‘‘ఆరు నెలలయ్యాయి… 60 వేల కోట్ల ఆదాయం వచ్చింది, 40 వేల కోట్ల అప్పులు తెచ్చారు, అంటే లక్ష కోట్లు… అందులో సగం జనానికి పంచిపెట్టారు… ఉద్యోగుల జీతాలకు, పాత అప్పుల కిస్తులు, మిత్తీలకు మిగతా సొమ్ము ఖర్చయిపోయింది… హళ్లికిహళ్లి సున్నకుసున్నా… మరో ఆరు నెలల్లో మరో 40 వేల కోట్ల అప్పులు తేవాలి, లేకపోతే బండి నడవడం కష్టం… ఈ నొగలు ఎప్పుడు విరిగిపోయి కూలబడుతుందో తెలియదు…’’ ఏపీ ఆర్థిక వ్యవస్థపై సగటు మనిషికి కూడా అర్థమయ్యే విశ్లేషణ ఇది… ఎనకమిక్ టైమ్స్ ఇంగ్లిషులో రాసిన కథనం సారాంశం ఇదే… ఈనాడు ఈరోజు మూలిగీముక్కీ రాసింది ఇదే… ద్రవ్యలోటు, ఆర్థికలోటు, కేపిటల్ వ్యయం, రెవిన్యూ వ్యయం ఇలాంటి పదాలు పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్నవాడికే అర్థం కావు… మరి ఆ పదాలన్నీ వల్లెవేస్తూ, గణాంకాలను డెసిమల్స్ సహా పేర్చితే వచ్చే ప్రయోజనం ఏముంది..? చిన్న టేబుల్ కొట్టి వదిలేస్తే పోలా..? కాగ్ వాడు తన పరిభాషలో నివేదిక రాసుకుంటాడు, ఆర్థిక శాఖ జమాఖర్చు లెక్కలు ఊళ్లో షావుకారు రాసుకునే ఖాతాల పుస్తకం కాదు… కాకపోతే పత్రిక డ్యూటీ ఎక్కువ మంది పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా పరిస్థితిని తెలియజెప్పడం… ఈనాడు ఈ బేసిక్స్ కూడా మరిచిపోయి ఎటో వెళ్లిపోతోంది…
ఆంధ్రజ్యోతే కాస్త నయం… దాదాపు పదిరోజులపాటు సీరియల్ రాసీ రాసీ, పెన్ను అరిగిపోయి, మళ్లీ నిన్న తాజాగా అందుకుంది… రెడ్ నోటీస్ అంటుంది, డిఫాల్టర్ అంటుంది, అయిపోయింది, ఇక రాష్ట్రపతి పాలన తప్పదు అంటుంది… దొరికిన నాలుగు ముక్కల వార్తకు నలభై ముక్కలు యాడ్ చేసి, మరో నలభై మాల్‌మసాలా దట్టించి, తిరగమోత పెట్టి మరీ కసికసిగా జనంలోకి వదులుతోంది… జగన్ ప్రభుత్వంలో వాటిని ఖండించేవాళ్లు లేరు… ఇదీ పరిస్థితి అని నిజాలేమిటో చెప్పేవాళ్లు లేరు… పనిలోపనిగా తెలంగాణ మంత్రులు కూడా వాతలు పెడుతున్నారు… ఓ మంత్రి అయితే జగన్ అడుక్కు తింటున్నాడు అనే పరుషమైన పదజాలాన్ని కూడా వాడేశాడు… ఏమిటీ అలుసు..? ఏమిటీ భవిష్యత్తు..?
Ads
నిజానికి దళితబంధు పథకం మీద సీనియర్ రాజకీయవేత్త కడియం శ్రీహరి చెప్పినట్టు… ‘‘ఇలాంటివి పులి మీద స్వారీ చేసినట్టు’’..!! ఒకప్పుడు బడ్జెట్ పరిమితులను మించి ఒక్క హామీ కూడా ఇవ్వను అని భీష్మించుకున్న స్టేజీ నుంచి, ఓ ఎన్నికల్లో భంగపడి, ఇక ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించి వదిలాడు… మడమ తిప్పని మనిషాయె… పంచిపెట్టడం ప్రారంభం… కానీ వచ్చే ఆదాయమేమో చిన్న ఒర్రె, ఖర్చేమో పెద్ద ప్రవాహం… మరెలా..? అప్పులు తేవడం, తేవడం, తేవడం… నానా మార్గాల్లో సర్దుబాట్లు, పాట్లు, ఇక్కట్లు… ఆపలేడు, కుదించలేడు… ఒకసారి జనానికి ఒక స్కీం అలవాటు చేస్తే ఇక అంతే… బడ్జెట్ పరిమితులు అంటూ, వాటిని వెనక్కి తీసుకోవడం రాజకీయంగా కుదరదు, కుదిరే పని కాదు… మరి ఇప్పుడే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే, ఇక రాబోయే రెండేళ్లు, ప్రత్యేకించి ఎన్నికల సంవత్సరంలో పరిస్థితి ఏమిటి..? అసలే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన దుస్థితిలో ఇంకా అప్పులెలా పుడతాయి..? ఈ దురవస్థకు, అస్తవ్యస్తతకు బాధ్యత ఎవరిది..?
ఇలాంటి విషయాల్లో కేసీయార్ తెలివైనోడు… దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం, రాబోయే రోజుల్లో దళితబంధు… పేరుకు పథకాలు నడుస్తూ ఉంటయ్… అమలులో ఉంటయ్… కొద్దోగొప్పో ఉనికి చాటుకుంటూ ఉంటయ్… అంతే… కానీ జగన్ మార్కు పంచుడు పథకాలు అలా కాదు… సారు గారి ముందు ఓ ల్యాప్ టాప్ ఉంటుంది, సారు ఓ బటన్ నొక్కుతారు, ప్రజల ఖాతాల్లోకి డబ్బు వేగంగా బదిలీ అయి వెళ్లిపోతుంది… ఇప్పుడు ఎక్కడా కొత్త అప్పు పుట్టే స్థితి కనిపించడం లేదు, మరి జీతాలు, పాత అప్పుల కిస్తులు, మిత్తీలకైనా డబ్బులు కావాలి కదా… ఎలా..? ఎలా..? జగన్‌కు పాలన చేతకావడం లేదు అంటే చంద్రబాబు గొప్పగా ఉద్దరించాడని కాదు సుమా… నిజానికి కార్పొరేషన్లను పెట్టేసి, వాటి పేరిట రుణాలు తీసుకురావడం, ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా, అప్పుల పరిమితి పెంచుకోవడానికి జీఎస్‌డీపీని పెంచి చూపించుకోవడం గట్రా బాబు దొర మొదలెట్టిన తంతే… తెలంగాణ చేసేదీ అదే… జగన్ చేసేదీ అదే… ఈ మితిమీరిన ‘‘రాజకీయ పంచుడు పథకాల’’ను, అలవిమాలిన వ్యయాన్ని కట్టడి చేసే ఆలోచన ఏమైనా కేంద్రం వద్ద ఉందా..? అబ్బే, అదీ అప్పుల బాటలోనే తలమునకలై ఉంది, పెట్రో గ్యాస్ దోపిడీయే చాలడం లేదు, ఆ అత్త తన కోడళ్లకు ఏం చెప్పగలదు అంటారా..? అంతేలెండి…!!
Share this Article