‘‘ఇద్దరు సీఎంలు కలిస్తే రాజకీయాలు చర్చకు రాకుండా ఎలా ఉంటయ్..?’’ అని అప్పట్లో ఎవరో సీఎం అన్నట్టు గుర్తు… అవును మరి, రాజకీయాల ప్రస్తావన రాకుండా ఉండదు… మరి జగన్, నవీన్ పట్నాయక్ నడుమ ఏ చర్చలు జరిగి ఉంటయ్..? అబ్బే, నో పాలిటిక్స్, ఓన్లీ ఇష్యూస్ అంటాయేమో ఏపీ ప్రభుత్వవర్గాలు… ఆ భేటీ సారాంశంపై ప్రభుత్వవర్గాలు మీడియాకు అందించిన సమాచారం కూడా అత్యంత గందరగోళం… నేరడి బ్యారేజీ, కొఠియా గ్రామాలు, జంఝావతి, పోలవరం ముంపు, బలిమెల-సీలేరు హైడల్ ప్రాజెక్టులు, గంజాయి నియంత్రణ, నక్సలైట్ల అణిచివేత తదితర చాలా ఇష్యూస్ ఇద్దరు సీఎంలు చర్చించినట్టు పేర్కొనడమే తప్ప సరైన వివరణ లేదు, వివరాలూ లేవు… ఒకసారి గుర్తు చేసుకొండి, మహారాష్ట్ర సీఎం దగ్గరికి తెలంగాణ సీఎం కేసీయార్ స్వయంగా వెళ్లాడు, వెళ్లడానికి ముందే రెండు రాష్ట్రాల టీంలు ప్రాణహిత ముంపు, ఎత్తుపై ఓ అమికబుల్ సొల్యూషన్ ప్రిపేర్ చేసిపెట్టాయి… ఇద్దరు సీఎంలు కలవగానే సంతకాలు చేశారు… కానీ జగన్, పట్నాయక్ భేటీలో ఇవేమీ లేవు… ఇద్దరు సీఎస్‌లతో ఓ జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారట, తరువాత మళ్లీ కలుద్దాం అని పట్నాయక్ చెప్పాడట… అసలు సీఎస్‌లు ఈ ఇష్యూస్‌పై కలిసి వర్క్ చేయొద్దని, సొల్యూషన్స్ వెతకొద్దని ఎవరంటారు..? వాళ్లు చేయాల్సిన పనే అది కదా…
రెండు రాష్ట్రాల నడుమ నిజానికి పోలవరం ముంపు పెద్ద ఇష్యూ, ఒడిశా లీగల్‌గా ఫైట్ చేస్తోంది… బహుధా నీటి విడుదల, నేరడి బ్యారేజీ, జంఝావతి ముంపులు చిన్నచిన్నవే… ఆ పరిహారం చెల్లింపు ఏపీకి పెద్ద సమస్యే కాదు… కానీ వాటిపైనా ఇద్దరు సీఎంల నడుమ ఏ ఒప్పందమూ సాధ్యం కాలేదు, రెండు రాష్ట్రాల టీంలు కలిసి కూర్చుని, ఏ ప్రతిపాదనలూ రెడీ చేయలేదు… గంజాయి సాగు, నక్సల్స్ ఇష్యూస్ ఎప్పుడూ ఉండేవే, డీజీపీల నడుమ సమన్వయం అవసరమే, ఉంటుంది కూడా… అవి సీఎంలు కూర్చుని మైన్యూట్ డిటెయిల్స్‌లోకి, డిస్కషన్స్‌లోకి వెళ్లేవేమీ కావు… బలిమెల-సీలేరు రిజర్వాయర్ల మీద కొత్త హైడల్ ప్రాజెక్టులు కడతారా, రివర్సబుల్ పంపులు పెడతారా..? అసలు ఎన్వోసీలు దేనికి..? తెలియదు..! ఇన్ని ఇష్యూస్‌లో ఇద్దరు సీఎంలు కలిసి చర్చిస్తే ఏ ఒక్క అంశం మీద కూడా తుది నిర్ణయం తేలలేదా..? ప్రభుత్వవర్గాలు ఏవేవో చెబుతాయి, మనం రాసుకోవాలి… ప్రజలు చదువుకోవాలి… అంతే…
Ads
