Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జై భీమ్..! ఈ సినిమాను ఎందుకు మెచ్చుకోవచ్చునంటే..?

November 2, 2021 by M S R

అత్యంత వెనుకబడిన, అణగారిన ఇరులార్ ఆదివాసీ తెగ సంక్షేమం కోసం హీరో సూర్య, జ్యోతిక దంపతులు కోటి రూపాయల విరాళాన్ని పళంకుడి ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ సాక్షిగా అందించిన ఫోటో, వార్త చూశాం కదా… ఆ ట్రస్టును మాజీ లాయర్, జస్టిస్ చంద్రు నడిపిస్తున్నాడు… ఆ కథనానికి మనం చప్పట్టు కొట్టాం కదా, ఎంత మంచివాడవురా అని మెచ్చుకున్నాం కదా… ఈ వార్తకు నేపథ్యం తను తీసిన జైభీమ్ సినిమా… ఆ సినిమా అమెజాన్‌లో విడుదల చేశారు… సినిమా చూశాక సూర్యను మరోసారి మెచ్చుకోవాలి అనిపిస్తుంది… ఆ సినిమాను నిజంగా ఎందుకు మెచ్చుకోవాలి..? ఏముంది అందులో..? నిజానికి సగటు సౌతిండియన్ సినిమాలో ఉండే పిచ్చి కథలు, దిక్కుమాలిన హీరోయిజం, ఐటమ్ సాంగ్స్, తిక్క పాటలు, వెర్రి గెంతులు ఏమీ లేవు… అసలు మనకు తెలిసిన వెగటు ఫార్ములాకు భిన్నం… ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం…

jaibhim

ఎప్పుడో 1993లో నిజంగానే జరిగిన సంఘటనలతో రూపొందిన సినిమా ఇది… అత్యంత వెనుకబడిన ఇరులార్ జాతి గురించి మనం నిన్ననే చెప్పుకున్నాం కదా… ఓ ముగ్గురి మీద తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు విపరీతంగా హింసిస్తారు… వాళ్ల తరఫున చంద్రు అనే లాయర్ నిలబడతాడు, పోరాడతాడు… తను కమ్యూనిస్టు, అంబేద్కరైట్… తన వెనుక పెరియార్, అంబేద్కర్, మార్క్స్ ఫోటోలు కనిపిస్తుంటాయి… సినిమాలో కేసు ఇన్వెస్టిగేషన్, కాస్త థ్రిల్, కోర్టు రూం డ్రామా… కానీ అంతర్లీనంగా మన సమాజంలో ఈరోజుకూ అంతులేని వివక్షకు గురవుతున్న జాతుల గురించి చెబుతుంది, కలిచివేస్తుంది… ఇలాంటి తెగలు దేశంలో ఇంకా ఎన్నో ఉన్నయ్… చంద్రు తరువాత జస్టిస్ అయ్యాడు… ప్రస్తుతం పళకుండి ట్రస్టు నడిపిస్తున్నది తనే… ఆ పాత్రనే హీరో సూర్య పోషించాడు…

Ads

jaibhim

అసలు సూర్య అంటేనే మాస్ కదా… సింగం-1, 2, 3 వంటి సూపర్ కాప్ సినిమాలు గుర్తొస్తాయి కదా… కానీ తన ఒరిజినల్ టేస్ట్ వేరు… ఈ జైభీమ్ సినిమాలో పోలీసు హింసకు పక్కా వ్యతిరేక పాత్ర… ఎక్కడా సగటు తెలుగు హీరో లక్షణాలు లేకుండా ప్లెయిన్‌గా ఆవిష్కరించాడు దర్శకుడు జ్ఙానవేల్… కథలో, కథనంలో ఎక్కడా దారితప్పలేదు… ఒక్క మాట కూడా ఎక్కువ లేదు, తక్కువ లేదు… తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్ట్రెయిట్‌గా చిత్రీకరించాడు… కస్టోడియల్ హింస మీద తీసిన సీన్లు నిజంగా కుదిపేస్తాయి… లెంత్ కాస్త ఎక్కువైనా సరే, కథలో తీవ్రతకు అదే మెయిన్ పాయింట్ కాబట్టి పర్లేదు… అసలు ఇదేకాదు, మొత్తం సినిమాలో కృత్రిమత్వం ఏమీ ఉండదు… రియలిస్టిక్‌గా కనిపిస్తాయి… నిజంగా టేకింగ్, కథనం నడిపించడంలో ఇటీవల పలువురు తమిళ, మలయాళ దర్శకులు కనబరుస్తున్న తపన గ్రేట్…

