ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా..? విడిపోని యాత్రికులా..? వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే… ఊపిరొక్కటేలే… ఒక శ్వాసలా, నిశ్వాసలా… ఆటాడే విధే ఇదా ఇదా, కలవడం ఎలా..? కలా..? రాసే ఉందా..? ఈ రాతలే, దోబూచులే…… ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలోని ఓ పాట ఇది… ఇప్పటిదాకా మీరు చదివింది పాటలోని మొదటి భాగం… ఇరుప్రేమికులు అంటాడు, కలవరు అంటాడు, విడిపోని యాత్రికులు అంటాడు… మళ్లీ వెంటనే దారొకటే, కానీ దిక్కులు వేరంటాడు… హేమిటోలే… ఫాపం, రచయిత కృష్ణకాంత్ కాస్త ఎక్కువ ఫీలై, మరీ కృష్ణశాస్త్రిలా మాంచి దిట్టమైన భావకవిత్వం గుప్పించాడులే అనుకుందాం… అసలు భావగీతాలు, భావకవిత్వాలు అంటేనే అభావంగా పరుగులు తీయాలి కదా… ఆ లక్షణం పుష్కలంగా కనిపిస్తోంది… అయితే, ఆ గీతంలో సారానికీ, నిర్మాతలు విడుదల చేసిన లిరికల్ వీడియోలోని క్రియేటివ్ యానిమేషన్కూ అస్సలు లింక్ ఉండదు… అది మరో సమాంతర భావగీతంలా సాగుతూ ఉంటుంది…
నిజానికి తప్పుపట్టాలని లేదు… పట్టడం లేదు… మిగతా లిరికల్ వీడియోలతో పోలిస్తే ఇది వంద రెట్లు డిఫరెంటుగా ఉంది, హృద్యంగా ఉంది, చూస్తున్నంతసేపు బాగుందబ్బా అనిపిస్తుంది… పాట ట్యూన్ బాగుంది, గాయనీ గాయకులు కూడా మధురంగా పాడారు, వాళ్ల గొంతులు లలితంగా సాగాయి… ప్రత్యేకించి హరిణి గొంతులో మాధుర్యం ఉంది… పాటలో వాడిన పదాలు కూడా సరళమైన పదాలే… మామూలుగా ఓ లిరికల్ సాంగ్ అనగానే హీరోను ఫోకస్ చేస్తూ, డాన్స్ మాస్టర్ స్టెప్పులేయిస్తున్నట్టు, సింగర్స్ పాడుతున్నట్టు, డైరెక్టర్ ఏవో సూచనలు చేస్తున్నట్టు, షూటింగ్ ఎన్విరాన్మెంట్ చూపిస్తూ, సదరు పాట కోసం ఎవరెవరు చెమటలు కక్కారో అందరినీ పరిచయం చేస్తుంటారు కదా… వాటితో పోలిస్తే ఈ రాధేశ్యామ్ పాట హైక్లాస్… కానీ మరీ హైక్లాస్… సగటు ప్రేక్షకుడికి ఒక్క ముక్క కూడా అర్థం కాదు పాటలోని సాహిత్యం… సేమ్, రచయిత క్లాస్ ఫ్రీక్వెన్సీని ఫీలయ్యే హైటేస్ట్ శ్రోతలు మాత్రమే ఎంజాయ్ చేసేలా… వాళ్లకు కూడా ఎంతమేరకు ఎక్కుతుందనేది డౌటే… ప్రత్యేకించి ప్రభాస్ వంటి మాస్ హీరోకు, అందులోనూ ‘కాళ్ల హీరోయిన్’ పూజా హెగ్డేకు ఈ పాట ఎంతమేరకు సూటవుతుందో కూడా రిలీజయ్యాక చూడాలి… (పలుచోట్ల ఈ పాటలో పదాల ఉచ్చరణ, పదాల అమరిక కూడా కృత్రిమంగా ఉందంటే కారణం, ఆ క్రియేటివిటీ గట్టు దాటి, మత్తళ్లు దూకడమే…!!)
Ads
యానిమేషన్లోని క్రియేటివిటీ కూడా బాగుంది… అదీ పాటలాగే హైక్లాస్… సూపర్ క్లాస్… ఓ రైలు, అందులో ప్రియురాలు, పక్కనే కారులో ప్రియుడు, చేతులు కలవగానే ఒరిగిపోయే రైలు, కారులో జంట… అలా అలా ఆ ఆడవృక్షం మీదుగా, ఓ స్టెతస్కోప్ ఎక్కి, అలా ఓ అరచేతిలోకి, అక్కడి నుంచి సూటిగా నీళ్లలోకి… అక్కడ ఓ గ్రహం కూడా… ఆ కారూ సగానికి పేలిపోయి, ఆ జంట ఈదుకుంటూ ఒకరినొకరు చేరుకోవడం… చూస్తుంటే ప్రతి సీన్ బాగుంటుంది… కాదు, బాగున్నట్టనిపిస్తుంది… కానీ ఆ సీన్లకు లింకులు కలవవు… అచ్చం ఆ పాటతోనూ లంకె లేదు… అసలు పాటే లంకెల్లేని వాక్యాలతో సాగుతూ ఉంటుంది… ఏమోలే… ఆ సినిమాయే ఓ భావచిత్రమేమో… అందుకే ఇలా పాటలు రాసుకున్నారేమో… మనకెందుకులెండి…
ఒరిజినల్‌గా ప్రభాస్, పూజా హెగ్డేల మీద బాగానే చిత్రీకరించి ఉంటారేమో… ఇంత భావగాఢత కలిగిన దర్శకుడు బాగా లోతైన భావాన్నే ఆవిష్కరించి ఉంటాడేమో… అసలే అయిదారేడు భాషల్లో వస్తున్న పాన్ సినిమా… బహుశా హిందీలో ఆలోచించి, తమిళంలో రాసి, ఓ చక్కని మలయాళ ట్యూన్లో ఇమిడ్చి, సరళంగా తెలుగులోని అనువదించిన పాట అయి ఉంటుంది…!! మిగతా పాట కూడా కావాలా..? ఇదుగో… యూట్యూబ్ లింక్ కూడా ఇదే… ‘‘ఖాళీఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే… ఏ గూఢచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో, ఏమో… కాలం మంచు కత్తీ గుండెల్లో గుచ్చే… గాయం లేదు గానీ దాడెంతో నచ్చే… ఆ మాయ ఎవరే, రాదా ఎదురే, తెలీకనే తహతహ పెరిగే… నిజమా, భ్రమా, బాగుందే యాతన… కలతో కలో, గడవని గురుతులే… ఏదో జన్మ బాధే, పోదే, ప్రేమై రాదే… ఈ రాతలే… దోబూచులే…
Share this Article