అప్పట్లో పుష్పక విమానం ఓ సంచలనం… సింగీతం దర్శకత్వం, కమల్ హాసన్ నటన, అమల అందం… అబ్బే, అవి కాదు… అసలు మాటల్లేని సినిమా… ఏ భాష ప్రేక్షకులు చూసినా అర్థమవుతుంది… మంచి టెంపో బిల్డప్ చేస్తూ చివరి దాకా భలే నడిపిస్తారు కథను… అలనాటి మంచి టైటిళ్లను కూడా భ్రష్టుపట్టించడం కూడా ఇప్పటి ట్రెండ్… ఆ పని ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చేశాడు… నేములో నేముంది, సినిమా బాగుంటే సరిపాయె అనుకుంటాం, పైగా విజయ్ అంటే మనకు ఓ క్రేజ్… కానీ తను నిర్మాత, తమ్ముడు హీరో… సరే, అదీ పర్లేదు… తమ్ముడు ఆనందుడు ఇంకా నటనలో తప్పటడుగులు (తప్పుటడుగులు కాదండోయ్…) వేస్తున్నాడు, అనగా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది… ఐనా పర్లేదు, మన ప్రజెంట్ వారస హీరోలకు ఏమైనా నటన వచ్చా..? చెలామణీ కావడం లేదా ఏం..? ఐనా మన తెలుగులో ప్రేక్షకులు నటనను ఎప్పుడు పట్టించుకున్నారు గనుక… సూపర్ స్టార్లను చేసి, రోజూ ఫోటోల ముందు కొబ్బరికాయలు కొట్టడం లేదా ఏం… అదీ కాదు, సమస్య… మరి..?
నిజానికి పావుగంటకో ఫైట్, అరగంటకో పాట తరహా చిల్లర రొటీన్ ఫార్ములా జోలికి పోకుండా… సూపర్ హీరోయిజం ఉచ్చ తొక్కకుండా… ఓ మంచి కాన్సెప్ట్ కథకు ఆనంద్ అంగీకరించడం బాగుంది… విజయే నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం బాగుంది… పెళ్లయిన రెండు రోజులకే పెళ్లాం లేచిపోవడం, దాన్ని బయటికి చెప్పలేక, ఓ ఫేక్ హీరోయిన్ను తెచ్చుకుని, బజార్ల ఇజ్జత్ పోతదనే భయంతో నానా ఇకమతులతో దాచిపెట్టే హీరో ప్రయత్నం చేయడం అనే కథ వెరయిటీ.., నిజానికి ఇలాంటి కథలు తెలుగులో రావడమే అరుదు… మంచి చేయి తిరిగిన దర్శకుడైతే దీన్ని సమర్థంగా ప్రజెంట్ చేసేవాడేమో… సూపర్ పేలి ఉండేదేమో సినిమా… కానీ దామోదర అనబడే దర్శకుడు సెకండాఫ్‌లో చేతులెత్తేశాడు… కాదు, విజయ్ చేతులు కాల్చేశాడు…
Ads
ఫస్టాఫ్ నవ్విస్తూ, సిట్యుయేషనల్ కామెడీతో సినిమా సరదాగా సాగిపోతోంది… ఎప్పుడైతే పోలీస్ సునీల్ ఎంట్రీ ఇస్తాడో, ఇక కథ పూర్తిగా క్రైం జానర్లోకి వెళ్లిపోయింది, సీరియస్‌నెస్ వచ్చేసింది, ఫన్ కాస్తా గాలిలో కలిసిపోయింది… పోనీ, కథను కామెడీ నుంచి క్రైంలోకి తెలివిగా తీసుకుపోయినా బాగుండేది, కానీ కథను కంచికి ఎలా చేర్చాలో తెలియక, నానా గందరగోళపడి, చివరకు కథను కనిపించిన గంగలో నిమజ్జనం చేసేశాడు దర్శకుడు… ఇలాంటి సినిమాల్లో పాటలు ఎప్పుడూ స్పీడ్ బ్రేకర్లు, పైగా ఈ పాటల్లో ఒక్క చరణమైనా, పల్లవి ఐనా థియేటర్ వదిలే టైంకు గుర్తుండి చావదు… అవి తీసి పారేసి, మరో నాలుగైదు ఫన్ సీన్లు రాసుకుని ఉంటే… సెకండాఫ్‌లో కాస్త రిలీఫ్ ప్రయత్నించి ఉంటే కొంచెం బెటర్‌గా ఉండేదేమో… పోనీలెండి, భిన్నమైన కథ కదా, ప్రయత్నం, సంకల్పం అభినందనీయం… అంత డబ్బు, టైం ఖర్చుపెట్టేంత సీన్ లేదు గానీ ఓటీటీలో గానీ, టీవీలో గానీ చూసేద్దాం…!!
Share this Article