ప్రైవేటు వాణిజ్య ప్రకటనల్లో నటించే నటీనటులకు సామాజిక బాధ్యత ఉండాలి… అబ్బే, డబ్బు కోసం మేం ఏ ప్రకటనైనా సరే నటించేస్తామంటే కుదరదు… వివాదాస్పద ప్రకటనల్లో నటించే నటులు కూడా లీగల్ కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది… ఉదాహరణకు ఒక గుట్కా బ్రాండ్ ప్రమోషన్ యాడ్‌లో నటించి, తరువాత సోషల్ మీడియాలో పలువురి ప్రశ్నలకు పెడసరంగా ‘డబ్బు తీసుకున్నా, నటిస్తా’ అని జవాబులు ఇచ్చి, తరువాత తప్పు తెలుసుకుని, లెంపలేసుకుని, యాడ్ నుంచి విత్ డ్రా అయిపోయి, ఆ ప్రకటనకర్తలకు తన రెమ్యునరేషన్ వాపస్ ఇచ్చిన వార్త రీసెంటుగా చదివాం… ‘సరొగేట్ అడ్వర్టయిజింగ్’… అంటే నిషిద్ధ ఉత్పత్తుల బ్రాండ్లను పరోక్షంగా ప్రమోట్ చేయడం… కానీ అలాంటి యాడ్స్‌లోనే మహేష్ బాబు ఈరోజుకూ నటిస్తూనే ఉన్నాడు… ప్రజల్ని తప్పుదోవ పట్టించే యాడ్స్‌కు సంబంధించి, మేం కేవలం నటీనటులం అని చేతులు దులుపుకుంటే సరిపోదు… ‘‘బాధ్యత వహించాల్సి ఉంటుంది…’’ ఫెయిర్‌నెస్ క్రీముల ప్రకటనల్లో నటించిన తారలూ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నట్టు కొన్ని వార్తలు చదివాం కూడా… అసలు ఇప్పుడు విషయం ఏమిటంటే… తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్‌కు టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపించింది అనేది వార్త…
ఎందుకంటే..? ర్యాపిడో అనబడే ఓ మోటార్ సైకిల్ టాక్సీ సర్వీస్ సంస్థ (ఊబర్, ఓలా వంటి సంస్థ) ప్రకటన… అందులో దోసెలు వేస్తున్న బన్నీ ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే ఖైమా చేసి మసాలా దోసె చేసేస్తారంటూ వ్యాఖ్యానించడం వివాదం… నిజానికి ఇది బాధ్యతారహితమైన ప్రకటన… సదరు ప్రైవేటు సంస్థ తన గురించి గొప్పలు చెప్పుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు… కానీ ప్రజారవాణాను తేలిక చేయడం, ఒకరకంగా కించపరచడం దారుణం… అసలు ప్రజారవాణా లేకపోతే ప్రైవేటు సర్వీసులు ప్రజల జేబుల్ని గుల్లగుల్ల చేసి ఉండేవి… పైగా మారుమూల పల్లెలకు సర్వీస్ సరేసరి… గిరాకీ లేని రూట్లకు ఈ ప్రైవేటు సర్వీసులు వెళ్తాయా..? పైగా ఈ ర్యాపిడో అనేది జస్ట్, నగరంలో ఉన్న బైక్ సర్వీస్ మాత్రమే… అసలు దీనికీ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఆర్టీసీ బస్సులకు (ప్రకటనలో వీరవాసరం సర్వీస్) లింక్ ఏమిటి..? ప్రకటనకర్తలది బాధ్యతారాహిత్యమే కాదు, ప్రజాప్రయోజన వ్యతిరేకం కూడా…
Ads
https://www.youtube.com/watch?v=UCGi5XOq33c
అయితే ఈ ప్రకటనలో నటించడానికి, డబ్బు తీసుకోవడానికి ముందు ఇంతగా ఆలోచించి ఉండడు బన్నీ… తన డాడీ మీద జనాభిప్రాయం ఎలా ఉన్నా సరే, బన్నీ పట్ల ప్రేక్షకుల్లో సదభిప్రాయమే ఉంటుంది… ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను దెబ్బతీసేలా నటించకుండా ఉండాల్సింది… ఇప్పుడు తను ఎలా స్పందిస్తాడో తెలియదు గానీ… తెలంగాణ ఆర్టీసీ ఎందుకింత వేగంగా స్పందించిందనేదీ ఆశ్చర్యమే… యాడ్‌లో కనిపించేది ఏపీ ఆర్టీసీ బస్సు, నెంబర్ ప్లేటు కూడా అలాగే ఉంది… అఫ్‌కోర్స్, బన్నీ ప్రకటన ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది కాబట్టి టీఎస్ఆర్టీసీ స్పందించడంలో తప్పేమీ కనిపించడం లేదు… ఏమాటకామాట… సదరు వాణిజ్య ప్రకటన రూపకర్తలు ఎవరో గానీ…. పరమ నాసిరకంగా ఉంది యాడ్… మరీ ఇలాంటి చిచోరా యాడ్స్‌లో నటించడానికి బన్నీ ఎలా ఒప్పుకున్నాడు అసలు..? హేమిటో ఇది…!!
Share this Article