सुनो द्रोपदी शस्त्र उठालो अब गोविंद ना आयंगे|
హిందీలో పుష్యమిత్ర ఉపాధ్యాయ్ రాసిన కవిత… స్త్రీలు ఎవరో వస్తారని ఎదురుచూసే రోజులు కావివి, స్వీయరక్షణే శరణ్యమని ఉద్బోధించే కవిత… హిందీ అర్థమైనవాళ్లకు ఉత్తేజాన్నిచ్చే కవిత కూడా…! చాలా పాపులర్… దీన్ని అంతే పంచ్‌తో తెలుగులో రాయడం కాస్త కష్టమే… రఫ్‌గా ఆ కవిత స్పిరిట్ చెప్పుకోవాలంటే… ‘‘ద్రౌపదీ, విను.., రక్షణకు ఏ గోవిందుడూ రాడు ఇప్పుడు.., నీ మానసంరక్షణ నీదే… ఎత్తుకో ఆయుధం… ఆట మీద శకుని కూర్చున్నప్పుడు తలలన్నీ తాకట్టు పడతయ్… అమ్ముడుబోయిన పత్రికల మీద ఇంకా ఆశలేమున్నయ్… దుశ్శాసన దర్బార్ల నుంచి ఏ రక్షణ కోరుకుంటున్నవ్… సిగ్గులేని వాళ్లు నీ సిగ్గునేం కాపాడతారు… నిన్నటివరకు గుడ్డిరాజు, ఇప్పుడు చెవిటివాడు కూడా… నీ బాధ, నీ కన్నీళ్లు నీకే తెలుసు… లే, అందుకో ఆయుధం’’…
ఎవరో వస్తారని కాదు, ఏదో ఉద్దరిస్తారని కాదు, స్త్రీలే చైతన్యవంతులై సాగాలనేది కవిత స్పూర్తి, బాగుంది… ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరువాత కదిలిపోయి 2012లో రాసి తన బ్లాగులో పోస్ట్ చేశాడు రచయిత… అసలు ఇప్పుడు వివాదం ఏమిటంటే..? కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక చిత్రకూట్, మందానికి నదీఒడ్డున మహిళల సదస్సులో మాట్లాడుతూ ఈ కవితను చదివింది… ఆమె ప్రసంగాల తీరు పూర్ కదా, పైగా ఇదేమో ఓ రిథమ్‌లో పాడితేనే ఆ పంచ్ వస్తుంది… ఆమె దాన్ని చదవలేక నానా అవస్థలూ పడింది… కానీ ఆ సదస్సుకు, ఆమె ప్రసంగించాలనుకున్న సబ్జెక్టుకు ఆ కవిత ఆప్ట్… లడ్‌కీ హూఁ, లడ్ సక్‌తీ హూఁ (మహిళనే, పోరాడగలను) అనే హ్యాష్ ట్యాగ్‌తో కాంగ్రెస్ ఈమధ్య ప్రియాంక ప్రసంగాలను బాగా ప్రమోట్ చేసుకుంటోంది… మంచి నినాదం… యూపీలో పూర్వ వైభవం కోసం బాగా కష్టపడుతోంది… ఆమె తిప్పలు ఆమెవి…
Ads
ఐతే సదరు కవిత రచయిత ట్విట్టర్‌లోకి వచ్చేశాడు… ‘‘నేను దేశంలోని స్త్రీల చైతన్యం కోసం, ఆత్మస్థయిర్యం కోసం రాశాను ఇది… నీ చిల్లర రాజకీయాల కోసం కాదు… నీ ఐడియాలజీతో నేను ఏకీభవించేవాడిని కాదు, నా రచనను వాడుకునేందుకు అనుమతించబోను… కవితలనూ దోచుకునేవాళ్ల నుంచి దేశం ఏం ఆశించగలదు..?’’ అని పరుషంగా నిందకు దిగాడు… ఇంకేం..? చాన్స్ దొరికింది కదా… ఆ ట్వీట్ ఆధారంగా బీజేపీ పరివార్ ఇక ట్రోలింగ్‌కు దిగింది…
ఇక్కడ ఓ చిక్కు ప్రశ్న… ఇక్కడ ప్రియాంక ఏ కమర్షియల్ ప్రయోజనాల కోసం ఆ కవితను వాడుకోలేదు… మహిళల సదస్సులోనే ఆ రచయిత ఆశించిన చైతన్యం కోరుతూనే ప్రసంగించింది… సాధారణంగా ప్రముఖులు తమ ప్రసంగాల్లో పాపులర్ కవితల్ని, కోట్స్‌ను, వ్యాఖ్యల్ని, పాటల్ని ప్రస్తావించడం పరిపాటే… అది ప్రసంగానికి ఇంకాస్త విలువను, బలాన్ని చేకూరుస్తుంది… మరెందుకు ఈ రచయిత అంత పరుషంగా రియాక్ట్ కావాలి..? తన కవితకు మరింత ప్రాచుర్యం లభిస్తే, తన భావనలు మరింత వ్యాప్తి చెందితే ఎందుకు అభ్యంతరపెట్టాలి..? అఫ్‌కోర్స్, ఆమె రాజకీయ నాయకురాలు, కానీ ఇక్కడ ఆ కవితతో సాగించే వ్యాపారం ఏముందని..? అంత క్షమించరాని తప్పా ఇది..? బీజేపీ పరివార్ రచ్చతో ప్రయోజనం ఏముంది..? బాగాలేదు… Let her fight, fight with her… But not in this manner అని ఆ ట్రోలింగుకు సమాధానాలూ, వెక్కిరింపులూ వస్తున్నయ్… सुनो प्रियांका शस्त्र उठालो….
Share this Article