ఈమధ్యే సోషల్ మీడియాలో అలనాటి అన్నగారి ఆటగాడు అనే అద్భుతమైన సినిమాకు సంబంధించి ఏదో ఒక ఆక్రోశపూరితమైన భీకర పోస్టు చదవబడితిని… అప్పుడంతగా పట్టలేదు గానీ, ఓ మిత్రద్రోహి కుట్రపూరితంగా, కక్షతో ఓ పాటను పంపించి వెక్కిరించెను… ‘‘ఈమధ్య కొన్ని పాటల్లో సాహిత్యం, విలువలు, ప్రమాణాలు, తొక్కాతోలూ అని రాసి ఉంటివి కదా, ఈ పాట చూసి తరించుము, ఈసారి ఏదైనా సినిమా పాట గురించి రాసి, లిటరరీ వాల్యూస్ అన్నావనుకో మర్యాద దక్కదు’’ అని కూడా మర్యాదగా, ఒక పద్ధతిలో బెదిరించి ఉండెను… మామూలుగా తిడితే మనం బేఫర్వాయే… కానీ మరీ నలభై ఏళ్లనాటి పాట పంపించి మరీ తిట్టిన తీరు మిక్కిలి అధిక్షేపణీయం అనిపించెను… అందువల్లచేత తీరా సదరు వీడియో చూస్తే చాలాసేపు బుర్ర మొద్దుబారిపోయింది… ఆశ్చర్యం, వైరాగ్యం, నవ్వు, ఏడుపు, జాలి, సానుభూతి వంటి నూటాయాభై రకాల ఉద్వేగాలు ఒక్కసారిగా చుట్టుముడితే మైండ్ బ్లాంకడమే కదా గతి..?! అసలే మనవి పిట్టబుర్రలు…
నిజం చెప్పవలెనన్న తెలుగు సినీసాహిత్యానికే మకుటాయమానం అనదగిన ఈ పాటను ఇన్నేళ్లుగా చూడకుండుటయే నా అసలు తప్పు అని తోచినది చివరకు… ఆకుచాటు పిందె, చల్లగా లేస్తోంది, గుగ్గుగుడిసెలు, వంగమాకు, పాయ్ పాయ్ గట్రా ఎన్టోవోడి ఖాతాలో బొచ్చెడు కళారత్నాలు ఉన్ననూ, ఇప్పుడు చెబుతున్న పాటదే నంబర్ వన్ స్థానమని అంగీకరించక తప్పింది కాదు… ఇహ, డబ్బాలో గులకరాళ్లు వేసి, ఇదే సంగీతమహో అని ఓ మోత మోగించింది చక్రవర్తి, ఈ అద్భుతమైన పాట రాసిందేమో వేటూరి… నిజానికి ఆయన మాత్రమే ఇలాంటి అణిముత్యాలు రాయగలరు… నెవ్వర్, ఇంకెవరికీ చేతకాదు… కాలేదు… అసలు ఎంత సుందరంగా స్టార్ట్ అవుతుందంటే పాట… యథాతథంగా కొన్ని పదాలు రాస్తున్నందుకు పాఠకులు క్షమించ ప్రార్థన… అసలు పాటలో శ్రీదేవి పిర్రల మీద గిచ్చుతూ, వీపు మీద గుద్దుతూ, నలిపేస్తూ, పడేస్తూ, కుమ్మేస్తూ పాపం ఆమెను అరిగోస పెడతాడు ఎన్టీవోడు… అఫ్ కోర్స్, తనతో డ్యూయెట్ అంటేనే హీరోయిన్లకు ఓ సింహస్వప్నం కదా… రాక్షస హింసప్రేమ… సరే, ఆ పాట ఎలా స్టార్టవుతుందంటే…
Ads
గుద్దుతా నీయవ్వ గుద్దుతా… ముక్కు మీద గుద్దుతా… మూతి మీద గుద్దుతా… గుద్దానంటే గూబ్ గుయ్యంటది… వేశానంటే వీపు సాఫవుతది…… మధ్యలో ఓసారి ఒసే గాడిద, కాలేదేమే చూడిద అని ఏదో అంటాడు… నీ మొహం ఇన్ని నెలలయింది, ఏం పీకావ్‌లే నీ బూడిద అన్నట్టుగా ఆమె ఏదో ఆడిపోసుకుంటుంది… ఆహా… ఈ చిత్ర నిర్మాత, దర్శకుడి జన్మలు ప్లస్ ఎస్పీ బాలు, సుశీలల జన్మలు కూడా ధన్యం… పొరపాటున వికీలో సినిమా వివరాల కోసం చూస్తే ప్రాణం హరీ అన్నంత పనైంది… ఇందులో చీమకుట్టిందా, జిల్ జిల్ జిలేబీ, నీచూపు, ఏకోనారాయణ వంటి అపూర్వ గీతాలు కూడా ఉన్నాయని తెలిసింది… అవెంత గగ్గోలు లేపునో అనే భయసందేహాందోళనలతో వాటి జోలికి పోవడానికి సాహసించలేదు… ఒకవేళ సున్నితమనస్కులు, గుండెజబ్బులు లేనివాళ్లు గనుక దూరంగా ఉంటానంటే… ఇదుగో ఇదీ ఆ అద్భుతమైన గీతరాజం లింక్… సంగీత రసజ్ఞులు, సాహితీప్రియులు గనుక చూడాలనుకుంటే… మీ ఇష్టం… తక్షణ జ్ఞానసిద్ధిరస్తు..!! అఖండ వైరాగ్యప్రాప్తిరస్తు…!!!
Share this Article