పద్మావతీ పద్మావతీ, నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి, దాంతో నీ పనైపోయింది అధోగతి…….. ఈ డైలాగ్ గుర్తుందా మీకు..? చూడాలని ఉంది అనే సినిమాలో చిరంజీవి, సౌందర్యల మధ్య ఓ సంభాషణ… భలే కామెడీ… బాగా పాపులర్ కూడా…! ఒకరకంగా సెటైర్ మన కవిత్వం తీరుపై…!! మరి అదే ధోరణి అదే చిరంజీవి తాజా సినిమాలోని ఓ పాటలో ఉంటే..? ఆహా, ఓహో అని చప్పట్లు కొట్టాలా… అమ్మడూ కుమ్ముడూ తరహాలో ఏం రాశాడు బ్రదర్ అని రాగాలు తీయాలా… ఫాఫం, ఆ పిచ్చి లిరిక్స్‌కు ఏం డాన్స్ కంపోజ్ చేయాలో తెలియక, నాదేం పోయిందిలే అనుకుని, సదరు చిరంజీవి వారసరత్నం రాంచరణ్‌తో కూడా కొన్ని ఆడ స్టెప్స్ వేయించిన శేఖర్ మాస్టర్ తెలివికి ప్రశంసలు తెలపాలా… ప్చ్, మణిశర్మ అనే ఒకప్పటి సంగీత దర్శకుడు ఇప్పుడిలా సంగీత అర్భకుడు అయిపోయాడని నిట్టూర్చాలా..?
అధర కాగితం, మధుర సంతకం అని రాసిన చంద్రబోస్ అప్పటి సూపర్ విద్వత్తుకు యావత్ తెలుగు ప్రేక్షకగణం జాలితో పడీ పడీ చప్పట్లు కొట్టింది అప్పట్లో… కానీ మహా మహా ఒరిజినల్ విద్వత్తు ఉందని చెప్పుకోబడే అనంత శ్రీరాముడి సర్కస్ ఫీట్లకు ఏం చేయాలో..? ఇదుగో బిస్కెట్టు, ఇచ్చేయ్ చాక్లెట్టు, విప్పెయ్ జాకెట్టు, కొట్టేయె బ్రాకెట్టు, పడిందోయ్ వికెట్టు, ఆగిందంటే హాంఫట్టు… ఇలాంటి తిక్క ప్రాస కవితలు సోషల్ మీడియాలో కోకొల్లలు… అయిదో తరగతి, ఆరో తరగతి పిల్లలు కూడా ఎడమచేత్తో గీకిపారేస్తున్నారు వ్యంగ్యంగా… వెక్కిరింపుగా… ఇప్పుడు ఆచార్య సినిమాలో నీలాంబరి పాట సేమ్ అదే స్థాయిలో ఉంది… అసలే శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన గమ్మత్తైన కంపోజింగ్‌తో లాహే లాహే అనే పాట భక్తి పాటో, రక్తి పాటో, ప్రేక్షకులకు విముక్తి పాటో అర్థం కాకుండా పోయింది… ఇక ఇప్పుడు ఈ పాట…
Ads
అసలు ఓ భక్తి పాట దిగుదిగుదిగునాగో పాటను ఖూనీ చేసి, ఖండఖండాలు చేసిన అనంత శ్రీరాం పాట విన్నాం కదా… వరుడు కావలెను సినిమాలో… ఆ సినిమా ఆ దెబ్బకు ఫట్… నాగశౌర్య కోలుకోలేదు, పైగా హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌజులో పేకాట క్లబ్ కేసులో ఇరుక్కున్నాడు… ఇక ఈ శ్రీరాం రాసిన ఈ పాటకు రాంచరణ్ ఏమవుతాడో, చిరంజీవి ఏమవుతాడో… ఫాఫం శమించుగాక… లేకపోతే ఏమిటి శ్రీరాం..? ఇదేనా నువ్వు పాటలు రాసే తీరు..? అప్పుడప్పుడూ వేటూరి దిగజారలేదా..? ఆత్రేయ జారిపోలేదా అన్నట్టుగా… ఈ అంత్య ప్రాసలేమిటి..? రాతలో ఈ ప్రయాసలేమిటి..? ప్రాసలే సాహిత్యమా..? దాని కోసం సర్కస్ ఫీట్లు చేయడమే సంగీతమా..? జాలేస్తుంది శ్రీరాం… ఒకసారి ఆ పాటలోని ప్రాసల ప్రయాసల యజ్ఞం చదువుతారా..?
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
చంద్ర సోదరి
మంత్రాలేమిటోయ్ పూజారి
కాలం పోదా చేజారి
రావే నారి
నేనేం చేయనే నన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి
విడిచె ఇప్పుడే ప్రహారీ
నిన్నే కోరి
మాటల జాలరి
ఒళ్లో వాలదా నా సిరి
మాటలే ఆవిరి
పాటతో పందిరి
అడుగేస్తే నీకే నౌకరి
కలలో ఆరితేరి
చాలదోయి నీ గురి
ఆపినా నీ బరి
నువ్వు నా ఊపిరి
రాశా చాకిరి
……… కానీ ఏమాటకామాట సామజవరగమనా అంటూ సిరివెన్నెల స్థాయికి హీరోయిన్ కాళ్లు, తొడల రేంజ్‌కి అనంత శ్రీరాం దిగజారలేదు… అక్కడికి సంతోషం… సిరివెన్నెల అల్టిమేట్ పతనం… అయితే ఈ తాజా రి రి రి పాటలో పదాలు, చరణాలు శ్రీరాంకు అపకీర్తికిరీటాలు… చంద్రుడికి సోదరి కూడా ఉందట, కవి హృదయమా శ్రీరాం..? మరి అదేంటో ప్రాస పురిటినొప్పులు పడకుండానే మంచి పదునైన… సారీ, సారీ, మత్తెక్కించే రొమాంటిక్ పాట ఏదో తగలెట్టొచ్చు కదా… మరీ చిన్న పోరగాళ్లు రాసుకునే కవితల్లాగా ఈ రాతలేమిటి..? నీ మంత్రసానితనం ఏమిటి..? అవునూ, నన్నారి అంటే..? ఓహో, షర్బత్ అనే అర్థంలో రాశావా..? వోకే, వోకే… రి అనే అక్షరంతో ఏయే పదాలు వస్తాయో ఓసారి డిక్షనరీలో చూసి, రాసుకుని, మధ్యమధ్యలో ఇంకొన్ని పదాలు ఇరికిస్తే అది పాటా..? మరీ తెలుగు ప్రేక్షకులంటే పిచ్చెదవల్లాగా కనిపిస్తున్నారబ్బా నీకు, మీ దర్శకుడు కొరటాల శివో, సుందరమో, సత్యమో… తనకు ఓ టేస్ట్ అంటూ ఉండి చస్తే కదా…!! ఆ సంగీత దర్శకుడు, సినిమా దర్శకుడు దొందూ దొందే…!! నీకు భలే బకరాలు దొరికారు…!!!
Share this Article