Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మో… అమ్మే…! టాప్ రేటెడ్ తెలుగు డైలాగుల్లో బహుశా ఇదే నంబర్‌వన్..!

November 15, 2021 by M S R

….. By……. Bharadwaja Rangavajhala…………   అమ్మో అమ్మే …!

మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు.

ఇంతలో …

Ads

చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు.

శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు.

తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు.

కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు.

అయినా పూర్తిగా నిద్ర వదలదు … అలాంటి సమయంలో ఓ చెలికత్తె …

మీ అమ్మగారు వస్తున్నారమ్మా అని చెప్తారు.

శశిరేఖ రూపంలో ఉన్న ఘటోత్కచుడు అప్రయత్నంగానే అమ్మో అమ్మే అని ఒక్కసారి ఉలిక్కిపడతాడు.

ఇంతలో శ్రీ కృష్ణ, రుక్మిణీ సమేతంగా శయ్యాగృహంలోకి ప్రవేశించిన రేవతీదేవి పాదాలకు నమస్కారం పెట్టి నమో మాత నమో అనేస్తాడు.

ఇది చూసి రేవతి మురిసిపోతుందిగానీ జరిగింది గ్రహించదు.

మరో వైపు అభిమన్యుడు కూడా తల్లిచాటు పిల్లాడుగానే కనిపిస్తాడు …

ఘటోత్కచుడి పాత్ర ఎందుకు మనకి అంతగా కనక్ట్ అయ్యిందంటే …

ఆ పాత్రను ఎస్వీఆర్ చేసినా సరే …

మనకి కొంచెం దుడుకుతనం, చిలిపితనం కలగలసిన కుర్రాడుగానే కనిపిస్తాడు.

ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఇట్టాంటి కుర్రాడొకడు ఉండేవాడు.

ఇంట్లో కాస్త బలమైన పనులన్నీ వాడే చేస్తాడు … కానీ అమ్మంటే మాత్రం విపరీతమైన భయం. గౌరవం.

మాయాబజార్ లో ఘటోత్కచుడు వ్యవహారానికి వస్తే …

అమ్మకు తప్ప ఈ ప్రపంచంలో మరింక దేనికీ సరండర్ అయ్యే ప్రసక్తే ఉండదు.

కొడుకు దుడుకుతనం బాగా తెల్సి ఉండడం చేత ఎప్పటికప్పుడు కనిపెట్టుకునే ఉంటుంది ఆ తల్లి. కొడుకు ఏం పీకల మీదకు తెచ్చుకుంటాడో అనే ఆందోళనే ఎప్పుడూ ఆ పిచ్చితల్లికి.

వీధిలో ఎవర్నో నిలబెట్టి వాయించేస్తున్నాడని తెల్సి …

కాస్త ముందూ వెనకా కనుక్కుని కొడుతున్నాడా లేక తప్పు చేసేస్తున్నాడా అని చూసుకోడానికి వస్తూ కూడా …

సుపుత్రా సుపుత్రా అనే పిలుస్తుంది …

ఒరే … ఏం చేస్తున్నావురా గాడిదా … కొంప మీదకు మళ్లీ ఏం తెస్తున్నావ్ అని అనదు …

కొడుకు తనకు బాగా తెల్సు.

వాడు తప్పు చేయడు.

కాకపోతే దుడుకుతనంతో పొరపాటు చేస్తాడేమో అని …

అది ఎక్కడ తప్పుగా పరిణమించి కొడుకు నిందల పాలౌతాడో అనే ఆందోళనే ఎప్పుడూ పాపం హిడింబికి.

అందుకే … ఎప్పటికప్పుడు కొడుకును ఓ కంట కనిపెట్టే ఉంటుంది.

కొడుక్కీ తెల్సు … తను ఏం చేసినా అమ్మకు తెల్సిపోతుందని …అందుకే … అమ్మ వస్తోందనగానే అంత ఖంగారు పడిపోతాడు …తానేమైనా తప్పు చేసేసానా అని ఆలోచనలోనూ ఆందోళనలోనూ పడిపోతాడు …మరో వైపు శశిరేఖ పాత్రలో రక్తికట్టించాలి. ఈ గందరగోళాన్నంతా సావిత్రి గారు అద్భుతంగా అభినయించేశారు.

mayabazar

ఇక మరో అమ్మ … సుభద్ర …కొడుకును వీరుడుగా పెంచడమే కాదు … స్వాభిమానంతో .. కొడుకు ఎవరి ముందూ తలొంచాల్సిన పరిస్థితి రాకుండా కంటికి రెప్పగా చూసుకుంటుంది.

కొడుకు మీద వల్లమాలిన నమ్మకం.

తన పెంపకం మీద నమ్మకం అది.

నా కొడుకు బాణం గురి తప్పదొదినా అని చెప్తున్నప్పుడు రుష్యేంద్రమణి కళ్లల్లో కనిపించే ధీమా చూసి తీరాల్సిందే.