jaibhim
సూర్య విషయానికి వద్దాం… ఓ మాస్ పాత్ర గాకుండాా, తనకు పాత్ర నచ్చితే భిన్నమైన పాత్రలకు తను ఎప్పుడూ రెడీ… ఆకాశం నీ హద్దురా సినిమా కూడా ఈ కోవలోనిదే… ఇప్పుడు జైభీమ్‌లో లాయర్ పాత్ర… ఎక్కడా ఓ మాస్ హీరో కనిపించడు, జస్ట్, పాత్ర మాత్రమే… ఆ పాత్రలోకి ఒదిగిపోయాడు… అంతేకాదు, సినిమాను నిర్మించింది తనే… తమిళ హీరోలకు సంబంధించి ఈమధ్య కొత్త విశేషం ఏమిటంటే..? దర్శకుల్ని గౌరవిస్తూ, వారికి స్వేచ్ఛ ఇవ్వడం, తామే నిర్మించడం… ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైన కూళంగల్ సినిమాను కూడా నయనతార, విఘ్నేశ్ శివన్ నిర్మించారు… ఇదొక కొత్త ఆహ్వానించదగిన ధోరణి… రెగ్యులర్ నిర్మాతలకు కనువిప్పు… పైగా సినిమా కథ స్పూర్తితో తమ నిర్మాణ సంస్థ నుంచి కోటి రూపాయల విరాళం సరేసరి… దర్శకుడు జ్ఞానవేల్ కూడా తన లక్ష్యం నుంచి పక్కకు జరగకుండా, హీరో వకీల్ సాబ్‌లాగా ముష్కర విలన్లను, వారివారి గూండాలను పిడి గుద్దులతో దునుమాడకుండా, డ్యూయేట్లు ప్రేమ ట్రాక్ లు లేకుండా.., పీడితులకు ముందు కాక వెనుక నిలబడి న్యాయస్థానం అంటే తీర్పు కాదు నమ్మకం అని విశ్వసించే కేవలం ఓ న్యాయవాది కథగా నడపడంలో దర్శకుడు ఎక్కడా దారి తప్పలేదు. టీచరమ్మాయితో లాయర్కు ప్రేమ వ్యవహారం పేరిట రెండు పాటలు, ఒక మెట్రో ఫైట్ పెట్టే అవకాశం వున్నా జ్ఞానవుేల్ ఆ మాస్ ధోరణిలోకి పోలేదు…

jaibhim

సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగింది లిజోమోల్ జోస్ పోషించిన సెంగెని (చిన్నతల్లి) పాత్ర… ఆహా… ఒక నటిగా ఆమెకు పేరు తెచ్చే పాత్ర… అచ్చంగా ఆ బాధిత బ్లాక్ లేడీ పాత్రలోకి ఇమిడిపోయింది… ఈ మలయాళీ నటి ఫిల్మోగ్రఫీ చూస్తే ఆరేళ్లలో తొమ్మిది సినిమాలు… కానీ ఒక సీనియర్ నటిలాగే బాగా చేసింది… ఓ మంచి పాత్రకు మనవాళ్లు కూడా మలయాళ, తమిళ తారల్ని ఎంపిక చేసుకుంటున్నారంటే కారణం వాళ్ల ప్రతిభ, వాళ్ల కమిట్మెంట్… ఎలాంటి పాత్రనైనా అంగీకరిస్తారు, చేతనైనంతగా ప్రయాసపడతారు… నార్త్ ఇండియన్ స్టార్స్ అనగానే తెల్లతోలు, ఆరబోతలు, ఉద్వేగాలు లేని దేభ్యం మొహాలు… మరో పాత్ర మణికందన్ పోషించిన రాజకన్ను (రాజన్న) పాత్ర… సూర్య, ప్రకాష్‌రాజ్ తదితరుల పాత్రకన్నా ఎక్కువగా గుర్తుండిపోతుంది ఈ పాత్ర… తన నటన… (నిజం చెప్పాలంటే ప్రకాష్‌రాజ్ తదితరులు కూడా వెలవెలబోయారు…) అణగారిన వర్గాలపై వివక్ష, హింస, కస్టోడియల్ వయోలెన్స్ తదితర అంశాల మీద ఈ సినిమా ప్రేక్షకుల మనస్సుల్లో ఆలోచనల్ని రేకెత్తించేది… హిందీని వెకిలి చేసే ఒకటీ అరా సీన్లు బాగుండకపోయినా స్థూలంగా సినిమా ఓసారి చూడదగింది… ఇలాంటి సినిమాలు తీసేలా ఊతం ఇవ్వడానికి కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions