ఓ మిత్రుడు అడిగాడు… ఆస్కార్ ఎంట్రీ కోసం పద్నాలుగు సినిమాల్ని జ్యూరీ పరిశీలనకు తీసుకుంది కదా… అవి ఏవి అని..? చెబుతాను… ఆస్కార్ ఎంట్రీకి పంపించిన తమిళ సినిమా కూళంగల్ గాకుండా… సర్దార్ ఉధమ్ (హిందీ), లైలా ఔర్ సత్త గీత్ (గోజ్రి), షేర్ని (హిందీ), చెల్లో షో (గుజరాతీ), నాయత్తు (మలయాళం), బ్రిడ్జి (అస్సామీ), షేర్ షా (హిందీ), మండేలా (తమిళం), కాగజ్ (హిందీ), అట్ట వేల్ జాలి (మరాఠీ), తూఫాన్ (హిందీ), గోదావరి (మరాఠీ), కార్ఖానిశంచి వారి (మరాఠీ)… ఒక్కసారి గత దశాబ్దంలో ఎంట్రీలుగా పంపించబడిన సినిమాల్ని చూద్దాం… Jallikattu, Gully Boy, Village Rockstars, Newton, Visaaranai, Court, Liar’s Dice… అసలు Mother India (Hindi, 1957), Salaam Bombay! (Hindi 1988) and Lagaan (Hindi, 2001) మాత్రమే ఆస్కార్ చివరి పరిశీలన దాకా వెళ్లగలిగిన మన సినిమాలు… ఆస్కార్ అవార్డు కోసం ఈరోజుకూ మనకు నిరీక్షణే…
ఏదీ తెలుగు అనే పదం…? ప్రపంచ స్థాయికి వెళ్తున్నాం అని మనమే జబ్బలు చరుచుకుంటున్నాం… కానీ ప్రపంచం మెచ్చే అవార్డుల కోసం కనీసం ఎంట్రీలుగా కూడా పనికొచ్చే ఒక్క సినిమా ఏది..? పలు భారతీయ భాషల్లో సినిమా వేగంగా మారుతోంది, పలు ప్రయోగాలు, కొత్త క్రియేటివ్ ప్రయత్నాలు కనిపిస్తున్నయ్… భిన్నమైన కథాంశాలతో, టేకింగులతో కొత్త దర్శకులు చాలామంది తమ ప్రతిభ చాటుతున్నారు… ఇండస్ట్రీలో పాపులర్ స్టార్స్ కూడా తామే నిర్మించి, ఎంకరేజ్ చేస్తున్నారు… ఈసారి ఆస్కార్ ఎంట్రీగా ఎన్నికైన కూళంగల్ సినిమాను నిర్మించింది తమిళ సినిమా జంట నయనతార, విఘ్నేష్… కానీ మనం ఎక్కడున్నాం..? మనం ఇంకా పాత మూస ధోరణుల నుంచి బయటపడలేకపోతున్నామా..? చివరకు ఇతర భాషల్లో హిట్టయిన సినిమాల్ని కొని, మన సినిమా ధోరణులకు తగినట్టు, మన హీరోలకు తగినట్టు ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నామే తప్ప మనలో ఒరిజినల్ క్రియేటివిటీ ఏది..? ఫార్ములాకు భిన్నంగా కనీసం ఒక్క సినిమా ఏది..?
Ads
ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన జ్యూరీ ఈసారి అధికారికంగా పరిశీలించిన 14 సినిమాల జాబితా అది… (సరే, సర్దార్ ఉధమ్ సినిమాను ఎంపిక చేయకపోవడానికి అది బ్రిటిషర్లపై ప్రదర్శించబడిన ద్వేషమే కారణమని ఓ సభ్యుడు చెప్పడం, జ్యూరీ కోడిమెదళ్లపై వచ్చిన విమర్శలు వేరే ఓ దిక్కుమాలిన కథ…) ఈ జాబితా చూస్తే గోజ్రి భాషలో తీసిన ఓ సినిమా కనిపిస్తుంది… అసలు ఆ భాష పేరే చాలామందికి తెలియదు… గుర్జారీ, గోజ్రి, గుజారి, గుజ్రి, గోజరి తదితర పేర్లతో పిలిచే ఈ భాషను ప్రధానంగా గుర్జార్లు మాట్లాడతారు… పూర్తిగా నార్త్ ఇండియన్ భాష, అక్కడక్కడా పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది… అందులో కూడా నాణ్యమైన సినిమా… అంతేకాదు, మూడు మరాఠీ సినిమాలు… అసలు మరాఠీ సినిమా రేంజ్ మిగతా భాషలతో పోలిస్తే చిన్నదే… ఐనా బోలెడు ప్రయోగాలు… తమిళం, మలయాళం సరేసరి… ఒకటి అస్సామీస్, ఒకటి గుజరాతీ… మిగతావి హిందీ… ఇవేకాదు, కొంకణి, మైథిలి, భోజ్‌పురి, మణిపురి, గోర్ఖా, తులు వంటి భాషల్లోనూ కొన్ని ఎన్నదగిన సినిమాలు వస్తున్నయ్…
మార్కెట్‌పరంగా, సంఖ్యాపరంగా మనం ఎప్పుడూ హిందీ తరువాత ప్లేసులో ఉంటాం… కానీ ఇలాంటి జాబితాల్లో మాత్రం మన సినిమా జాడే కనబడదు… ఒకేసారి వివిధ భాషల్లోకి డబ్ చేసి, పాన్ ఇండియా సినిమాలు అని దేశమంతా విడుదల చేస్తున్నాం, ఇతర దేశాలకూ విస్తరిస్తున్నాం, మన మార్కెట్ విపరీతంగా పెరిగింది, పెట్టుబడి- ఇండస్ట్రీ రేంజ్ బాగా ఎదిగింది… అన్నింటికీ మించి విపరీతమైన వ్యయం పెరిగీ పెరిగీ, చివరకు అందులోనే ఇరుక్కుపోయాం మనం… ప్రయోగాలకు రిస్క్ తీసుకునే స్కోప్ లేకుండా చేసుకున్నాం మనమే… మరిక భిన్నత్వం, నూతనత్వం మాటేమిటి..? ఈ ప్రశ్నకు తెలుగు ఇండస్ట్రీ ముఖ్యులెవరి నుంచీ సరైన జవాబు దొరకదు… మహా అయితే ‘‘అవన్నీ అవార్డుల కోసమండీ, వాడిని ఎవడు చూస్తాడు? ఇది వినోదవ్యాపారం, ఎవడూ చేతులు కాల్చుకోవాలనుకోడు’’ అంటారేమో… కానీ మీరు పైన జాబితా చూస్తే కమర్షియల్ సక్సెస్‌లూ ఉన్నయ్… గతంలోలాగా ఇప్పుడు సమాంతర సినిమా, అవార్డు సినిమా, కమర్షియల్ సినిమా అంటూ తేడాలేమీ లేవు, ఈ ఓటీటీ యుగంలో నిర్వచనాలు, ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నయ్… ఎటొచ్చీ మన మైండ్‌సెట్‌లోనే ఏదో తేడా… అంతే..!!
Share this Article