రావూరి రాసిన నూరు చందమామలు పుస్తకం ప్రకారం … పింగళి నాగేంద్రరావుగారికి తల్లితో విపరీతమైన అటాచ్మెంటు.

అలాగే తల్లిని జాగ్రత్తగా చూసుకోనికే నెల్లూరు నుంచీ వంటమనిషిని తెప్పించి మరీ ఇంట్లో పెట్టుకున్నారు.

ఆవిడ పేరు మహాలక్ష్మమ్మ.

ఆవిడకీ కొడుకంటే విపరీతమైన ఆపేక్ష.

కొడుకు వెండి కంచంలో భోజనం చేస్తే చూడాలనేది ఆవిడ కోరిక.

అది రావూరి లాంటి కృష్ణాపత్రికలో పింగళివారి కొలీగ్స్ దగ్గర చెప్పుకుని బాధపడేదట ఆవిడ.

ఆ విషయం కూడా రావూరి రాశారు.

నాటక సమాజాల వాళ్లు ఇతర సంస్ధల వాళ్లూ సన్మానించి ఇచ్చిన మెడల్సూ షీల్డులూ అవీ చూపించి వీటన్నింటినీ చూసినా నాకు తృప్తికలగదు ..

వాడు పెళ్లి చేసుకుంటే వాళ్ల అత్తగారు వెండికంచం పెడితే అందులో వాడు భోం చేస్తుంటే చూడాలని నా కోరిక అనేదట ఆవిడ.

అదీ లింకు …

ఫైనల్ గా పింగళితో పాటు రావూరి కూడా మద్రాసు సినిమా రంగంలోకి చేరారు.

భరణీ వారి సినిమాలకు పనిచేస్తూండేవారు. అప్పుడూ మహాలక్ష్మమ్మగారు రావూరి తో వెండికంచం ముచ్చట మాత్రం చెప్పకుండా వదిలేవారు కాదట.

ఇక లాభం లేదని పింగళి నాగేంద్రరావుగారిని కూచోపెట్టి మీ అమ్మగారిలా వెండికంచం విషయంలో బాధపడుతున్నారని చెప్పేశారట.

దానికి పెళ్లితో పనేంటి … ఇవాళ్లే వెళ్లి ఓ కంచం తెస్తే పరిపోలా అననారట ఆయన.

వెనక ఎవరూ లేకపోయినా…

తల్లి కోసమే స్వంత ఇల్లు అమర్చుకున్నారు మద్రాసులో …

ఆయన చనిపోయే ముందు ఆ ఇల్లు ఘంటసాల కొనుక్కున్నారు.

నాగేంద్రరావుగారిలో కనిపించే ఈ మదర్ అటాచ్మెంటు …

తల్లిని అర్ధం చేసుకునే పద్దతి మాయాబజార్ సినిమాలోనే కాదు పాతాళభైరవిలోనూ కనిపిస్తుంది.

ఓ కొడుకునివ్వమంటే ఈ రాక్షసుణ్ణిచ్చావేంటి దేవుడా అని తోటరాముడి తల్లి బాధపడే సీను చూస్తే జనాలకు నవ్వొచ్చేస్తుంది.

అందులో ప్రతి ఒక్కరికి తమ కుమారుడు గుర్తు రావాల్సిందే…

ప్రతి కొడుక్కి వాళ్ళ అమ్మ గుర్తు రావాల్సినదే.

రేవతీదేవి కూడా కూతుర్ని ఓ మంచి ఇంట్లో ఇచ్చుకోవాలనే అందరు తల్లులకూ ఉండే పిచ్చతోనే అలా బిహేవ్ చేస్తుంది తప్ప కూతురంటే ప్రేమ లేక కాదు …

సినిమా చివరాకరిలో … ఘటోత్కచుడి మాయలకు తెరమీద నటులూ థియేటర్లో ఆడియన్సూ కూడా డంగై నోళ్లు తెరిచేసిన సమయంలో …

అవునూ ఇంతకీ నా కూతురేమైనట్టు అంటుంది రేవతి.

ఆ ఒక్క డైలాగుతో ఆ రేవతిలోని అమ్మతనాన్ని మొత్తానికి మొత్తం మన కళ్లెదుట నిలబెడతాడు.

ఆయన రాసిన అన్ని సినిమాల్లోనూ నాటకాల్లోనూ కూడా తల్లి పాత్రలు కాస్త ప్రత్యేకంగా కనిపిస్తాయ్.

అందుకే తెర మీద సావిత్రి అమ్మో అమ్మే … అనగానే … ఒక్కసారి అమ్మో అమ్మేమంటుందో అని ప్రతి ఒక్కరూ ఖంగారు పడతారు.

అలా అమ్మతనం కూడా ఉంది మాయాబజార్లో …

అలాగే…

కోపల్లె హనుమంతరావు గారి ప్రభావం కూడా బలంగా కనిపిస్తుంది మాయాబజార్ సిన్మా మీద..

(నాలుగేళ్ల క్రితం పోస్టు మళ్ళీ ఒక్కసారి రివిజన్ అంటారు కదా అలా అన్నమాట )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions