ప్రపంచంలోని ఏ తెగలోనూ బహుశా కనిపించదేమో… అత్యంత భిన్నమైన, అపురూపమైన ఓ మాతృత్వ సంస్కృతి… ఆ తెగ దాన్ని కాపాడుకుంటున్న తీరు..! అక్కడ ప్రతి మనిషికీ ఓ జన్మగీతం… పుట్టుపాట అనాలేమో…! నమ్మశక్యంగా లేదు కదూ… చదవండి ఓసారి… అది దక్షిణాఫ్రికా, నమీబియాలో హింబా అనే తెగ… ఓ పురాతన జాతి… తమ ఆచారాన్ని, ఆహార్యాన్ని, భాషను, కళల్ని, పండుగల్ని, ఆహారపుటలవాట్లను, నమ్మకాల్ని, దేవుళ్లను, సంస్కృతిని ఏళ్లకేళ్లుగా పదిలంగా రక్షించుకుంటున్నారు… వాళ్లు ఒంటికి పూసుకునే కొవ్వులు, రంగుల దగ్గర నుంచి వాళ్ల కేశాలంకరణ దాకా అన్నీ విశేషాలే… ఆ కేశాలంకరణ మీద వాళ్ల అభిరుచి ప్రపంచంలోని ఏ తెగలోనూ కనిపించదు… ఎనభయ్యవ దశకం వచ్చేసరికి దాదాపు అంతరించిపోయే స్థితి నుంచి మెల్లిమెల్లిగా మళ్లీ జనాభాను పెంచుకుంటూ, ఉనికిని కాపాడుకున్న తెగ అది… ప్రత్యేకించి చెప్పుకోదగిన ఓ విశేషం ఏమిటంటే… ఆ తెగలో ఓ కొత్త జీవి పుట్టుక తీరు గురించి… చావు దాకా కొనసాగే గుర్తింపుగీతం గురించి… పిల్లో, పిల్లాడో భూమ్మీద పడ్డప్పుడు కాదు… మగాడి వీర్యకణం ఆమె అండంతో సంగమించి ఫలదీకరణ పొందినప్పుడు కూడా కాదు… ఇంకా ముందు… ఆ తల్లికి తనకు ఓ బిడ్డ కావాలనే ఆలోచన పురుడు పోసుకున్న క్షణమే ఆ బిడ్డ పుట్టినట్టు…!
సంతానం కోసం ఆమె ఒకసారి నిర్ణయం తీసుకున్నాక… మానసికంగా సిద్ధమైపోయాక… తనొక్కతే ఓ చెట్టు కిందకు వెళ్తుంది.., విశ్రాంతిగా, నిశ్శబ్దంగా కూర్చుంటుంది, తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది… తనకు సరిపడా ఓ పాట కోసం కళ్లుమూసుకుని అన్వేషిస్తూ ఉంటుంది… తన హృదయానికి అనుసంధానమైపోయే ఆ పాట తట్టేవరకూ అంతే… ఒకసారి ఆ పాట ఖాయమయ్యాక, మననం చేసుకున్నాక, మనసులో ముద్రితమైపోయాక… అప్పుడు, ఆ బిడ్డ పుట్టుకకు అవసరమయ్యే మగమనిషి దగ్గరకు వెళ్తుంది… తనకు ఆ పాట వినిపిస్తుంది… సరే అనుకున్నాక సంగమం… ఓ బిడ్డ పుట్టుకకు ముందే అలా తనకు ఓ జన్మగీతం పుడుతుంది… అదే బిడ్డకు ఈ లోకంలోకి ఆహ్వానగీతం కూడా…
Ads
కడుపు పండుతుంది… ఊళ్లోని మంత్రసానులకు, పెద్ద వయస్సున్న మహిళలకు ఆ బిడ్డకు సంబంధించిన పాట ఏమిటో చెబుతుంది, వాళ్లకు గుర్తుండిపోతుంది… బిడ్డ పుట్టినప్పుడు ఆ పాట పాడుతూనే ఈలోకంలోకి ఆహ్వానిస్తారు వాళ్లు… బిడ్డ పెరుగుతూ ఉంటుంది… ఊళ్లో వాళ్లకు కూడా ఆ మనిషి జన్మగీతం ఏమిటో అలవాటైపోతుంది… బిడ్డ పేరుకన్నా ఈ గీతానికే ఆదరణ… ఇక ఆ బిడ్డ పెరుగుదల, తప్పులు, ఒప్పులు, విజయాలు, గాయాలు, జబ్బులు… ప్రతీ దశలోనూ ఆ పాట తనలో ఓ భాగమే… జబ్బు చేసినా వైద్యంతోపాటు పాట పాడాల్సిందే… విజయాల వేళ ప్రశంసలతోపాటు పాట పాడాల్సిందే… ఒకవేళ నేరం చేసినా సరే, తమ సమాజానికి నష్టం కలిగించే చర్యకు పాల్పడినా సరే వెంటనే శిక్షించరు… ఊరి మధ్యకు పిలుస్తారు, నిలబెడతారు, చుట్టూ వలయంలా చేరతారు, తన పాటే ఆలపిస్తారు… మారాలని బోధిస్తారు… శిక్షలు, జరిమానాలకన్నా ప్రేమను పంచడం ద్వారా, తన ఉనికికి అర్థం చెప్పడం ద్వారా మార్చే ప్రయత్నం అది…
పెళ్లి సమయంలో కూడా వధూవరుల గుర్తింపుగీతాల్ని ఆలపిస్తారు… మరణశయ్య మీద ఉన్నప్పుడు సాంత్వనకు గానీ.., మరణించేటప్పుడు కూడా గ్రామస్థులు ఆ గీతాన్నే పాడుతూ అంతిమ వీడ్కోలు పలుకుతారు…………… సోషల్ మీడియాలో, మీడియాలో బహుళ ప్రచారంలో ఉన్న సమాచారం ఇది… కాదు, కాదు, ఇలాంటిదేమీ లేదు ఆ తెగలో… ఉత్త కల్పన అని కొట్టిపారేస్తారు చాలామంది… కావచ్చుగాక… కానీ ఆ కల్పన కూడా ఎంత అందంగా ఉంది… ఎంత అపురూపంగా ఉంది… సాధ్యమో అసాధ్యమో… నిజమో అబద్ధమో… ఎంత బాగుంది…!! నిజమే అని కాసేపు నమ్ముదాం… నష్టమేముంది..? మనసు నిండా ఆనందం వెన్నెలలా పరుచుకున్నట్టుగా ఉంటుంది…!! ⠀
Share this Article