకలు అక్కడ అక్కడ రాలి పోయి వికారంగా కనిపించటం మొదలెట్టింది. అసలే అట్టాఅట్టా ఉన్న అందమాయే మనది, అక్కడక్కడా గడ్డపు వెంట్రుకలు రాలిపోయి కాస్త వికారంగా కనిపించటం మొదలెట్టా.
అవి నేను బెంగళూరులో ఉండే రోజులు, సెయింట్ జాన్స్ హాస్పిటల్ కు వెళ్ల్లా .., ఈ హాస్పిటల్ చాలా చవుకగా, మంచి సూపర్ స్పెషలిస్టులతో అలరారుతున్నా కూడా మన జేబుకు చిల్లు పడకుండా కాపాడుతుంది… డెర్మాటోలాజి OP కు అప్పాయింట్మెంట్ తీసుకొని వెళ్ళా, వెళుతూనే వాళ్ళు రోగాన్ని పసిగట్టి, ఒక రకమైన మెడిసిన్ రాసి, ఒక ఇంజక్షన్ వేశారు. ఈ ఇంజక్షన్ వేసే ప్రక్రియ చాలా బాధతో కూడుకున్నది, ఈ ఇంజక్షన్ పేరు tricort. నాకు ఎక్కడ ఎక్కడ గడ్డంలో వెంట్రుకలు రాలిపోయాయో అక్కడ ఈ ఇంజక్షన్ ని గుచ్చారు.
నొప్పిని పంటి బిగువున భరించాను. ఇంజక్షన్ ఆయిన తరువాత అద్దంలో చూసుకుందును కదా, ఎక్కడ ఎక్కడ గుచ్చారో అక్కడ గుర్తుగా ఒక రక్తపు బిందువు, అలాంటి బిందువులు ఏడు నుంచి ఎనిమిది నిలబడి ఉన్నాయి నా మొహం పైన. బ్రతుకు జీవుడా అని బయటకు వస్తున్నప్పుడు డాక్టరమ్మ, నెలాగి రండి ఇంకొక డోస్ ఇంజక్షన్ తీసుకోవాలి, మధ్యలో షేవింగ్ చేయొద్దండి, మాకు స్పాట్స్ గుర్తు పట్టటం కష్టం అవుతుంది అంది… సరే అని తలాడించి, ఇక చచ్చినా రాను ఇన్నిసార్లు ఇంజక్షన్ గుచ్చించుకోలేను అని మనసులో అనుకుంటూ ఇంటి దారి పట్టాను.
నెల గడిచింది, ఇంకా ఎక్కువగా రాలిపోవటం మొదలు పెట్టింది. దాదాపు సగం గడ్డం రాలిపోయింది. ఇంకా ఆగలేక మళ్లీ సెయింట్ జాన్స్ కు వెళ్ళా. మళ్లీ ఇంజక్షన్ లు, అయిదు వందల రూపాయలు ఖర్చు, ఇంజక్షన్ బిల్లు. మూడు వందల రూపాయలు ఆటోకు. మా ఇంటి నుంచి ఆ హాస్పిటల్ పద్నాలుగు కిలోమీటర్లు. అంత దూరం బైకు నడపడం నాకు ఒళ్ళు బరువు. మళ్లీ నెలకు రమ్మన్నారు. అందంపైన ఆశ. సరే, వస్తానని చెప్పి ఇంటికి వచ్ఛేసా. నెల గడిచింది, రాలిపోయిన ఒక్క చోట కూడా ఒక్క వెంట్రుక కూడా మొలవలేదు.
