మొన్నటి నుంచి తెలుగు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది ఒక పోస్టు… ఎవరు రాశారో తెలియదు కానీ పైపైన చదివితేనే, అది రాసిన రచయితకు వరి గురించి ఏమీ తెలియదని మాత్రం మనకు తెలుస్తుంది… బహుశా వాట్సప్ యూనివర్శిటీలో కొత్త అడ్మిషన్ కావచ్చు… ఐనా ప్రభుత్వాలే అడ్డగోలు అబద్ధాలకు, తప్పుడు ప్రచారాలకు, ప్రజల కళ్లకు గంతలు కట్టే ఆందోళనలకు దిగుతుంటే ఆఫ్టరాల్ సోషల్ యాక్టివిస్టుల తప్పేముంది..? కాస్త సబ్జెక్టు తెలిసిన నిపుణులు, అధికారుల నుంచి జ్ఞానబోధ పొంది, సరైన రీతిలో సమస్యను వివరించాల్సిన మెయిన్ స్ట్రీమ్ మీడియాకే అసలు సమస్య ఏమిటో తెలియదు… చాలామంది జర్నలిస్టులకే ధాన్యం, బియ్యం నడుమ తేడా తెలియదు, ఇక వాళ్లకు రా రైస్, బాయిల్డ్ రైస్ నడుమ తేడా ఏం తెలుస్తుంది..? సరే, ఒకసారి ఆ పోస్టు చదవండి…
#అసలు_వాస్తవం_ఏంటో_తెలుసుకుందాం…
Ads
యశంగి పంట మార్పిడి చేపట్టాలంటే రైతుకు అవగాహన కల్పించాలి. మద్దతు ధర ముందే ప్రకటించాలి. తగిన విత్తన సబ్సిడీ ఇవ్వాలి. భూ పరీక్షలు నిర్వహించాలి. వాణిజ్య పంటలను పరిచయం చెయ్యాలి. అప్పుడే రైతులు పంట మార్పిడి చేస్తారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాల్సి ఉంటుంది. ఇదే మాట కేంద్రం కూడా చెప్పుకొచ్చింది….
……. ఇదీ పోస్టు… టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధాల జోలికి మనం ఇక్కడ వెళ్లడం లేదు గానీ.., తెలంగాణ బీజేపీ పరివార్‌కు ఈరోజుకూ ఏ సమస్య మీదనైనా సరే, సరైన కౌంటర్లు ఇచ్చే జ్ఙానస్థాయి లేదు… ఈ పోస్టు విషయానికే వద్దాం…
- వడ్ల నుంచి డైరెక్ట్ బియ్యం తీస్తే రా రైస్ అంటారనేది నిజమే… దాన్నే ఎఫ్సీఐ భాషలో పచ్చి బియ్యం అంటారు… మరాడిస్తే నూకలు ఎక్కువ వస్తాయనేదీ నిజమే, కానీ వండితే మెత్తగా అవుతుందనేది అజ్ఞానం… అది వండే తీరు మీద ఆధారపడి ఉంటుంది…
- వడ్లను మిషన్‌లో త్వరగా ఆరబెట్టి బయటికి తీస్తే స్ట్రీమింగ్ రైస్ వస్తుందనేది మరో అజ్ఞాన గుళిక… స్ట్రీమింగ్ రైస్, బఫరింగ్ రైస్ ఏమీ ఉండవు… మిల్లర్లు కొందరు కొత్త బియ్యాన్ని పాత బియ్యంగా భ్రమింపచేయడానికి కాస్త స్టీమ్ పట్టించి, తరువాత మిల్లింగ్ చేస్తారు, అదొక మార్కెటింగ్ టెక్నిక్… ఈ బియ్యం బయట మార్కెట్‌లో అమ్మడానికే, ఎవరూ ఎఫ్సీఐకి ఇవ్వరు… రేటు ఎక్కువ…
- (ఈరోజు ఓ పేపర్ మరీ ఘోరంగా ఎఫ్సీఐ సన్నబియ్యం మాత్రమే కొంటానంటోంది అని గీకిపారేసింది… రిపోర్టర్ నుంచి ఎడిటర్ దాకా ఎవరికీ ఏమీ తెలియదు అని అర్థం… ఎఫ్సీఐకి రేటెక్కువ సన్నబియ్యం ఎవరైనా లెవీ ఇస్తారా..? అసలు సన్నబియ్యం ధరెంతో.., దొడ్డుబియ్యానికీ సన్నబియ్యానికీ నడుమ తేడాలు తెలుసా వీళ్లకు..? మీరేం జర్నలిస్టులురా నాయనా..?)
- వడ్లను కాస్త ఉడికించి, మరాడిస్తే వచ్చేది బాయిల్డ్ రైస్… ఉప్పుడు బియ్యం… దీనివల్ల నూకలు తక్కువ… అయితే గతంలో బాయిల్డ్ రైస్ తినే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ధాన్యం విస్తృతంగా పండుతోంది… పైగా బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదు, అది త్వరగా జీర్ణం కాదు… అందరూ తినలేరు… తూర్పుదేశాల్లో ధాన్యం దిగుబడి, ఎగుమతి స్థాయి విపరీతంగా పెరిగింది, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు, ధర లేదు…
- అందుకని ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్ వద్దు బాబూ, కొనలేం, కొన్నా నిల్వ చేయలేం, పారబోయలేం అని నిష్కర్షగా చెబుతోంది… అన్ని రాష్ట్రాలూ అంగీకరించాయి… పంజాబ్ మిల్లర్ల నుంచి కూడా ఎఫ్సీఐ బాయిల్డ్ రైస్ తీసుకోవడం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది… కానీ దాన్ని సరిగ్గా ఎక్స్‌పోజ్ చేయలేక, నిజాలు చెప్పడం చేతగాక, ఈ ‘‘స్ట్రీమింగ్ రైస్’’ ప్రచారాలు దేనికి బ్రదర్..?
Share this Article