ఇప్పుడు చెప్పండి… ప్రశాంత్ కిషోర్ మాటల్లో తప్పేముందో..? అవే మాటల్ని మమతా బెనర్జీ వల్లెవేయడంలో తప్పేమిటో..? ఉన్నమాటే అన్నారు… కాంగ్రెస్ బలహీనతలే బీజేపీకి ప్లస్… లేదా తెలంగాణ కోణంలో చూస్తే టీఆర్ఎస్‌కు ప్లస్..! ప్రజల కోరిక మేరకు, ఏపీలో పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా, అధికారంలోకి రాలేక.., కేసీయార్ కొట్టిన వరుస దెబ్బలతో బలహీనపడిన కాంగ్రెస్ దుస్థితి నిజంగానే టీఆర్ఎస్‌కు ఓ ఫాయిదా… పార్టీలో ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో కూడా పార్టీ శ్రేణులకు అర్థం కాని అయోమయమే ఇన్నేళ్లూ… ఆ డిప్రెషన్ నుంచి ఈమధ్యే కాంగ్రెస్ శ్రేణులు బయటపడుతున్నయ్… రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టాక, ఎవరికి నచ్చినా, ఎవరికి నొచ్చినా సరే పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ పెరిగినమాట నిజం… టీఆర్ఎస్ మీద పెరుగుతున్న వ్యతిరేకత కారణం కావచ్చు, రేవంత్ దూకుడు ఫలితం కావచ్చు, కానీ ఈమధ్య కొంత పార్టీ కేడర్‌లో కదలిక పెరిగింది… ప్చ్, ఏం లాభం..? ఉద్దేశపూర్వకమో, అలవాటైన పెడసరం ధోరణో గానీ, కేసీయార్ నెత్తిన పాలు గుమ్మరించడానికి ఇదుగో ఇలాంటి జగ్గారెడ్డి వంటి లీడర్లు ఎప్పుడూ కాంగ్రెస్‌లో రెడీగా ఉంటారు…
పాపం రేవంత్… నిజానికి తను బీజేపీతో లేదా టీఆర్ఎస్‌తో చేసే ఫైట్‌కు అనేకరెట్లు సొంత పార్టీలోని ప్రత్యర్థులతో పోరాడాల్సి ఉంది… నిజమే, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచీ అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ అనే మాట నిజమే.., వర్గాల కుంపట్లు, విభేదాలు కూడా ఎప్పుడూ చూసేదే… కొన్నిసార్లు అది పార్టీకి బలం కూడా..! కానీ జగ్గారెడ్డి టైపు స్వేచ్ఛ ఏకంగా పార్టీ బలానికే కత్తెర వేసే ప్రమాదం… తనేమీ సాధారణ కార్యకర్త కాదు, ఇప్పుడు తను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా… ఐనా, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడవద్దో తెలియడం లేదు… ఏం మాట్లాడుతున్నాడు..? సేమ్, తెలంగాణ ఉద్యమకాలంలో వినిపించిన సమైక్యగానాన్నే మళ్లీ ఎత్తుకుంటున్నాడు… దానికి కేసీయార్ వ్యాఖ్యల్ని, పేర్ని నాని కౌంటర్‌ను బేస్ చేసుకున్నట్టు కవరింగు ఇస్తున్నాడు తప్ప… కేసీయార్ వ్యాఖ్యలకు, పేర్ని నాని ప్రతివిమర్శలకు విపరీత బాష్యాలు చెప్పి, ప్రజల కళ్లు గప్పడమే… యాంటీ-తెలంగాణ భావజాలం, ఆ మాటలు తప్పకుండా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతకు దారితీస్తే, అది మళ్లీ మళ్లీ కేసీయార్‌కు ఫాయిదా కల్పించడమే… (గత ఎన్నికల ముందు చంద్రబాబు తెలంగాణ తెర మీదకు రావడంతో కేసీయార్ నెత్తిమీద పాలు పోసినట్టయింది… తన మీద వ్యతిరేకత కాస్తా తొలగిపోయి కేసీయారే బెటరనే భావన తనను మళ్లీ గెలిపించింది…)
Ads
నిజానికి టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీయార్ ‘ఏపీలో పార్టీ పెట్టాలని అడుగుతున్నారు’ అని చేసిన వ్యాఖ్య సందర్భం వేరు… ఉద్దేశం వేరు… అవి జగన్ పాలనపై పరోక్షంగా విసుర్లుగా అనిపించినా సరే, కేసీయార్ వ్యాఖ్యల అర్థం వేరు… ‘విడిపోతే తెలంగాణ చీకటిమయం అయిపోతుందని అన్నారు, అలా శాపాలు పెట్టిన ఆంధ్రాకన్నా తెలంగాణ అభివృద్ధిలో ముందుకుపోతోంది… వెక్కిరించిన ఆ నోళ్లే మూతపడుతున్నయ్… పొరుగున ఉన్న రాయచూరు, నాందేడ్ ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారు… ఏపీలో కూడా మా పార్టీ పెట్టాలని అడుగుతున్నారు’…. ఇవే కదా, కేసీయార్ చెప్పింది… ఈ వ్యాఖ్యలు తన పాలనను ప్రమోట్ చేసుకోవడం కోసం… అంతే తప్ప, తను రెండు ప్రాంతాల కలయిక గురించి చిన్న పదం కూడా మాట్లాడలేదు, ఒకవేళ కేసీయార్ అలా మాట్లాడితే తనకే ఆత్మహత్యా సదృశం అవుతుంది… ఆమాత్రం తెలియనివాడా కేసీయార్..? దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్‌గా ఓ సెటైర్ వేశాడు, వేరే పార్టీ ఎందుకు, రెండు రాష్ట్రాలూ కలిపేద్దాం, ఇక్కడా పోటీచేయొచ్చు కదా అన్నాడు… జగన్, వైసీపీ నేతలది సమైక్య ధోరణే కావచ్చుగాక… కానీ పునఃకలయిక ఎంత అసాధ్యమో, అసలు అలాంటి ప్రయత్నాలు జరిగితే తెలంగాణ మళ్లీ ఎలా భగ్గుమంటుందో జగన్‌కు తెలియదా..? నిజానికి తనే తెలంగాణలో పార్టీని మూసేసుకున్నాడు కదా… (షర్మిలతో వేరే పార్టీ అనేది వేరే కథ)…
మరి కేసీయార్ అనని మాటల్ని ఆయన నోట్లో పెట్టేసి… ‘అదుగో చూశారా, రెండు రాష్ట్రాలూ మళ్లీ కలిపేస్తే బాగుండునని అంటున్నాడు, మంచిదే, అలా చేస్తే నేనూ మద్దతిస్తా’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జగ్గారెడ్డి చేసే వ్యాఖ్యలు పార్టీకి ఎంత నష్టమో ఎవరైనా ఆలోచిస్తున్నారా..? తెలంగాణ సమాజం ఈ ధోరణులకు మద్దతునిస్తుందా..? ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న దశలో పార్టీ చక్రాలకు పంక్చర్ చేయడమా ఇది..? తెలంగాణ ఏర్పాటే ఓ పెద్ద యజ్ఞం, అది అల్లాటప్పాగా జరగలేదు, తిరిగి ఏపీతో కలయిక అనే భావనే తెలంగాణ సమాజంలో మంటపుట్టిస్తుంది… తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల ఉన్న కాస్త సానుభూతిని కూడా తుంగలో కలిపేసి, తెలంగాణ సమాజంలో పార్టీ పట్ల వ్యతిరేకత పెంచితే దానికి బాధ్యులు ఎవరు..? ఇలాంటి వ్యాఖ్యలతో ఏమిటి ఫాయిదా..? ఎవరికి ఫాయిదా..?! ఇప్పుడు చెప్పండి, కాంగ్రెస్‌కు నిజమైన ప్రత్యర్థులు ఎవరో…!! పార్టీలో ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే, తను ఇచ్చిన మాట మీద నిలబడి, తెలంగాణ ఇచ్చిన సోనియా నిర్ణయాన్ని జగ్గారెడ్డి ఇలా మళ్లీ మళ్లీ తప్పుపడుతున్నాడా..?!
Share this Article