సహజమే… ఏ పాటల రచయితకైనా తను రాసిన పాటంటే సొంత బిడ్డ… తనకే ముద్దు… సమర్థించుకుంటాడు… కోవాలి… అయితే అది అన్నిసార్లూ కాదు… కొన్నిసార్లు నోరు మూసుకోవాలి… అదే ఉత్తమం… ఈ విషయం దిగుదిగుదిగునాగ అని ఓ బూతు పాట కుమ్మేసిన అనంత శ్రీరాంకు తెలుసు, ఏంది పిల్లగా, ఓ భక్తి పాటను, ఇలా ఓ బూతుపాటను చేసేశావ్ అని ఫేస్‌బుక్‌లో జనం బూతులు తిడితే ఇక సైలెంట్ అయిపోయాడు… తనకు తెలుసు, తన ఆత్మకు తాను చేసుకున్న ద్రోహమేమిటో… సమర్థించుకునే అవకాశం లేదు, సమాధానం చెప్పే స్కోప్ లేదు… మౌనమే నా భాష అనుకుంటూ నిశ్శబ్దంలోకి జారిపోయాడు కొన్నాళ్లు….. ఆ తెలివి సుద్దాలకు లేకుండా పోయింది… సారంగదరియా పాటను సమర్థించుకోవడానికి నానా ప్రయాస పడ్డాడు… ఆ పాట టీవీ తెర మీద ఎవరు ముందుగా పాడితే వాళ్లకే రైట్స్ ఉంటాయనే ఓ వితండవాదనకు తనూ ప్రభావితమై పోయాడు… అచ్చ తెలుగు జానపదాల పల్లవులపై హక్కెవరిది..? దాన్ని నేనంది పుచ్చుకుంటే తప్పేంది..? అని నేరుగా ప్రశ్నించలేకపోయాడు… అఫ్‌కోర్స్, లవంగి వంటి పిచ్చి పదాల మీద ఆయన్ని ఎవరూ అడగలేదు, ఆయనేమీ చెప్పలేదు… ఆయనకూ తెలుసు, సినిమా పాటల్లో ఒత్తుడు పదాలు తప్ప తప్పుడు పదాలు, ఒప్పుడు పదాలు అంటూ వర్గీకరణ ఏమీ ఉండదని…!!
అంతటి వేటూరి, ఆత్రేయ తదితరులే నిర్మాతలు, సంగీత దర్శకుల ఒత్తిళ్ల మేరకు… వాళ్ల దర్శకుల అభిరుచుల మేరకు… ఆయా హీరోల అలవాట్ల మేరకు… బోలెడు బూతు పదాల్ని బొచ్చెడు పాటల్లో కుమ్మీ కుమ్మీ వదిలారు… వాటి గురించి వాళ్లను ఎవరూ ప్రశ్నించలేదు, వాళ్లేమీ చెప్పలేదు… ఎటొచ్చీ ఇప్పటి రచయితలే కొన్ని తప్పుల్నీ గెలికీ గెలికీ ఇంకాస్త చిరాకెత్తిస్తుంటారు… మన చంద్రబోస్‌లాగా…! రాబోయే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ తిక్క పాట రాశారు కదా… నాటునాటునాటు అని… దాని మీద మనం కూడా ముచ్చటించుకున్నాం… రాజమౌళి తప్పుడు క్రియేటివ్ లిబర్టీస్ గురించి ప్లస్ ఈ పాటలోని పైత్యం గురించి…! రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ బాగా పాడారు… గుడ్… రాంచరణ్, ఎన్టీయార్ చెలరేగిపోయారు, టూ గుడ్… వాళ్లు ఇరగేసి ఆడారు కాబట్టే ఆ పాటకు ఈ గుర్తింపు, లేకపోతే దానికి అంత సీన్ లేదు… కీరవాణి ట్యూన్‌లో పెద్ద విశేషమేమీ లేదు…
Ads
ఐతే ఇక్కడ చిరాకెత్తించే విషయం ఏమిటంటే…? ఓ టీవీ ఇంటర్వ్యూలో (పైన లింక్ ఉంది) మాట్లాడుతూ చెప్పిన కొన్ని సంగతులు… తనకు సందర్భం చెప్పారు తప్ప, కంటెంట్ చెప్పలేదట, లైన్ చెప్పలేదట, కీరవాణి మస్తు ఫ్రీడం ఇచ్చాడట, నీ ఇష్టం వచ్చింది రాసెయ్ అన్నారట, దాంతో తను ఆ కాలంలోకి (కుమ్రం భీం) వెళ్లిపోయాడట, పల్లెటూరు నుంచి వచ్చాడు కాబట్టి, స్వానుభవమే కాబట్టి ఇక ఆనాటి పల్లెపదాల్ని అల్లాడట, అద్భుతంగా వచ్చిందట, అప్పటి పరిభాష, అప్పటి కథాకాలానికి తగిన పదాలు సరిగ్గా పడ్డాయట…. ఇలా చాలా చెప్పిండు… హహహ, నవ్వొచ్చింది, కాస్త జాలేసింది… ఇప్పుడు వోకే గానీ, ఇన్నిరకాల నాటు పదాలు తెలంగాణలో అలనాటి వ్యవహారిక పదమా..? ఏ గూడేల్లో విన్నావు ఇవి..? ఎప్పుడు..?
గడ్డపార సరే, చెడ్డ నాటు అనేది ఓ వికృత, కల్పిత పదం కాదా..? పైగా ఇవన్నీ కుమ్రం భీం కాలం నాటి పరిభాషట (పరిభాష అంటే ఓసారి డిక్షనరీ చూడు బోస్)… పిచ్చ నాటు అనే పదంలో పిచ్చ అనే పదానికి తెలంగాణలో అర్థం తెలియదా బోస్..? కీసుపిట్ట కూసింది సరే, పొలంగట్టు మీద పోట్లగిత్త రంకెలేస్తూ పరుగులు తీసిందా..? గిత్త అనేది కూడా తెలంగాణ పదమేనా..? రాజమౌళికి, కీరవాణికి తెలంగాణ పదాలు తెలియవు, వాళ్లకు అక్కరలేదు, కానీ ఏవేవో పిచ్చి పదాలను సృష్టించి, వాళ్ల కళ్లకు గంతలు కట్టినట్టే తెలంగాణ సమాజానికి కూడా కట్టేయగలవా..? చివరకు పోలేరమ్మ జాతరను కూడా తెలంగాణలోకి పట్టుకొచ్చినవ్… వారెవ్వా, బోస్… ఆ పాటను పోస్ట్‌మార్టం చేస్తే ఇంకెన్నో ఇలాంటివి..?! ప్చ్, నీ పాటకన్నా నీ సమర్థన, నీ వివరణ మహా ‘చెడ్డనాటు’ బోసూ…!! ఈమధ్య చిత్రవిచిత్రమైన యాస, పదాలతో కంగాళీ, కిలికి భాషను సృష్టించి మరీ తెలుగు టీవీ సీరియళ్లు ఇదే తెలంగాణ భాష అంటున్నాయి… వాళ్లకూ నీకూ తేడా ఏముంది బోస్ బాసూ…!!
Share this Article