నెల తరువాత ఇక ఆ హాస్పిటల్ కు వెళ్ళకూడదని డిసైడ్ అయ్యా. నాకు బాగా రఫ్ గా గడ్డంతో ఉండడం ఇష్టం, కానీ ఈ రోగం మూలాన రోజు నున్నగా షేవింగ్ జేసుకోవటం అలవాటు జేసుకున్నా. అలా మూడు నెలలు దీని గురుంచి పట్టించుకోవటం మానేసా. నేను పట్టించుకోవటం మానేశానని రోగం మాత్రం తన ప్రతాపం తగ్గించలేదు. బ్లేడ్ లేకుండానే నాకు షేవింగ్ జేస్తుంది. జుట్టు రాలి పోవటం, రాలిన చోట వెంట్రుకలు మొలవకుండా పోవటం. నాకు ఒక రకమైన దిగులు పట్టుకుంది, గడ్డం రాలితే రాలింది, తలకు అంటుకుంటే..? గడ్డానికి వచ్చింది కాబట్టి షేవింగ్ తో మేనేజ్ జేస్తున్నాను, అదే తల వెంట్రుకులకు వస్తే..? రోజు గుండు జేసుకోవాలా? ఆ ఊహే నాకు వెన్నులో చలి పుట్టించింది.
ఇలా కాదని డాక్టర్ని మార్చా, వేరే డెర్మటాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతను మహానుభావుడు ఇంజక్షన్ వెయ్యకుండా.., మందులు, ఫీజు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నాడు. నాలుగు రకాల మాత్రలు రాసిచ్చాడు. అందులో ఒకటి స్టెరాయిడ్, స్టెరాయిడ్ దుష్పరిణామాలు నాకు తెలిసి ఉన్నా కూడా, రోగం తగ్గుతుందన్న ఆశతో రెండు నెలల కోర్స్ తీసుకున్నా. ఏమీ లాభం లేదు, గడ్డం వెంట్రుకలు, చేతి చమురు వదలటం తప్ప…
ఈ రోగం నన్ను మానసికంగా కూడా వేధించటం మొదలుపెట్టింది. ఇతనితో లాభం లేదని మళ్లీ కొత్త డెర్మటాలజి డాక్టర్ ని వెతికి పట్టుకున్నా, అతను కూడా షరా మాములే, ఏవో మందులు వాడమని చెప్పటం, మూడు నెలలు నెల నెలా రమ్మన్నాడు, మూడు నెలల ట్రీట్‌మెంట్ తరువాత కూడా ఏమి లాభం లేదు. మొత్తం ఒక సంవత్సరం గడిచి పోయింది.
కనీసం ఈ రోగం ఎందుకు వచ్చిందని అడిగితే సరి అయిన సమాధానం లేదు వాళ్ళ దగ్గర… గట్టిగా అడిగితే విటమిన్ డెఫిసియన్సీ అంటారు. ఈ ప్రహసనంలో మా ఊరు కడపకు వచ్చాను మధ్యలో, కొందరు మిత్రులు కడపలో పేరు మోసిన డెర్మాటాలాజిస్ట్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లామన్నారు. ఆశ చావక ఆయన్ని కలిశా, ఆయన ఒక అయిదు రకాల మందులు, పూసుకోవటానికి రెండు రకాల ఆయింట్మెంట్లు ఇచ్చాడు.
నేను తూచా తప్పకుండా ఆ ఆయింట్మెంట్లు పోసుకునే వాడిని. వెంట్రుకలు మొలవటం దేవుడెరుగు, పూసుకున్న ఆయింట్మెంట్లు మెల్లగా కరిగి నా బనియన్లు, నా లుంగీలకు అంటుకొని మరకలై ఇంకోసారి వేసుకోవటానికి వీలు కాకుండా పోయేటివి. ఇలా ఈయన ట్రీట్మెంట్ మూడు నెలలు తీసుకున్నా, ఒక పిసరంత లాభం కూడా లేకుండా పోయింది. ఒక అరడజను బనియన్లు, ఒక అరడజన్లు లుంగీలు నాశనం అయ్యాయి.
