సెలబ్రిటీల కుటుంబాల్లో, పెళ్లిళ్లలో బ్రేకప్పులు, టైఅప్పులు, సహజీవనాలు గట్రా చాలా కామన్… కానీ చాలామందికి ఓ ప్రశ్న…. అంతటి అక్కినేని కుటుంబంలో అమల ఎందుకు ఫిట్టయ్యింది..? ఎందుకు ఒదిగిపోయింది..? సమంత ఎందుకు ఫెయిలైంది..? ఎందుకు బయటపడి బందీఖానా నుంచి విడుదలైనట్టు ఫీలవుతోంది..? అది మనుషుల తత్వాల మీద ఆధారపడి ఉంటుంది… సెలబ్రిటీ కుటుంబాల్లో ఇమిడిపోవడం అంత వీజీ కాదు… పునీత్ రాజకుమార్ భార్య అశ్విని రేవనాథ్ కథ వేరు…
అందరూ ఆమె ప్రేమకథ అని ఏదేదో రాసేస్తున్నారు గానీ… నిజానికి పునీత్ పరిచయమయ్యేనాటికి ఆమె చదువు జస్ట్, అప్పుడు పూర్తయింది… చిన్నప్పటి నుంచే సినిమాలే వ్యాపకంగా బతికిన పునీత్‌కు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు… ప్రపంచమే ఓ స్కూల్ తనకు… ఇద్దరికీ తెలిసిన కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆమె పరిచయం… తొలిచూపు ప్రేమలు, సినిమా మార్క్ మన్నూమశానం ఏమీలేదు… జస్ట్, పరిచయం… కళ్లు తిప్పుకోని అందగత్తె కూడా ఏమీకాదు, ఫీల్డులో పునీత్ బోలెడుమందిని రోజూ చూస్తున్నవాడే… తను అప్పుడప్పుడూ అక్కడక్కడా క్లోజ్డ్ సర్కిళ్ల ప్రోగ్రాముల్లో తరచూ కనిపించేది, మాట్లాడేది… ఆమెకు సినిమాలంటే ఆసక్తి లేదు, పెద్దగా చూడదు, పునీత్ ఫ్యామిలీ సెలబ్రిటీతనం గురించి కూడా అంచనాల్లేవు తనకు…
Ads
పరిచయం కాస్తా పెరిగింది… తను రాజకుమార్ అనబడే ఓ కన్నడ ఐకన్ కొడుకు అనీ, కాబోయే స్టార్ హీరో అనీ ఆలోచించేది కాదు… పునీత్ అంటే పునీత్ అంతే… కాదు, కాదు… అప్పటికి తనకు తెలిసిన పేరు లోహిత్ మాత్రమే… ఆ పరిచయం ప్రణయంగా మారింది, దాదాపు ఏడెనిమిది నెలలు గడిచిపోయాయి, ఒకరికొకరు చూసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు… అప్పుడుగానీ ఆమె తన లైఫ్‌కు సూటవుతుందని తుది అంచనాకు రాలేదు పునీత్… మెచ్యూర్డ్ లవ్… అది ఉత్త యవ్వనప్రాయపు ఆకర్షణ కాదు… పునీత్‌కు తెలుసు, ఈ పెళ్లి అంత వీజీ కాదని..!