జగన్, పట్నాయక్ ఇద్దరివీ వారస రాజకీయాలే… కానీ సొంతంగా ప్రూవ్ చేసుకున్నవారే… వ్యక్తిత్వాలు, నడవడికల్లో రెండు వేర్వేరు ధ్రువాలు… నవీన్ పట్నాయక్ నుంచి జగన్ నేర్చుకునేదేమీ ఉండదు, పట్నాయక్ నేర్పేదేమీ ఉండదు… కానీ ఇద్దరు కలిసినప్పుడు దేశరాజకీయాలేవో చర్చకు వచ్చి ఉంటయ్ కదా… ఉండాలి కదా… దేశంలో బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతోంది… ప్రత్యేకించి పెట్రో, గ్యాస్, నిత్యావసరాల ధరలు… ఉపఎన్నికల్లో పార్టీ భంగపాటు తెలిసిందే… మరోవైపు ప్రధానప్రతిపక్షంగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ ఓ యాంటీ-బీజేపీ బృహత్ వేదికను నిర్మించే స్థితిలో కనిపించడం లేదు… మమత వంటి నేతలు బీజేపీ బలపడటానికి కాంగ్రెస్‌నే నిందిస్తున్నారు… ఈ స్థితిలో దేశంలో విస్తృత యాంటీ-బీజేపీ, యాంటీ-కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు సాగుతున్నయ్… మమత కోసం, జగన్ కోసం పనిచేసే పీకే ఈ దిశలోనే దేశమంతా తిరుగుతున్నాడు… బీజేపీకి ఇప్పటికీ మింగుడుపడనివి తూర్పు రాష్ట్రాలు… ఎగువన బెంగాల్ నుంచి దిగువన తమిళనాడు మీదుగా కేరళ వరకు… మధ్యలో ఏపీ, తెలంగాణ, ఒడిశా…
ఇన్నాళ్లూ మమత ఔట్ రౌట్ బీజేపీ వ్యతిరేకి, బీజేపీ ఎడ్డెం అంటే మరోక్షణం కూడా ఆలోచించకుండా తెడ్డెం అనేస్తుంది… నవీన్ పట్నాయక్ ఇష్యూ బేస్డ్‌గా బీజేపీకి అవసరమైతే మద్దతు ఇస్తాడు, లేదంటే తిరస్కరిస్తాడు… కానీ ఏపీ, తెలంగాణ సీఎంలు వేరు… మొన్నమొన్నటిదాకా ఢిల్లీ పట్ల జీహుజూర్ అని మెదిలారు… కానీ ఏదో తేడా కనిపిస్తోంది… ఢిల్లీ రమ్మంటే ఆమధ్య జగన్ మడమ బెణికింది అంటూ ఎగ్గొట్టాడు… పెట్రో పన్నులపై బీజేపీ దొంగ మాటలపై జగన్ ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేశాడు… ఇటీవల గొంతువిప్పుతున్నారు ఆ పార్టీ నేతలు… ఇక కేసీయార్ అయితే అగ్గి ఫైరవుతున్నాడు… స్టాలిన్ కాంగ్రెస్ కూటమి మనిషి… కేరళలో విజయన్‌తో బీజేపీకి ఆగర్భ వైరమేనాయె… మరోవైపు రాజస్థాన్ బీజేపీ చేజారింది, మధ్యప్రదేశ్-కర్నాటకల్లో మేనేజ్డ్ బలమే… మహారాష్ట్రలోనూ పోయింది… ఈ స్థితిలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో నాన్-కాంగ్రెస్ యాంటీ-బీజేపీ కూటమి సాధ్యమేనా..? నవీన్ పట్నాయక్ ఎలాగూ ఒడిశాలో బీజేపీ నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నాడు… ఈ ప్రతిపాదిత ప్రాంతీయ పార్టీల కూటమి వైపు ఆహ్వానించే ప్రయత్నాలు, సంప్రదింపులు ఏమైనా సాగుతున్నాయా..? ఏమో, రాజకీయాల్లో దేన్నీ కొట్టేయలేం… అఫ్‌కోర్స్, ఇప్పుడప్పుడే ఓ అంచనాకు రావడమూ కష్టమే… అయితే రాజకీయాల్లో ఒక పుల్ల ఇటు నుంచి అటు కదిలితే దాని వెనుక ఓ కారణం ఉంటుంది… ఇద్దరు సీఎంలు కలిస్తే ఎందుకుండదు..?!
Share this Article