అద్భుతం… సినిమా అద్భుతం అని చెప్పడం లేదు… సినిమా పేరు మాత్రమే అద్భుతం..! ఆల్‌రెడీ ఎవరో సినిమా తీస్తున్న కథతో ఈ నిర్మాత, దర్శకుడు కూడా సినిమా తీయడం నమ్మలేని ఓ అద్భుతం… అదీ నమ్మలేని అంశంతో, కన్విన్స్ చేయలేని కథనంతో నానా ప్రయాసపడటం మరో అద్భుతం… ప్రేక్షకులు పిచ్చోళ్లే గానీ, మరీ ఇది మొన్నామధ్య వచ్చిన ప్లేబ్యాక్ అనే సినిమా కథే అని గుర్తించలేనంత పిచ్చోళ్లని ఈ నిర్మాతలు అనుకోవడం ఇంకో అద్భుతం… ముందే అమ్మేసుకున్న ఒప్పందం కారణంగా, ఇది నేరుగా హాట్‌స్టార్‌లో రిలీజైంది… కరోనా సంక్షోభకాలంలో థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునే సీన్ లేదని భయపడి, దృశ్యం-2లాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు అమ్మేసుకున్నట్టున్నారు… లేకపోతే థియేటర్లలోకి వచ్చి కొందరి జేబులైనా కత్తిరించిపారేసేది… నిజంగా అంత నాసిరకంగా ఉందా అనడక్కండి… చెప్పుకుందాం…
ప్రధానంగా కథ గురించి..! మామూలుగానైతే ఈ భిన్నమైన కథను ఎంపిక చేసుకున్నందుకు ఈ దర్శకుడిని అభినందించాలి మనం… ఎందుకంటే..? క్రాస్ టైం కనెక్షన్ కథ ఇది… అంటే, వేర్వేరు కాలాల్లో ఉన్న వ్యక్తుల నడుమ పరిచయం ఏర్పడటం, కమ్యూనికేషన్ ఏర్పడటం… నిజానికి ఆత్మలు, దెయ్యాలు, చేతబడి తదితరాలను నమ్మే వ్యక్తులు కూడా ఈ క్రాస్ టైం కనెక్షన్‌ను నమ్మరు, టైమ్ ట్రావెల్‌ను అస్సలు నమ్మరు… ఎందుకంటే, జరిగిపోయిన గతానికీ, వర్తమానానికీ నడుమ కనెక్షన్ ఏ కోణం నుంచి చూసినా సాధ్యం కాదనేది వాళ్ల నమ్మకం… అందుకే ఫాఫం, ఈ దర్శకుడు ఎవరో రష్యన్ సైంటిస్టు పాత్రను తీసుకొచ్చి, ఇలాంటివి సాధ్యమే తెలుసా..? గతంలోనూ ఓ ఇన్సిడెంట్ ఉంది తెలుసా..? అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు…
Ads
అయితే ఫాంటసీ, ఫిక్షన్‌లకు లాజిక్కులతో పనిలేదు.., జస్ట్, ఇలా జరిగితే బాగుండు కదా అనుకుని ఎంజాయ్ చేయడమే… ఈ సంగతి దర్శకుడు మరిచిపోయినట్టు ఉన్నాడు… ఆమధ్య వచ్చిన ప్లేబ్యాక్ సినిమా కూడా సేమ్, క్రాస్ టైం కనెక్షన్ కథే… అదీ ఓ ఫోన్ కాల్ ద్వారా మొదలవుతుంది… కాకపోతే దాన్ని ఓ క్రైం స్టోరీకి ముడిపెట్టాడు ఆ దర్శకుడు, సినిమా పర్లేదు, బాగానే నడిచినట్టుంది కూడా… కానీ ఈ అద్భుతం సినిమాలో క్రాస్ టైం కనెక్షన్‌ను లవ్ స్టోరీ వైపు లాక్కెళ్లాడు దర్శకుడు…
నిజానికి ప్లే బ్యాక్ సినిమాలో గతానికీ, వర్తమానానికీ నడుమ చాలా ఏళ్ల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ తేడాను మనం ఎంజాయ్ చేస్తాం… ఈ అద్భుతం అనే సినిమాలో టైమ్ గ్యాప్ కేవలం ఐదేళ్లే… అందుకే అంత థ్రిల్ అనిపించదు… కాకపోతే దర్శకుడు ఎక్కడా అశ్లీలత వైపో, డార్క్ కామెడీ వైపో వెళ్లలేదు, కథను పక్కదోవ పట్టించలేదు… సంతోషం… పెద్దగా నటించలేకపోయినా సరే… హీరోహీరోయిన్లు తేజు, శివానీ ఫ్రెష్‌గా, ప్లజెంట్‌గా ఉన్నారు తెర మీద… వోకే సార్, ఎలాగూ హాట్ స్టారే కదా… ఏదో ఓ ఖాళీ టైంలో చూసేద్దాం అంటారా..? పర్లేదు… కాకపోతే హాట్‌స్టార్‌లో సినిమాలు చూడటం ఓ పెద్ద ప్రయాస..!! ఈ కథేనా నాని చేయాలనుకుని, ఎందుకో వెనక్కి తగ్గింది..? నవీన్ చంద్ర రాబోయే కథ కూడా సేమ్ లైనా..? (అవునూ, ఈ సినిమా చాలారోజుల ముందే స్టార్ట్ చేశారు కదా… వీళ్ల కథను, మెయిన్ స్టోరీ లైన్‌ను ప్లేబ్యాక్ సినిమా రచయిత కాపీ కొట్టాడా..? లేక ప్లేబ్యాక్ కథను వీళ్లు కాపీ కొట్టారా..? ఇద్దరూ కూడబలుక్కుని లేదా విడివిడిగానే సిగ్నల్ అనే 2016 కొరియన్ వెబ్ స్టోరీని గానీ డార్క్ వెబ్ సీరీస్ నుంచి గానీ ఎత్తేశారా..? ఇదే పాయింట్ చైనా, జపాన్ కూడా కొట్టాయి లెండి…)
Share this Article