ఇప్పుడు వేరు, అప్పట్లో కుటుంబపెద్ద, తండ్రి అయినా సరే ఎదుటబడి నిలిచి ఓ మాట చెప్పాలంటే బెరుకు… ఇలాంటివి చెప్పాలంటే ఒకింత వణుకు… తను అసలే రాజకుమార్… ఐనాసరే, పునీత్ వెళ్లి తొలిసారిగా తండ్రి ఎదుట నిలబడి, నాన్నా ఓ మాట చెప్పాలి అన్నాడు… రాజకుమార్ ఆశ్చర్యంగా చూశాడు… చిన్నకొడుకే, కానీ పెద్దవాడయ్యాడు కదా… ‘ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఇండస్ట్రీతో సంబంధం లేదు, పెళ్లిచేసుకుంటాను’ అన్నాడు… రాజకుమార్ ఓసారి చిరునవ్వుతో కూడిన ఆశ్చర్యంతో కొడుకును పరికించాడు… మీ అమ్మతో మాట్లాడు, ఆమెకు ఓకే అయితే నాకూ ఓకే అన్నాడు… అవును మరి, ఓ సెలబ్రిటీ కుటుంబంలో ఇమడాలీ అంటే కొడుకు ఇష్టపడితే మాత్రమే సరిపోదు…
అమ్మల దగ్గర చిన్న కొడుకులకు సాన్నిహిత్యమే కదా… చెప్పాడు, ఆమె ఓసారి చూస్తానంది… చూసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… కానీ అసలు కథ అటువైపు నుంచి మొదలైంది… ఈరోజుకూ ఆమె తల్లిదండ్రులెవరో, ఏం చేస్తుంటారో బయటికి రాలేదు, రారు… పబ్లిసిటీలు అంటే, టాంటాం కథలంటే భయపడే కుటుంబం అశ్వినిది… ఈరోజుకూ బహుశా ఆమె తల్లిదండ్రుల ఫోటోల్ని ఎవరూ పబ్లిష్ చేసినట్టు లేదు… అంతటి లోప్రొఫైల్ ఫ్యామిలీ…
మనసులో ఒకటే బెరుకు, అంత పెద్ద సెలబ్రిటీ కుటుంబం, పైగా సినిమా జీవుల మీద సొసైటీలో పెద్దగా నమ్మకాలుండవు… బిడ్డ వదిలేట్టు లేదు… కాలం పరిష్కరిస్తుందేమో అనే ఆశతో వాయిదా వేస్తూ వచ్చారు… వాళ్లకు ఇష్టం లేదని కాదు, కానీ సందేహాలు, భయాలు… ఆడబిడ్డ కదా…!
ఆరు నెలలు గడిచిపోయాయి… అశ్విని, పునీత్ బలంగా నిలబడ్డారు… చివరకు రెండు పక్షాలూ అంగీకరించాయి… పెళ్లయిపోయింది… ఆమె అత్తింట్లో అడుగుపెట్టేనాటికి ఆ ఉమ్మడి కుటుంబంలో 30 మంది… తెల్లారిలేస్తే సందడే సందడి… రకరకాల తత్వాలు… కొన్నాళ్లు ఠారెత్తిపోయింది ఆమె… కానీ ఇది నా పునీత్ ఫ్యామిలీ అనుకుంది, అడ్జస్ట్ కావడం నేర్చుకుంది… అద్భుతంగా ఆ ఫ్యామిలీలో ఇమిడిపోయింది… పునీత్ కాస్ట్యూమ్స్ చూసుకునేది… సినిమా నిర్మాణం గట్రా పాలుపంచుకునేది, సొంతంగా వ్యాపారసంస్థ ఏర్పాటు చేసుకుని, అదేసమయంలో ఫ్యామిలీని ఇగ్నోర్ చేసేది కాదు…
1999లో పెళ్లయితే, ఈ 22 ఏళ్లలో… ఆమె పర్సనల్ ఎక్స్‌పోజర్ ఏమీ లేదు మీడియా తెర మీద… జస్ట్, మిసెస్ ఆఫ్ పునీత్… ఆమెకు అదే చాలు… వారాంతంలో తను, తన భర్త, తన పిల్లలు… ప్యూర్ ప్రైవేటు స్పేస్… ఒక స్టార్ సెలబ్రిటీ ఫ్యామిలీలో ఇమిడిపోవడం అంటే నిజంగా చిన్న విషయమేమీ కాదు… కానీ విధికి ఎందుకో గానీ ఇలాంటోళ్లంటేనే గిట్టదు… విడదీస్తుంది… దుర్మార్గం…!!
Share this Article