రాస్తే రాశావులే గానీ, మరీ నువ్వు రాసినంత దరిద్రంగా ఏమీలేవు మన తెలుగు టీవీ సీరియళ్లు… అందులో సరుకు, దమ్ము లేనిదే కోట్ల మంది ఆడ లేడీస్, ఒక్కొక్క సీరియల్‌ను ఏళ్లుగా చూస్తారా..? మరీ ఈ వెటకారపు విమర్శలు దేనికి అని ఒకాయన బాగా ప్రేమగా మందలించాడు… ఒక సీరియల్ సజెస్ట్ చేశాడు… సరే, ఏదయితే అదయిందీ… కలకాలం బతకడానికి ఏమీ రాలేదు కదా.., ఇదేమైనా కరోనా వైరసా ఏం..? ఇన్నికోట్ల మంది లేడీస్‌కు ఏమీ కానిది మనకేం అవుతుందిలే అనే ఓ మొండి ధైర్యంతో… ప్రేమ ఎంత మధురం అనే ఆ సీరియల్ ఒక ఎపిసోడ్ చూచితిని…
వామ్మో… కామన్ సెన్స్ అనే పదానికి సదరు సీరియల్ నిర్మాత, దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్ కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు కనిపించింది… ఠారెత్తిపోయితిని… అడ్డంగా బుక్కయిపోయిన ఫీలింగు… కాకపోతే సీరియల్ నన్ను బతికించినది ఎక్కడయ్యా అంటే..? భలే నవ్వు తెప్పించిన ఓ అధ్యాయం… నిజంగా ఇది చూస్తే మావోయిస్టులు… టెర్రరిస్టులు గట్రా… వెంటనే సదరు సీరియల్ స్క్రిప్టు రైటర్‌ను తమ గ్రూపుల్లో చేర్చేసుకోవడం ఉత్తమం… అంత క్రియేటివ్ టెర్రిఫిక్ రైటర్…
Ads
మావోయిస్టులు గతంలో బూబీ ట్రాప్స్ వంటివి తయారు చేశారు… అంటే తగలగానే, పట్టుకోగానే పేల్చేసే బాంబులు అన్నమాట… టెర్రరిస్టులేమో ఓపెన్ చేయగానే పేలే సూట్‌కేసు బాంబులు, టిఫిన్ బాంబులు… స్టార్ట్ చేయగానే పేలే కారు బాంబులు గట్రా తయారు చేశారు గానీ… ఈ సీరియల్లో విలనుడు ఏకంగా పిసుకుడు బాంబులు… అనగా ప్రెస్ బాంబులు తయారు చేస్తాడు… ఇక్కడ ప్రెస్ అంటే మీడియా కాదు… స్మైలీ బాల్స్… అందులో బాంబులు ఫిట్ చేస్తాడు… జస్ట్, ప్రెజర్ తగ్గించుకోవడానికి వాటిని పిసుకుతూ ఉంటారుగా… సేమ్, అలా గట్టిగా పిసకగానే అవి పేలిపోతాయట…
ఇంకా నయం… ఏ యూట్యూబ్ వీడియోనో చూసేసి, బాంబు తయారీ సర్క్యూట్లు, పేలుడు పదార్థాల తయారీని కూడా నేర్పించలేదు… సంతోషం… అయితే ఆ పిసుకుడు బాంబులు అనే కాన్సెప్టు మాత్రం నవ్వు తెప్పించి, సదరు సీరియల్ చూస్తుంటే మెదడు పేలిపోకుండా కాపాడింది…
అవునూ… పిసుకుడు బాల్స్ ఎవడో స్వామి ఇస్తే తీసుకుపోయి అందరికీ ఇచ్చేసి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాడుకొండి అని చెబుతారు ఎవరైనా… అంతేతప్ప అందరినీ పిలిచి గ్రూపు ఫోటోకు నిలబెట్టినట్టు నిలబెట్టి… అందరమూ ఒకేసారి పిసుకుదాం అని ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తారా..? అసలే దుష్ట విలనుడు జైలు నుంచి విడుదలయ్యాక హీరోకు థ్రెట్ ఉంటుంది, నాలుగు రోజులు బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేస్తాడు హీరో దోస్త్… మరి అంత థ్రెట్ ఉన్నప్పుడు… అంత పెద్ద ఆఫీసులో కనీసం డిటెక్టర్ ఏర్పాటు చేసుకోలేదా..?
విలనుడు హోల్ మొత్తంగా హీరో ఆఫీసు పేలిపోయేలా, అందరూ చచ్చిపోయేలా ప్లాన్ చేస్తాడు… దీనికి హీరో తమ్ముడు, ఓ నల్కా కేరక్టర్‌ను వాడతాడు… సరే, చివరి క్షణంలో హీరో పసిగట్టి ఆపేస్తాడు… ఇదంతా వోకే… కానీ అదే ఆఫీసులే అదే విలనుడు నీల్ అనే తన మేనల్లుడిని కోవర్టుగా చేర్పిస్తాడు అంతకుముందే… మరి ఆఫీసు మొత్తం పేలిపోయి, ఈ నీల్ కూడా చచ్చిపోతాడు కదా… ఈ బుర్ర ఎక్కువ విలనుడు ఈమాత్రం ఆలోచించలేదా..? మరీ టీవీ సీరియల్ రైటర్ల బుర్రేనా తనది కూడా..?
ఈ నీల్ అనేవాడు నిజానికి మీరా అనబడే ఓ కంపెనీ ఎగ్జిక్యూటివ్ హీరో ప్రియురాలిపై వదిలిన మగాస్త్రం కూడా… ఆఫీసులో ఇంత రచ్చ అవుతుంటే, వాడికేమీ తెలియదు… తనేమో ఓ గిటార్ పట్టుకుని హీరోయిన్ ఇంటికి వెళ్లి, ఏదో క్షుద్ర ఆలోచనల్లో ఉంటాడు… అక్కడ హీరో పెట్టించిన సెక్యూరిటీ చూసి హాశ్చర్యపోతాడు… మా బిడ్డ పనిచేసే కంపెనీలో వాళ్లకు ఇలా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అని చెబుతుంది హీరోయిన్ తల్లి… ఓహో, అని మళ్లీ హాశ్చర్యపోతాడు ఈ నీల్ అనబడే మగబాణం… మరి వాడు కూడా అదే కంపెనీ కదా… తనకు తెలిసే ఉండాలి కదా… వాడిది ఇంకేదో కంపెనీ అయినట్టుగా చెబుతున్నదేం హీరోయిన్ తల్లి..? చెబుతూ పోతే ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే బోలెడన్ని తూట్లు, బొక్కలు… అవును, సీరియల్ అంతా మాంసం లేని ఉత్త బొక్కలు…!!
Share this Article