అశ్విని… నరిక్కువర కులానికి చెందిన మహిళ… తమిళనాడులోని మామళ్లాపురం… అక్కడ స్థలశయన పెరుమాల్ గుడి ఉంది… రాష్ట్రమంతా దాదాపు 750 గుళ్లలో ఉచితంగా అన్నదానం చేస్తున్నట్టే అక్కడ కూడా చేస్తుంటారు… కానీ అశ్వినికి ఆ దానాన్ని నిరాకరించారు… కారణం, ఆమె కులం… ఊళ్లు తిరుగుతూ పూసల దండలు గట్రా అమ్ముకుని బతికే నరిక్కువర కులం ఎస్సీ కాదు, ఎస్టీ కాదు… బీసీ కూడా కాదు… ఎంబీసీ… మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాస్… (ఇదుగో ఇలాంటివే హైందవ ధర్మం స్వీయప్రక్షాళనకు, సంస్కరణలకు అడ్డం…) ఐనా ఆ గుడి పెద్దల అతి మూర్ఖత్వం కాకపోతే, ఆకలితో ఉన్నవాడికి కడుపు చూసి ముద్దపెట్టాలా..? కులం చూసి కడుపు నింపాలా…? ఆమె అక్కడి వివక్షపై, అన్నదానం-గుడి నిర్వాహకులతో గొడవ పడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి ఎమ్మెల్యే, హిందూ సంస్థల మంత్రితో మాట్లాడాడు… విషయం సీఎం దాకా చేరింది… స్టాలిన్ వెంటనే ఆమె ఇంటికి బయల్దేరాడు… ఇదుగో ఇక్కడే స్టాలిన్ రాజకీయ పరిణతి పట్ల చప్పట్లు కొట్టాలనిపించేది…
ఆమె ఇంటికి వెళ్లాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు… పెద్ద అధికారిక హంగామా ఏమీ లేదు… ఆమెతోపాటు అక్కడే ఉన్న మరికొందరికి ప్లస్ ఇరులార్ కుటుంబాలకు కూడా ప్రయోజనం కలిగే కొన్ని అభివృద్ధి పథకాల్ని ప్రకటించాడు… ఎంతోకాలంగా పెండింగులో ఉన్న రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలు, ముద్ర రుణాలు, వృద్ధ్యాప్య పెన్షన్లు, వోటర్ గుర్తింపు కార్డులు, ఎంబీసీ సర్టిఫికెట్లు అక్కడికక్కడ ఇప్పించాడు… చూడటానికి ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు… కానీ పెద్ద విషయమే… ఎందుకంటే..?
Ads
పాలకుడు జనంలో ఉండాలి… జనంతో ఉండాలి… నిజమైన, ఫలించే స్పందనో కాదో జానేదేవ్, జనానికి అలా కనిపించాలి… రాజు గారి తక్షణ స్పందన అనేది వెనకబడిన, అణగారిన వర్గాల్లో ఓరకమైన ధీమాను కలిగిస్తుంది… పాలన, రాజకీయాలు పార్ట్ టైం వ్యాపకాలు కావు… సంపూర్ణంగా దృష్టి పెట్టాల్సిందే… కొందరు ఉంటారులే, రోజుల తరబడీ ప్రజలకు అస్సలు కనిపించనే కనిపించరు… దర్బారుకు పోరు.., పొలమింట్లో అజ్ఞాతం.., కొందరికి షూటింగుల మధ్యలో విరామరాజకీయం.., కొందరికి వ్యాపార భేటీల నడుమ బ్రేక్ పాలిటిక్స్… ఎన్నికలప్పుడే నిర్విరామ ప్రసంగాలు, సభలు… కొందరికి ప్రెస్ మీట్లంటే భయం… హేమిటో, మన రోజులిలా ఉన్నయ్…
ముఖ్యమంత్రి దృష్టికి చిన్న చిన్న విషయాలూ వెళ్తున్నాయి, గమనిస్తున్నాడు, స్పందిస్తున్నాడు అనే సమాచారం పాలన యంత్రాంగాన్ని కూడా అలర్ట్గా ఉంచుతుంది… ఒక్క అశ్విని ఇంటికి వెళ్లడం ప్రచారానికి, రాజకీయ లబ్ధికి కాదు ప్రయోజనకరం… అలా సొసైటీలో వివక్షకు గురవుతున్న లక్షల కుటుంబాలకు ఓ భరోసా ఇస్తుంది… మామూలు వివక్ష మాత్రమే కాదు, కొన్ని తెగల మీద వివక్ష మరింత క్రూరం… జైభీమ్ సినిమా అప్పటి బ్రిటిష్ కాలం నాటి ఓ దుర్మార్గమైన చట్టాన్ని, వాటి అవశేషాల్ని, ఫలితాల్ని, కొనసాగుతున్న వాసనల్ని బలంగా చర్చలోకి తీసుకొచ్చింది… అదే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్-1871… కొన్ని ఆదివాసీ జాతుల ప్రజల్ని వాళ్ల పుట్టుకతోనే నేరస్థులుగా గుర్తించే అమానవీయ చట్టం… ఆ జాతుల్లో ఒకటి ఇరులార్…
మొన్నటి జైభీమ్ సినిమా ఆ ఇరులార్ జాతి గురించి చెబుతుంది… అలాంటిదే నరిక్కువర కూడా… మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వివక్షకు గురయ్యే కొన్ని కులాలున్నయ్… ఎస్సీ, ఎస్టీలు, బీసీలతో పాటు ఎంబీసీలకు జరిగే అన్యాయం కూడా బలమైన చర్చకు రావల్సిన అవసరముంది… కానీ మన రాష్ట్రాల్లో పెద్దగా ఓ డెమొక్రటిక్ సోయి లేదు… ఇంతకీ ఇంటికొచ్చిన రాజు గారికి ఆ అశ్విని ఏమిచ్చింది..? తను అమ్ముకునే పూసల దండల్లోనే కాస్త మెరుగైనది తీసి సమర్పించుకుంది, శాలువా కప్పి దండం పెట్టింది… కుచేల, అంతకుమించి ఏమివ్వగలదు..? తరువాత మంత్రితో, ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి, అదే గుళ్లలో ఒకే పంక్తిలో కూర్చుని అన్నదానం స్వీకరించింది…!!
Share this Article