ఈటల గెలిచాడు…! నిజమే… అదేమిటి, బీజేపీ కాదా గెలిచింది..? కాదు…! నిర్మొహమాటంగా చెప్పాలంటే బీజేపీ కాదు… ఆ మాజీ అతివాద కమ్యూనిస్టు, అనంతరం తెలంగాణవాది, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి, బీజేపీ గుర్తుపైనే పోటీచేశాడు కాబట్టి, బీజేపీ శ్రేణులు సిన్సియర్‌గా వర్క్ చేశాయి కాబట్టి… సాంకేతికంగా మాత్రమే ఇది బీజేపీ గెలుపు..! మరీ నిర్మహమాటంగా చెప్పాలంటే ఇది ఈటల వ్యక్తిగత సానుకూల వోటు కూడా కాదు… సంపూర్ణంగా ఇది కేసీయార్ వ్యతిరేక వోటు…! తన అహం కోసం, ఒక నేతను రాజకీయంగా తొక్కేయడం కోసం… స్థూలంగా మన దేశ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసేలా, అఘోరా అర్చన తరహాలో సాగిన ఓ ‘క్షుద్రపూజ’ను ప్రజలే విజ్ఞులై ఛీత్కరించారు… ఈ పూజకు క్షేత్రపూజారిగా ఉన్న ఓ పెద్దమనిషి చెప్పినట్టు… ‘‘టీఆర్ఎస్ క్యాంపు టచ్ చేయని యాంగిల్ లేదు… ఇంతకుమించి పోల్ మేనేజ్‌మెంట్ ఇంకెవరూ చేయలేరు… కొనుగోళ్లు, ప్రలోభాలు, నియామకాలు, పంపకాలు, బెదిరింపులు… నెవర్, ఈ రేంజ్ ఎఫర్ట్ ఏ పార్టీ వల్ల కాదు… కానీ ప్రజలు, కాదు, ప్రత్యేకించి ఇతర పార్టీల విజ్ఞత, లౌక్యం, రాజకీయం, విచక్షణ టీఆర్ఎస్‌ను ఏకాకిని చేశాయి… అవును మరి, ప్రబల శత్రువే ప్రథమ లక్ష్యం ఎవరికైనా…
ఈటలకూ, కేసీయార్‌కూ ఎక్కడ చెడిందో ఈరోజుకూ ఎవరూ చెప్పలేరు… అసలు టీఆర్ఎస్‌లోనూ ఒకరిద్దరు ముఖ్యులకు తప్ప ఆ వైరం ఏమిటో అర్థం కాలేదు… పార్టీని చీల్చే ప్రయత్నాలు చేశాడా..? కొత్త పార్టీ పెట్టుకోవడానికి ప్రయత్నించాడా..? వేరే పార్టీల తరఫున రాయబేరాలు నడిపాడా..? పార్టీకి వెన్నుపోటు పొడవాలని అనుకున్నాడా..? కుటుంబపాలనను వ్యతిరేకించాడా..? కేసీయార్ ఓనర్‌షిప్‌ను ప్రశ్నించాడా..? ఇంకేమైనా ఆర్థిక కారణాలున్నాయా..? సరే, కారణాలేమైనా సరే… కేసీయార్‌కు నచ్చలేదు… కర్తవ్యం అనే సినిమాలో ఓ వ్యంగ్య విలనీ డైలాగ్ ఉంటుంది, ‘నీ జీవితం మీద నాకు విరక్తి కలుగుతోంది’ అని…! అంటే నీ పని ఇక ఖతం అని చెప్పడమన్నమాట…
Ads
నిజంగానే ఈటల మీద అంత కోపం వస్తే, సింపుల్‌గా పార్టీ నుంచి బయటికి పంపించేయాలి, అంతేతప్ప, కేసులు పెట్టి, భూముల్ని లిటిగేషన్‌లో పడేసి, భయపెట్టి కక్షసాధింపుకు వెళ్లాడు… రాజీనామా చేసేలా దాడికి ఉసిగొల్పాడు తమ శ్రేణులను… తన పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలనే నైతికత ప్రదర్శించలేదు గానీ, అర్జెంటుగా ఈటల జనం తీర్పు కోరాలట… ఇలా ఓ ఉపఎన్నికను తీసుకొచ్చి రుద్దాడు… ఈటల ఓటమి కోసం కనీవినీ ఎరగని మంత్రాంగం, యంత్రాంగం సర్వశక్తులూ ఒడ్డాడు… అత్యంత ఖరీదైన ఉపఎన్నిక… చివరకు ఏమైంది..? అదే ఈటల మొహాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చూడకతప్పదు కదా… ఈటల వేసే ప్రశ్నలకు ముఖ్యమంత్రిగా, సభానాయకుడిగా కేసీయారే జవాబులు చెప్పకతప్పదు కదా… ఇప్పుడు స్ట్రెయిటుగా ఈటల కళ్లల్లోకి చూసే నైతిక ధైర్యం ఉందా పాలకుడికి..?
బీజేపీ విషయానికి వద్దాం… ఆ పార్టీకి కేసీయార్ ప్రథమ టార్గెట్, కొంత కష్టపడితే తెలంగాణలో అధికారం వస్తుందనే ఆశలున్నయ్… జైలుకు పంపిస్తం, అవినీతిపై ఆధారాలున్నయ్ అని బీరాలు పలకడమే తప్ప క్షేత్ర స్థాయిలో కదులుతున్నది ఏమీ లేదు… కేసీయార్ మీద వ్యతిరేకత ప్రబలితే దాన్ని వాడుకోవాలనే భావనే తప్ప నిజంగా బండి ఉత్సాహంగా ఉరుకుతున్నది ఏమీలేదు… పైగా ఆ పార్టీలో పాతుకుపోయిన సీనియర్ల ధోరణి సరేసరి… ఈ స్థితిలో ఈటల అందివచ్చాడు, కండువా కప్పేశారు… కానీ ఎక్కడా ఈటల తను ఓ బీజేపీ నాయకుడిలాగా ప్రొజెక్ట్ కాలేదు… మోడీ కీర్తనలు, మతతత్వ నినాదాల జోలికి పోలేదు… తనకు జరిగిన అన్యాయం, కేసీయార్ వైఖరిని ప్రచారం చేసుకుంటూ సానుభూతిని పొందే ప్రయత్నం చేశాడు… తప్ప ఓ కాషాయనేతగా కనిపించలేదు…
కాంగ్రెస్ చేతులెత్తేసింది, రేవంత్ ఫెయిల్యూర్, డిపాజిట్ రాలేదు అనే విమర్శలు అర్థరహితం… కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ తెలియకకాదు, తెలిసీ కావాలనే స్తబ్దుగా ఉండిపోవడం అది… టీఆర్ఎస్ డిమోరల్ అయిపోయి, డిఫెన్స్‌లో పడితే తప్ప, కేసీయార్ ఓ సూపర్ మ్యాన్ ఏమీ కాదు అనే ఫీల‌్ కలిగించడం దానికి అవసరం… అందుకే ఈటల సన్నిహితుల ప్రయత్నాలు సక్సెసయి కాంగ్రెస్ లోపాయికారీగా వ్యవహరించింది అనేది ఓ బహిరంగ రహస్యం… కాంగ్రెస్ గనుక ఓ బలమైన అభ్యర్థిని పెట్టి వదిలేస్తే చాలు, ఈటల గెలిచేవాడు కాదు… కాంగ్రెస్ మాత్రమే కాదు, యాంటీ-టీఆర్ఎస్ పోకడలతో ప్రవీణ్, కోదండరాం, తదితరుల అభిమానగణం కూడా వ్యవహరించాయి… అధికారులు, ఉద్యోగులు తమకు అప్పగించిన ‘అధికార దుర్వినియోగం’ బాధ్యతల్ని భయంతోనో, భక్తితోనో నిర్వర్తించారే తప్ప ఉద్యోగగణంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది…
మేధావులు, జర్నలిస్టులు, వ్యాపారులు… చివరకు వరి నిషేధ వార్తలతో రైతులు కూడా వ్యతిరేకమయ్యారు.., సిద్దిపేట కలెక్టర్ చేసిన నష్టం అంతాఇంతా కాదు… దళితబంధు ప్రవేశపెట్టినా సరే మొత్తం దళితసమాజం కేసీయార్ పట్ల మొగ్గుచూపలేదు… ఇది కేవలం ఓ తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం స్టార్ట్ చేసిన ‘పథకం’ అనే అపనమ్మకం పెరిగింది… చోటామోటా లీడర్లు కేసీయార్ క్యాంపుకి చేరినంతమాత్రాన వోటర్లు వెంటనే షిఫ్ట్ అవుతారనేమీ లేదు… ఇలా అరయగ కర్ణుడీల్గె అన్నట్టు… అనేకానేక కారణాలతో కేసీయార్ ఒంటరివాడయ్యాడు… ఒకప్పుడు కేసీయార్ ఓడితే తెలంగాణ ఓడిపోయినట్టు… కానీ ఇప్పుడు..? కేసీయార్ ఒకప్పటి తెలంగాణ ఐకన్… మరి ఇప్పుడు..? అంతర్మథనం, సమీక్ష, మార్పు, దిద్దుబాటు అవసరం… కానీ ఎహె, ఇది మాకు లైట్, ఇది పోతే పెద్ద నష్టమేమీ లేదు అనే ధోరణే బలంగా ఉంటే మాత్రం… కాలం చెబుతుంది ఫలితం ఏమిటో…!!
Share this Article