లక్షన్నర కోట్ల రూపాయల నిధి దొరికితే… ఆహా, ఇంకేముంది..? స్వర్గం కట్టుకుంటా, విలాసాల్లో మునిగితేలుతా అని కలల్లోనే మస్తు ప్లాన్ చేసుకుంటారు చాలామంది… అఫ్‌కోర్స్, అంతెందుకు సార్, ఒక శాతం దొరికినా పండుగే అనే అల్ప సంతోషులు ఉంటారు, అవేం సరిపోతయ్ సార్, ఓ పది లక్షల కోట్లయినా లేకపోతే ఎలాన్ మస్క్‌ను, బిల్ గేట్స్‌ను కొట్టేయలేం అనే అపరిమిత సంతోషులు కూడా ఉంటారు… అంబానీకో, ఆదానీకో ఇస్తే అయిదారేళ్లలోనే ఆ సొమ్మును నిజంగానే మరో పది లక్షల కోట్లకు పెంచేస్తరేమో కూడా…! ఏముందిలే బాసూ, ఓబుళాపురంలో జనార్దనుడు తవ్వుకున్నది ఏం తక్కువ అని ఇట్టే తేల్చేసే నిజవాదులూ, మన నాయకుల్లో కొందరు పోగేసిన సొమ్ము అంతకు ఎక్కువే కదా అని కస్సుమనేవాళ్లూ ఉంటారు…
అసలు లంకెబిందెలు ఎప్పుడూ మనల్ని ఆకర్షించే వస్తువులే… దొరికితే బాగుండు అని బొచ్చెడు కలలు కూడా… ఎక్కడెక్కడో దాచబడిన ఖజానాల కోసం ప్రపంచవ్యాప్తంగా వేట సాగుతూనే ఉంటుంది… ట్రెజర్ హంట్ ఎప్పుడూ సాహిత్యంలో ప్రధానపాత్రే… థ్రిల్, డేర్, రిస్క్, ఛాలెంజెస్‌తోపాటు నిధి దొరికాక చంపుకోవడాలు, వేటకు ముందు మాయలు, మంత్రాలు, కుట్రలు… ఓహ్… మన గుళ్ల మీద వందలేళ్లుగా సాగుతున్న దాడులూ ఈ నిధుల కోసమే కదా… అసలు ఇప్పటివరకూ ప్రపంచంలో బయటపడిన అతి పెద్ద నిధి ఎంత..? ఎవరూ సరిగ్గా చెప్పలేరు… కానీ లక్షన్నర కోట్ల నిధి మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది… అది ఫిన్‌లాండ్‌లో ఉందని ప్రచారం…
Ads
ప్రచారమే కాదు, 34 సంవత్సరాలుగా ఆ నిధి కోసం ప్రపంచవ్యాప్త నిధి తవ్వకనిపుణులు ప్రయత్నిస్తూనే ఉన్నారు… టెంపుల్ టెల్వ్ టీం అంటారు ఆ బృందాన్ని… ఇందులో రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా, స్వీడన్, నార్వే, జర్మనీ, నెదర్లాండ్స్ దేశస్తులూ ఉన్నారు… ఇదొక నిరంతర యజ్ఞం… అసలు ఆ నిధి అక్కడికెలా చేరింది, ఎవరు దాచారు అనే విషయంలో బోలెడన్ని కథలున్నయ్… మరి ఈ లక్షన్నర కోట్ల వరకూ విలువ ఉండొచ్చు అని ఎవరు అంచనా వేశారు, ఎలా వేశారు అనేదీ ఎవరూ చెప్పలేరు… తాజా అంచనా మాత్రం 20 బిలియన్ డాలర్లు…
వజ్రాలు, వైడూర్యాలు, నాణేలు, నిలువెత్తు బంగారు విగ్రహాలు, పురావస్తు విలువన్న అనేక వస్తువులు… దేనికెంత విలువ అని జర్నలిస్టులు, ట్రెజర్ నిపుణులు, సాహిత్యకారులు లెక్కలు వేస్తూనే ఉంటారు… ఈ నిధి కోసం తవ్వకాలు, ప్రయత్నాలు సాగిస్తున్న సిబోస్‌బర్గ్ గుహల శ్రేణి దగ్గరే 34 ఏళ్లుగా క్యాంపు నడుస్తోంది… చలికాలం రాగానే ఆ గుహల్లోని నీరంతా గడ్డకట్టుకుపోతుంది… మరి ఇప్పుడెందుకు మళ్లీ వార్తల్లోకి వచ్చిందీ అంటే, ఇక ఈ ప్రయత్నం ఫలించే రోజును సమీపిస్తున్నాం అంటోంది ఆ టీం… అందుకే అందరి దృష్టీ దానిపై మళ్లింది… ఈ వార్తలో ఠక్కున పట్టేసే వాక్యాలు కొన్ని ఉన్నయ్… ఏంటంటే..? అన్వేషణ మొదలైన కొత్తలో ఈ టీంలో 24 మంది ఉండేవాళ్లు… అందులో ఇద్దరు మాత్రమే ఇప్పుడు బతికి ఉన్నారు… కొందరు మరణించారు, మరికొందరు తవ్వకాల్ని విరమించుకుని వాపస్ వెళ్లిపోయారు..!! అవునూ, నిధి దొరికిందే అనుకుందాం, నేను ఓనర్ని అని చెప్పుకునే వారసులకు ఎంత..? ప్రభుత్వానికి ఎంత..? తవ్వకాల ఖర్చులు పోనూ మిగిలేదెంత..? అసలు ఇప్పుడు ఈ ఖర్చు ఎవరు భరిస్తున్నారు..? ఇవన్నీ మరో పెద్ద కథ…!
Share this Article