కొన్ని నెలల విరామం తరువాత కడపలో పేరు మోసిన హోమియోపతి డాక్టర్ గారిని కలిసాను. ఇతను మొత్తానికి నా ఆశల పైన నీళ్లు జల్లాడు. ఈ రోగానికి మందు లేదని, అల్లోపతీలో అస్సలు లేదని, ఇది తల వెంట్రుకలుకు ప్రాకకుండా ప్రార్థన జేసుకొమ్మని, ఒకవేళ ప్రాకితే తూర్పుకు తిరిగి దండం పెట్టుకొమ్మన్నాడు . ఇతని సలహాకు శిరస్సు వంచి నమస్కరించి నిరాశా నిస్పృహలతో ఇంటి దారి పట్టా.
బెంగళూరులో ఒక రోజు బార్బర్ షాప్ లో కట్టింగ్ జేస్కుంటుంటే, బార్బర్ అన్నాడు, సర్ మీ పేనుకొరుకుడుకు నా దగ్గర వైద్యం ఉందని… అతను నాకు ఆపద్భాంధవుడులా కనిపించాడు. ఒక అయిదు వందలు రూపాయలు దీసుకొని ఒక లేహ్యము పూశాడు. ఇంటికి వస్తూనే ఒకరకమైన మంట, చూస్తూ చూస్తూనే అతను పూసిన చోటంతా బొబ్బలు కట్టింది. అతనికి కంగారుగా ఫోన్ జేసా, అతను తాపీగా… ఏమ్ గాదు సర్, బొబ్బలు తగ్గింతరువాత వెంట్రుకలు మొలుస్తాయి అన్నాడు.
మూడు రోజులు బయటికి ఎక్కడికి వెళ్లలేకపోయా… విపరీతమైన మంట. మూడు రోజులకు అతను చెప్పినట్లే బొబ్బలు తగ్గాయి కానీ రెండు నెలలైనా వెంట్రుకలు రాలేదు. అలా ఇంకొక ఆరు నెలలు గడిచి పోయాయి. పూర్తిగా రెండున్నర సంవత్సరాలు అయినా కూడా ఒక్క వెంట్రుక మొలవలేదు, షేవింగ్ జేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది.
గడ్డం నుంచి మెల్లగా అది తలకు పాకటం కూడా మొదలు పెట్టింది, ఇంకొక రెండునెలలు ఉండి ఉంటే నా నెత్తి మొత్తనికి కూడా పాకుండేది. నాకు అదృష్టం ఒక ముసలావిడ రూపంలో వచ్చింది. కడపలో ఒక రోజు మా ఇంటి దగ్గర నిలుచొని ఉన్నాను, ఒక ముఖ పరిచయం ఉన్నపెద్దావిడ పలకరించి నా మొహం వైపు జూసి, నీకు పేనుకొరుకుడు ఉందే, వైద్యం జేసుకోలేదా అంది.
జేసుకున్నానుఁ, ఏది పని జెయ్యలేదు అన్నాను. ఆవిడ నా చెయ్యి పట్టుకొని మా పెరట్లోకి తీసుకువెళ్లి పిచ్చి మొక్కల్లో ఒక గడ్డి మొక్కను జూపించి, ఇది వెల్లుల్లితో పాటు నూరి, దినం మార్చి దినం పూసుకో, అయిదు నుంచి ఆరు సార్లు పూసుకున్న తరువాత వెంట్రుకలు మొలుస్తాయి అంది.
ఆవిడ మాటలకు నాకు నవ్వు వచ్చింది. సెయింట్ జాన్స్ హాస్పిటల్ , ఒక నలుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు నయం జెయ్యలేంది ఈ మొక్క నయం జేస్తుందా అని… ఆ మొక్క పిచ్చిదే, ఈ ముసలావిడ పిచ్చిదే అనుకున్నా… సరే అని పట్టించుకోలేదు.
ఒక వారం రోజుల తరువాత, పెరట్లో తిరుగుతుంటే ఆ మొక్కపై నిలిచాయి నా కళ్ళు. ఏ పుట్టలో ఏ పాముందోనని ఆ గడ్డి మొక్కలను పెరికి, వాటిని వెల్లుల్లితో పాటు దంచే పనిని మా ఆవిడకు పురమాయించా . మా ఆవిడ దంచి ఇస్తే చక్కగా పోసుకున్నాను. అలా రెండు తూర్లు పూసుకున్నానో లేదో వెంట్రుకలు మొలవటం మొదలు పెట్టాయి.
రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ దినం మార్చి దినం ఆరు సార్లు పోసుకున్నాను. చక్కగా గుబురు గుబురుగా వెంట్రుకలు వచ్చాయి. ఇప్పుడు చక్కగా రఫ్ గా గడ్డం పెంచుకుంటున్నాను. మొత్తం పదిహేను రోజుల వైద్యం, పైసా ఖర్చు లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, చక్కగా రోగాన్ని దూరం జేసిన ఆ పిచ్చి మొక్క ఇప్పుడు నాకు సంజీవినితో సమానం.
మూడు సంవత్సరాలు, ఇరవై వేల ఖర్చు, అయిదుగురు డాక్టర్లు నయం చెయ్యలేని జబ్బుని ఒక మొక్క మొదటి రోజు నుంచి నయం చెయ్యటం మొదలు పెట్టింది. నా జబ్బుకు పేనుకొరుకుడు అన్నారు, విటమిన్ లోపం అన్నారు కానీ, పాపం ఆ పిచ్చి మొక్క ఇవేవీ పట్టించుకోకుండా నాకు శీఘ్రంగా నయం జేసింది. మరి ఇది కొరుకుతున్న పేనును చంపిందా? లేక విటమిన్స్ ని ఇచ్చిందా? శరీరపు లోతుల్లో ఉన్న వెంట్రుకలను బయటికి లాగిందా ? ఈ మొక్క యొక్క గుణం ఏంటి ? ఎవరు రీసెర్చ్ జేస్తారు?
మన ఆయుర్వేద మహత్యం. మన ఆయుర్వేదం లో అన్ని జబ్బులకు ట్రాట్మెంట్ లేక పోవచ్చు గాని, చాలా మొండి రోగాలను కూడా నయం జేసే మందులు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం దాదాపు నశించిపోయింది మన భారత దేశంలో. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కు ఈ విద్య ట్రాన్స్ఫర్ కూడా కాలేదు. కొందరు అసూయతో ఈ విద్యను వేరే వాళ్లకి నేర్పించలేదు. నాకు తెలిసి ఎన్నో ప్రయోజకరమైన విషయాలు ఎవరితోనూ పంచుకోక అలాగే వారితో కాల గర్భంలో కలిసి పోయాయని అర్థమైంది.
మన వాళ్లకు ఆయుర్వేదం పైన నమ్మకం లేకపోవటానికి కారణం చెట్టుకు పుట్టకు ఒక నకిలీ ఆయుర్వేదిక్ వైద్యులు ఉండటం కూడా ఒక కారణం ఏమో ? ఈ నకిలీలను ఎవరు నియంత్రించాలి? ఆయుర్వేదమే గొప్ప అనట్లేదు, అల్లోపతి వైద్యం లేకుండా ఉండి ఉంటే ఇప్పటికి మానవాళి మనుగడ ప్రశ్నార్థకం. కానీ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొండి రోగాలకు చికిత్స ఉంటుందని నా నమ్మకం.
నాకు తెలిసి సరిగ్గా రీసెర్చ్ జేస్తే, మధుమేహానికి, న్యూరోలాజికల్ డిసార్డర్స్ కు అట్ఠే నయమయ్యే మందులు కనుగొనటం పెద్ద కష్టం ఏమి కాదు అనుకుంటున్నాను. కొందరు తమకు రోగం ఉందని పబ్లిగ్గా చెప్పుకోరు. కొందరు తనకు తెలిసిన వైద్యాన్ని పబ్లిగ్గా చెప్పరు, కానీ నేను రెండిటిని దాపరికము లేకుండా పోస్ట్ జేస్తున్నాను, ఒకటి మనకు ఆయుర్వేదం గురుంచి స్పృహ రావటానికి, మరియు ఎవరికైనా ఈ జబ్బు ఉంటే వైద్యం జేసుకుంటారని…!!
Share this Article