నిజంగా ఆమెకు వీసమెత్తు న్యాయం దక్కిందా..? ఇది చాలా పెద్ద ప్రశ్న..! జైభీం సినిమాలో సినతల్లి, నిజజీవితంలో పార్వతమ్మ… కొన్నేళ్ల క్రితం రాజ్యం తన సహచరుడిని క్రూరంగా హింసించింది, పొట్టన పెట్టుకుంది… దొంగలనే ముద్రలేసింది… దీనిపై ఓ పెద్ద న్యాయ పోరాటం… పేదల పట్ల కన్సర్న్ ఉన్న జస్టిస్ చంద్రు ఆమెకు అండగా నిలబడ్డాడు… సీపీఎం కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలబడింది… కానీ ఎక్కడి వరకు..? కేసు వరకే… కానీ తరువాత ఆమె ఏమైంది..? ఎలా బతికింది..? అసలు ఇప్పుడు ఎలా బతుకుతోంది..? అదీ ముఖ్యమే కదా… మరిక ఆ కేసులో విజయానికో, ఆ పోరాటానికో అంతిమ సార్థకత ఏమిటి..? ఇవన్నీ ప్రశ్నలే… హీరో సూర్య, జస్టిస్ చంద్రు, ఆ జైభీం సినిమా, దర్శకుడు, నటీనటులు ఈమధ్య ట్రెండింగ్… వందశాతం అర్హులే… తప్పులేదు… హీరో సూర్య కూడా సదరు జస్టిస్ నడుపుతున్న ట్రస్టుకు కోటి రూపాయలు ఇచ్చాడు… పుట్టుకతోనే నేరస్తులుగా ముద్రలేసే తీరు మీద, వివక్ష మీద, క్రౌర్యం మీద సమాజంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది… మరీ అణగారిన వర్గాల సంక్షేమం మీద అందరి దృష్టీ పడుతోంది… గుడ్… కానీ..? ఆ పర్టిక్యులర్ కేసులో నిర్భయంగా నిలబడి పోరాడిన ఆ పార్వతమ్మ ప్రస్తుత గతేమిటి..? ఒక్కసారి దిగువన ఓ ఫోటో చూడండి…
తమిళంలో ఓ టీవీ చానెల్ ఆమె బతుకు దైన్యాన్ని కళ్లకుకట్టింది… మిత్రుడు Gurram Seetaramulu…. మాటల్లో చెప్పాలంటే… ‘‘జై భీం సినిమా చూసిన రోజు నుండి ఆ ఘోరకలిలో వంచితురాలు అయిన సినతల్లి అలియాస్ పార్వతమ్మ ఇప్పుడెలా ఉందో అనిపించింది. ఉండేందుకు ఇల్లు, మనుషులు అని చెప్పేందుకు అడ్రెస్ కూడా లేని బక్క ప్రాణాలు వాళ్ళవి. భర్త ఉన్నప్పుడే కాణీకి కొరగాని బ్రతుకులు వాళ్ళవి. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఉచ్చపోయించిన పార్వతమ్మ ఆ కేసు గెలిచినా సరే జీవితంలో గెలవలేక పోయింది. ఉండేందుకు చోటు కాదు కదా, నిలువ నీడ కూడా లేని దయనీయ స్థితిలో ఉంది ఆమె.
Ads
ఆమె పోరాటానికి సమాజం మద్దతునిచ్చింది, ఆమె కూడా బలంగా నిలబడింది. కానీ ఇదుగో ఇలా బతుకుతోంది… రాజ్యం బాగానే ఉంది, పోలీసులు బాగానే ఉన్నారు, వ్యక్తిగా ఆమె తీవ్రంగా నష్టపోయింది, ఆమె బాధితురాలు… ఏళ్లుగా ఇదే దుర్భరమైన బతుకు… (టీవీ ఇంటర్వ్యూలో ఆమె బిడ్డల ప్రస్తావన లేదు…) నిజమే, ఆమె ఆ కేసు గెలిచింది, హక్కుల దిశలో వ్యవస్థకే వెలుగు చూపే గెలుపు… కానీ చివరకు ఆమెకేం దక్కిందనే ప్రశ్నకు మాత్రం జవాబు లేదు… హీరో సూర్యకు ఆ ట్రస్టు కనిపించింది… మంచిదే… కానీ హీరో లారెన్స్‌కు మాత్రం పార్వతమ్మ కళ్లలో శూన్యం కనిపించింది… ఆమె బతుకులో దైన్యం కనిపించింది… అందుకే ఇల్లు కట్టిస్తానన్నాడు… తను కట్టిస్తాడు, మనకున్న మంచి మనసున్న హీరోల్లో లారెన్స్ కూడా ఉంటాడు… కానీ మళ్లీ ఓ ప్రశ్న… ఇలాంటి కేసుల్లో బాధితులు కేసుల్ని గెలుస్తారు సరే, కానీ నిజంగా న్యాయం దక్కుతోందా..? అసలు న్యాయం అంటే ఏమిటి..? చిక్కు ప్రశ్న…!!
Share this Article