‘‘వడ్లను కొనేది రాష్ట్రం… బియ్యం కొనేది ఎఫ్సీఐ, ప్రజాపంపిణీ ద్వారా పంచేది కేంద్రం… మరి కేంద్రమే బియ్యం తీసుకోకపోతే రాష్ట్రం ఏం చేయాలి..? వడ్లను కొని రాష్ట్రం ఏం చేసుకోవాలి..? వాటిని కొనేదెవరు..? వాడేదెవరు..? ఎగుమతి చేసేదెవరు..?’’ అని నమస్తే తెలంగాణ కేంద్రం మీద విరుచుకుపడ్డది… అంటే టీఆర్ఎస్ అధికారిక వాదన… యాసంగి వడ్లను నేనయితే కొనేది లేదుపో, మీ ఖర్మ అని తేల్చిచెప్పేసినట్టు..! వ్యవసాయ మంత్రి అయితే కేంద్రం- ఉమ్మడి జాబితా విధుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్రానిదే అంటున్నాడు… ఇంకా ఏడేండ్లయినా కాలేదు అప్పుడే తెలంగాణ రైతు మీద కేంద్రానికి కన్నుకుట్టింది అంటూ పేజీల కొద్దీ ‘ఎమోషనల్ వితండ వాదనల్ని’ పరిచేసి, టీఆర్ఎస్ అసమర్థతను, అస్తవ్యస్త పాలనవిధానాలను కేంద్రంపైకి నెట్టేయడానికి ప్రయత్నించింది… అంతేకాదు, విచిత్రంగా ఈ విషయంలో ఏ లెవల్ యుద్ధానికైనా పోతదని కూడా చెప్పింది… ప్చ్, ఇదేమాట కేసీయార్ నోటివెంట వస్తే ఎంత బాగుండు..? అంటాడా..? అనగలడా..?
విషయానికి వద్దాం… వడ్లను కొనేది రాష్ట్రం అట, ఆ బియ్యాన్ని ఎఫ్సీఐ కొంటే, కేంద్రం రేషన్ సిస్టంలో పంచేస్తదట… ఏం రాతలు ఇవి..? నిజానికి గతంలో పద్ధతి ఏమిటి..? మార్కెట్ యార్డులు, అడితీదారులు, కళ్లాల్లోనే కొనుగోళ్లు, మిల్లుల వద్దకూ వడ్ల బళ్లు… మిల్లులు తాము వర్క్ చేసుకుని, డిమాండ్ ఉన్న దగ్గరకు బియ్యాన్ని పంపించి అమ్ముకునేవాళ్లు… అదంతా ఒక సిస్టం… మన ఆహారభద్రతకు అవసరమైనంత మాత్రమే ఎఫ్సీఐ కొనుగోలు చేసేది, ఆ లెవీకి ప్రతిఫలంగా పర్మిట్లు ఇచ్చేవాళ్లు… ఇప్పుడదంతా పోయింది, పంటను ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు… ఇక రాష్ట్రం మొక్కజొన్న, వరి కొనుగోళ్లను తన చేతుల్లోకి తీసుకుంది, ఎలాగూ ఎఫ్సీఐ ఉంది కదాని ఎడాపెడా కొనడం, ధాన్యాన్ని మిల్లుల్లో వర్క్ చేయించి, బియ్యాన్ని ఎఫ్సీఐకి పంపించేయడం… (అసలు మిల్లులకు ఎంత ధాన్యం ఇచ్చారు, ఎంత తిరిగి వచ్చింది, వాటిల్లో అక్రమాల స్థాయి ఏమిటి అనేది మరో పెద్ద విషాదపర్వం)… మొత్తంగా ధాన్యం క్రయవిక్రయాల సిస్టమే రాష్ట్రంలో దెబ్బతినిపోయింది… ఎఫ్సీఐ గోదాముల్లో ఇప్పుడు నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నయ్… టీఆర్ఎస్ భాషలోనే అడగాలటే… మరి ఎఫ్సీఐ బియ్యం కొని కేంద్రం ఏం చేసుకోవాలి..? వాటిని కొనేదెవరు..? మొక్కజొన్నల అస్తవ్యస్త క్రయవిక్రయాలతో నష్టాలు నషాళానికి అంటాయి, దాంతో అది బంద్… ఇప్పుడు వరి బంద్… హేమిటో… అవునూ, వానాకాలం వరి కొనుగోళ్లు చేస్తాం, ఇబ్బంది లేదు అంటున్నారు కదా, మరి ఈ టోకెన్లు ఏంది..? వాటికీ పరిమితులు ఏంది..? కిలోమీటర్ల కొద్దీ బండ్లు క్యూ కట్టడం ఏంది..? ధాన్యం కుప్పల మీదే రైతు ప్రాణాలు కోల్పోవడం ఏమిటి..?,
Ads
ఏడేండ్లయినా కాలేదు, అప్పుడే కన్నుకుట్టిందా, మన రైతులపై కేంద్రం కక్ష దేనికి అని ఓ సగటు గల్లీ లీడర్ భాషలో అడుగుతోంది నమస్తే తెలంగాణ… ఓ పదేండ్లు దాటక కన్నుకుడితే అర్థం చేసుకోవచ్చు గానీ, ఇంత త్వరగా కన్నుకుడితే ఎలా అన్నట్టుగా ఉంది… ఏం..? తెలంగాణ దేశంలో భాగం కాదా..? తెలంగాణ మీద ఈర్ష్య ఉండాల్సిన అవసరం కేంద్రానికి ఏముంది..? అక్కడ బీజేపీ వాళ్లే కాదు, అన్ని పార్టీల ఎంపీలూ ఉన్నారు… టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు కదా… ఒక్కరైనా ఈరోజుకు నోరు విప్పారా..? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనేది కాదిక్కడ… అసలు కేంద్రం అంటే పరాయిది, మనది కాదు అనే ద్వేషభావనను వ్యాప్తి చేయడం ఏమిటి..? ఒక అధికార పార్టీ పత్రిక రాతల్లో ఈ పరిణతి లేకపోవడం పాత్రికేయ విషాదం… పోనీ, ప్రధాని మోడీ స్థానంలో కేసీయార్ ఉంటే ఎఫ్సీఐ అధిక నిల్వల విషయంలో ఏం చేసేవాడు..? పోనీ, ఇప్పుడు కేంద్రం ఏం చేయవచ్చు..? మంత్రిగారు ఉమ్మడి జాబితా విధుల్లో కేంద్రం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రం బాధ్యతే అంటున్నాడు… అయ్యా, కొనుగోళ్ల సంక్షోభం ఉన్నప్పుడే మద్దతు ధర కల్పన కోసం కేంద్రం కలగజేసుకోవాలా..? లేక మొత్తం పండిన పంటలన్నీ కేంద్రమే కొనాలా..? మరి వరి మాత్రమే ఎందుకు..? మిగతావి కూడా కొనాలి కదా… ఎందుకు కొనడం లేదంటారు..? కేంద్రానిదే బాధ్యత అయ్యే పక్షంలో మధ్యలో ఇన్నాళ్లు మీరెందుకు కొన్నట్టు..?
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల మీద కాసింత అవగాహన ఉన్నవాళ్లకైనా నవ్వొచ్చే వార్త… ఇక కేంద్రంతో టీఆర్ఎస్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైందట… కేసీయార్ సార్, ప్లీజ్… ఒక్కసారి ఢిల్లీలో బైఠాయించండి సార్… స్థూలంగా రైతుకు ఈ సర్కారు వ్యవసాయ విధానం ఓ గుదిబండ… మక్కలు వేస్తే మర్యాద దక్కదు అంటారు ఓసారి… వరి వేస్తే ఉరే అంటుంది ఇంకోసారి… పత్తి వేసుకొండి అంటాడు మంత్రి… అది మరీ ప్రమాదకరమైన ధోరణి… పత్తి అంటేనే రిస్క్, ధర ఉంటే వోకే, లేదంటే రైతుల ప్రాణాలూ తీసేదీ అదే… ఇప్పుడు ధర ఉంది సరే, మరి రేప్పొద్దున ధరలు కొలాప్స్ అయిపోతే పండిన పత్తిని ఎవరు కొనాలి..? అబ్బే, అది కేంద్రం బాధ్యత, సీసీఐ కొనాలి అని మళ్లీ కేంద్రం వైపు, బీజేపీ వైపు వేళ్లు చూపిస్తూ తిట్టిపోసి తప్పించుకుంటే సరిపోతుందా..? అసలు పెసర్లు, మినుములు, శెనిగెలు, కందులు, పల్లీ, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటల వైపు రైతుల్ని మళ్లించగలిగే ఓ ఆలోచన, ఓ ప్రణాళిక ఇన్నేళ్లలో ఎప్పుడైనా చేశారా..? అదనపు మద్దతు ధర ఏమైనా ప్రకటించారా..? కేంద్రానికి బుద్ధి లేదు, రైట్… మరి వెల్లువెత్తుతున్న ధాన్యాన్ని ఎలా ఎగుమతి చేయొచ్చో, ఏ దేశాల్లో ఏం అవకాశాలున్నాయో ఏమైనా స్టడీ చేశారా..? ఒక్కరైనా అవసరమైన రీతిలో అడుగులు వేశారా..? రైతులకు సంబంధించి ఈ సర్కారు అలక్ష్యం మీద చెబుతూ పోతే ఒడవదు, తెగదు… అన్నట్టు… ఒక బండి సంజయ్, ఒక మాజీ పీసీసీ ఉత్తమ్‌కుమార్ తదితరుల అపరిపక్వ, రాజకీయ ప్రకటనల గురించి ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు…!
Share this Article