సమస్య ఎక్కడొస్తున్నదంటే… తెలుగు టీవీ సీరియళ్ల దర్శకుల్లాగే కొందరు సినిమా దర్శకులు కూడా తమకు అన్నీ తెలుసనుకుంటారు… లాజిక్కులు వదిలేస్తారు, అసలు వాళ్లకు సబ్జెక్టు తెలిస్తేనేమో తాము లాజిక్కులకు దూరంగా వెళ్తున్నామనే స్పృహయినా ఉండేది… సీబీఐ, రా, ఎన్ఐఏ పాత్రలు అనగానే సూపర్ హీరోల్లాగా చిత్రీకరించేయడం వరకూ వోకే, కానీ వాళ్ల ఆపరేషన్లు ఎలా ఉంటాయో కనీసం బేసిక్స్ తెలుసుకుంటే బాగుంటుంది… ఏ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర పది నిమిషాలు టైం తీసుకున్నా అర్థమయ్యేలా చెప్పగలరు… నిజానికి ఇలాంటి విభాగాల అధికారుల దర్యాప్తులో గానీ, ఆపరేషన్లలో గానీ చాలావరకూ వెపన్ యూజ్ చేయరు… మరీ అవసరమైతే తప్ప… యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌కు ప్రత్యేక విభాగాలున్నయ్, ఎవరి స్పెషలైజేషన్ వాళ్లది… ఇవి ఎందుకు చెప్పుకోవడం అంటే..? రాజా విక్రమార్క అనే సినిమాలో కథను చూస్తుంటే చిరాకెత్తుతుంది కాబట్టి… ఎవరో సరిపల్లి శ్రీ దర్శకుడట… హీరో కార్తికేయ…
గూఢచర్యం వేరు, కేసుల దర్యాప్తులు వేరు, ఆపరేషన్స్ వేరు… మళ్లీ వాటిల్లోనూ బోలెడు తేడాలుంటయ్… అంతెందుకు సీబీఐలోనే బోలెడు విభాగాలుంటయ్… సబ్జెక్టులవారీగా దర్యాప్తులు చేస్తుంటయ్… అబ్బే, తెలుగు సినిమాకు అవన్నీ ఎందుకు సార్, ఏదో ఓ కథ, హీరో అంటే హీరోయే… లాజిక్కులు పట్టించుకుంటే సినిమా కథ ఎలా అవుతుంది అంటారా..? అవున్నిజమే… హీరో అనగానే తప్పనిసరిగా మంచి సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి… నరాలు ఉప్పొంగి మెరుస్తూ ఉండాలి… హీరోయిన్ ఉండాలి, వీలయితే దర్యాప్తు కథలోని పాత్ర అయితే మరింత థ్రిల్… ఇవ్వాళ్రేపు కామెడీ లేకపోతే ఎవడూ సినిమా థియేటర్ వైపు వెళ్లడం లేదు కాబట్టి సీరియస్ థ్రిల్లర్ అయినా సరే ఫన్ పెట్టేయాలి… సినిమా కాబట్టి పాటలు ఉండాలి, అక్కడక్కడా ట్విస్టులుండాలి… చివరకు కథ చంకనాకిపోయినా పర్లేదు, ఈ రొటీన్ ఫార్ములాకు భిన్నంగా పోలేం… అవును, పోలేం…
Ads
నిజానికి క్రైం, సూపర్ కాప్, థ్రిల్లర్ సినిమాలంటే… ముందుగా కథ ముఖ్యం, దానికన్నా ఎన్నోరెట్లు బలమైన కథనం అవసరం… ప్రేక్షకుడిని వెంటనే కథలోకి తీసుకుపోయి, సస్పెన్స్‌లో పడేసి, మెల్లిమెల్లిగా ముళ్లు విప్పేస్తూ, చివరకు కథను కంచికి చేర్చడం… అదే ఉంటే, ప్రేక్షకుడికి ఈ సారం లేని పాటలు అవసరం లేదు… సిక్స్ ప్యాకులు, లవ్వ్ ట్రాకులు కూడా అక్కర్లేదు… మధ్యమధ్య ఏడిపించే కామెడీ కూడా యూజ్‌లెస్… రాజావిక్రమార్క సినిమాలో ఫాఫం, కార్తికేయ బాగానే కష్టపడ్డట్టుగా అనిపించింది… కానీ డైలాగ్ డెలివరీ, మొహంలో ఉద్వేగప్రదర్శన దిశలో చాలా చాలా ఎదగాల్సి ఉంది… సిక్స్ ప్యాకులే ఉద్వేగాల్ని పండించలేవు కదా కార్తికేయా..! ఇప్పుడు ఎంచుకున్న కథ, జానర్ తప్పు అని కూడా కాదు, కానీ క్రైం, ఇన్వెస్టిగేషన్ తాలూకు కథలు, కాయలు పండితేనే రుచి… లేకపోతే వగరు వగరుగా, చేదుగా, కచ్చాపచ్చాగా అటూఇటూ కాకుండా పోతుంది… ఈ సినిమాలాగే… ఇంతకుమించిన సమీక్ష కూడా ఈ సినిమాకు అనవసరం…
Share this Article