ఒరేయ్, నీ అవినీతి బయటికి తీసి, జైలులో చిప్పకూడు తినిపిస్తానురా..? అని భీకరంగా హెచ్చరిస్తుంటాడు ఓ పార్టీ నాయకుడు మరో నాయకుడిని… ఛిఛీ, చిప్పకూడు తినివచ్చినవాడు కూడా నీతులు చెబుతున్నాడు, ఇంతకు నీచం ఏముంది అని ప్రెస్‌మీట్‌లో సొల్లు కక్కుతూ, ఆయాసపడుతూ ఉంటాడు మరో నాయకుడు మరోచోట… నిజంగా చిప్పకూడు, అనగా సినిమాల్లో చూపించినట్టుగా, వీళ్లు సొట్టలు బడిన ఓ రాతెండి బొచ్చె పట్టుకుని, ఖైదీల వరుసల్లో నిలబడతారా..? మన భ్రమ..! పిండి కొద్దీ రొట్టె… అసలు నాయకులా, టెర్రరిస్టులా, అవినీతిపరులా, అక్రమార్కులా, రేపిస్టులా, కిరాయి హంతకులా అనే తేడా ఏమీ ఉండదు… డబ్బున్న మారాజులైతే చాలు, జైలులో ‘‘సౌకర్యాలు లభించును’’… చాలామందికి ఇళ్ల నుంచే ఆహారం వస్తుంది… టీవీలు, సెల్ ఫోన్లు, మంచాలు, అక్కడి నుంచే సెటిల్‌మెంట్లు గట్రా చాలా వార్తలు చదివాం కదా… మరిక జైలు శిక్షకు అర్థం ఏమున్నట్టు..? భయమేముంది..? ఖైదీలు ఎవరైతేనేం సమానత్వం ఎందుకు ఉండకూడదు..? అదే మహారాష్ట్ర జైలులో స్టాన్ స్వామికి కప్పు నుంచి భోజనం నోటిలోకి జుర్రకునేందుకు స్ట్రా ఇవ్వండ్రా బాబూ అంటే కూడా కనికరించలేదు ప్రభుత్వం… ఈ చర్చంతా ఎందుకంటే..?
మన మీడియాలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు గానీ ఇంట్రస్టింగ్ వార్త… నిజానికి సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టి, జైళ్లలో పరిస్థితుల మీద ఫోకస్ పెట్టి, కొరడా పట్టి, కొన్ని మార్గనిర్దేశాలు జారీ చేస్తే బాగుండు అనిపించే వార్త… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అన్నట్టుగా… మహారాష్ట్రలో హోం మంత్రిగా పనిచేసి, జైళ్ల మీద బాసిజం చేసిన అనిల్ దేశ్‌ముఖ్ ఈమధ్య అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఇరికి, జైలుకే చేరాడు తెలుసు కదా… ఆయన ఎన్సీపీ… సుదీర్ఘ రాజకీయ జీవితం, పలుసార్లు మంత్రి, 70 ఏళ్లు దాటిపోయాడు… ఇప్పుడు ఎన్సీపీ ప్రభుత్వంలో భాగస్వామి… ఐతేనేం, డెస్టినీ ఈడ్చి తంతే ఇప్పుడు జైలులోకి వచ్చిపడ్డాడు… బెయిల్ అడిగితే, ప్రత్యేక కోర్టు ఏమన్నదో తెలుసా..? ‘‘ముందు జైలు తిండి తిను, తరువాత ఆలోచిద్దాం’’… రెండువారాలు జుడిషియల్ కస్టడీకి పంపించేసింది… నా వయస్సు, నా ఆరోగ్యం దృష్ట్యా బెడ్ సమకూర్చుకుంటానూ అంటే, వోకే అని అంగీకరించింది…
Ads
ఎస్, తినాలి, అందరితోపాటు ఓ పళ్లెం పట్టుకుని, ఖైదీల వరుసలో నిలబడి, తిండి తెచ్చుకోవాలి… ఏవేవో కారణాలతో ‘‘అదనపు సౌకర్యాల్ని’’ పొందే రూల్స్, అధికారుల విచక్షణల్ని ఓసారి సుప్రీం సమీక్షించాలి… అప్పటికిప్పుడు పుట్టుకొచ్చే రోగాలతో హాస్పిటళ్లలో చేరే తంతుకూ బ్రేకులు పడాలి… ఒకవైపు డబ్బుల్లేక, బెయిళ్లు పొంది, విడుదలయ్యే అవకాశాలున్నా సర, అక్కడే మగ్గిపోతూ, చచ్చేవాళ్లు ఎందరో… వాళ్లను ఎవరూ పట్టించుకోరు… మరోవైపు పరపతి, డబ్బున్న మారాజులకు జైళ్లలోనూ సౌకర్యాలు… ఎంత కంట్రాస్టు..? నిజానికి వాళ్ల ప్రభుత్వమే ఉన్న రాష్ట్రం కాబట్టి, ఇలాంటి ఘన నాయకుల్ని వేరే రాష్ట్రాల జైళ్లలో వేయడం బెటర్… అంతేకాదు, వీలయితే రాజకీయ నాయకుల మీద కేసుల విచారణ పరాయి రాష్ట్రాల్లో జరిపిస్తే ఇంకా బెటర్… ప్రభావాల ఒత్తిడి ఉండదు… సేమ్ బ్యారక్, సేమ్ ఫుడ్… నో ఫ్యాన్, నో టీవీ, నో బెడ్, నో హోం ఫుడ్, నో స్పెషల్ ములాఖత్స్… స్ట్రిక్టుగా అమలు జరిగేలా చూస్తే… ఎంత బాగుండు..? మీకూ అనిపిస్తోందా..?!
Share this Article