ఆటగాళ్లు అకస్మాత్తుగా తన ఫామ్ కోల్పోతుంటారు, ప్రత్యేకించి క్రికెట్‌లో..! టీమ్స్‌కు కూడా ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది… మొత్తంగా ఫామ్ కోల్పోతారు, అసలు వీళ్లకు ఆట వచ్చా అన్నట్టుగా వైఫల్యాలు వెక్కిరిస్తయ్… సహజమే… అయితే క్రికెట్ అంటేనే వేల కోట్ల దందా కాబట్టి… ఫిక్సర్లు, బెట్టింగ్ మాఫియాలు, విపరీతమైన డబ్బు, స్పాన్సరర్లు, ప్రలోభాలు, విలాసాలు ఉంటయ్ కాబట్టి, మన దేశంలో క్రికెట్ అంటే ఓ మతం కాబట్టి ఈ చర్చ కాస్త ఎక్కువ… పోనీ, టీ20 వల్డ్ కప్‌లో అధ్వానమైన ఆట తరువాత ఏమైనా ప్రక్షాళనో, సంస్కరణలో ఉంటుందని ఆశిద్దాం, అన్నింటికీ మించి కోహ్లీని కేవలం ఆటగాడిగా మాత్రమే ఉంచితే బెటర్… తనకూ, టీమ్‌కూ… పాత కోహ్లీని చూసి ఎన్నాళ్లయిందో..! న్యూజిలాండ్ ఫైటింగ్ స్పిరిట్ మనకు తెలిసిందే కాబట్టి ఆ జట్టు మీద ఓటమి పెద్దగా బాధించదు… న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ప్రేమించే అభిమానులు మన దేశంలోనే బోలెడు మంది… ఏ రియల్ ప్లేయర్… స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ ఉన్నవాడు… ఐపీఎల్ ప్లేయర్ కూడా… మరి ఇండియాను ఓడించినందుకు తిట్టేద్దామా..?
పాకిస్థాన్ మీద ఓటమి సంగతికొద్దాం… గతంలో ఎప్పుడూ మనం ఓడిపోలేదా..? ఇప్పుడెందుకిలా శోకాలు, విమర్శలు, తిట్లు, శాపనార్థాలు… ఓడిన తీరు ఘోరంగా ఉండవచ్చుగాక… కానీ ఆఫ్టరాల్ అదొక ఆట… దానికి మతం రంగు పులిమి నానా రచ్చ చేశారు… పాకిస్థానీ క్రికెటర్లు అంటేనే సొల్లు ఎక్కువ, వాచాలత… దానికితోడు అక్కడి పొలిటిషియన్లు… ఇండియాను ఎంత తిడితే అంత పాపులారిటీ… వాడెవడో బుద్ధిహీనుడు ఈ గెలుపు ముస్లింల గెలుపు అంటాడు… అదెలా..? రేప్పొద్దున ఇదే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే అప్పుడేమంటారు..? పాకిస్థాన్ గెలుపును సెలబ్రేట్ చేసుకునే మూర్ఖశిఖామణులు మనకు కొత్తేమీ కాదు, ఏళ్లుగా చూస్తున్నదే… (దీన్ని కూడా మోడీ, యాంటీ-మోడీ… హిందుత్వ, నాన్-హిందుత్వ కోణంలో ఆలోచించే బుర్రలూ బోలెడు…) నిజానికి షమిని నిందించడం మరో నీచమైన పని… తను ఇండియన్ ప్లేయర్… తన కెరీర్, తన డబ్బు, తన ఇమేజీ, తన సోల్… తన క్రికెట్ జట్టు కోసమే… పాకిస్థాన్ అనగానే లూజ్ బాల్స్ వేశాడా..? మతమే కారణమా..? ఎంత నాన్సెన్స్ విమర్శలు..? మరి మిగతా బౌలర్స్ ఎందుకు ఫెయిలయ్యారు..? ఈ ప్రశ్నకు జవాబు ఉండదు ఎవరి దగ్గరా..? షమీకి మద్దతు విషయంలో ఇండియన్ క్రికెటర్లు, మాజీలు ప్రదర్శించిన సంఘీభావం నిజంగా అభినందనీయం…
Ads
అన్నట్టు, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఈశ్ సోది గుర్తొచ్చాడు… అసలు పేరు ఇందర్‌బీర్ సింగ్… పుట్టింది మన దేశంలోనే… లూథియానా..! జన్మతః భారతీయుడు… చిన్నప్పుడే న్యూజిలాండ్ వెళ్లింది ఆ కుటుంబం… ఆ దేశ జట్టులో బౌలర్… నిన్నటి మ్యాచులో కోహ్లీని, రాహుల్‌ను ఔట్ చేసి, వెన్ను విరిచింది తనే… మరి మా ఇండియా రూట్స్ అని లూజ్ బాల్స్ ఏమీ వేయలేదు కదా… మా పంజాబీ కోహ్లీ, మా పంజాబీ అల్లుడు రోహిత్ అని ప్రేమ ఏమీ చూపించలేదు కదా… దటీజ్ స్పిరిట్… తన జట్టు, తమ గెలుపు… అదే లక్ష్యం… తన రికార్డులు చూస్తే పెద్ద ఇంప్రెసివ్ ఏమీ అనిపించవు… అయిదు వికెట్లు తీసిన ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు… ఐతేనేం… రెండేళ్ల క్రితం అధికారికంగా నంబర్ వన్ ర్యాంకు టీ20 బౌలర్ తను… మరి మనవాడే, అయినా మనవాళ్లను దుర్మార్గంగా ఔట్ చేశాడు అని ఏడవలేదేం..? సో, మన మైండ్‌సెట్‌లోనే ఉంది లోపం… అరె, బెలూచిస్థాన్ విముక్తి పోరాటం, పీవోకేలో అక్రమాలు, అప్ఘన్‌లో పాక్ ఆటలు, ముంచుకొస్తున్న తాలిబన్ల ముప్పు… ఇలాంటివి కదరా ఆలోచించాల్సింది… ఈ దందా గేమ్‌లో ఎవడు గెలిస్తేనేం..? ఎవడు ఓడిపోతేనేం..? పిచ్ మీద కనిపించే ఆట వేరు… తెర వెనుక ఆట ఆడించే ప్లేయర్లు వేరు… ఛల్ జానేదేవ్… ఛోడ్ దేవ్… ఇలాంటి ఈశ్ సోదిలు, ఇండియన్ రూట్స్ ఉన్న ప్లేయర్లు బోలెడు మంది వివిధ దేశాల జట్లలో ఉన్నారు… అందరినీ ఓ నైతిక సంక్షోభంలోకి నెట్టేయకండి…!!
Share this Article