మోడీ తప్పు చేశాడా..? వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదా..?…. రైతుచట్టాల రద్దు మీద దేశవ్యాప్తంగా రైతువిజయం పేరిట సంబరాలు సాగుతున్నా సరే, మోడీ ఈ చర్య రైతులకు పరోక్షంగా మరింత అన్యాయం చేయబోతోందనే చర్చ కూడా సాగుతోంది… ఐతే ఈ విజయ సంబరాల చప్పుళ్ల నడుమ ఈ చర్చ పెద్దగా వినిపించదు… ఎవరైనా ఏమైనా మాట్లాడితే రైతుద్రోహి అనే ముద్రవేస్తారనే భయం… నిజానికి మోడీ నిర్ణయాన్ని ఎవరూ ఊహించలేదు… బీజేపీలోనే ఎవరికీ తెలియదు… అంతేకదా, నోట్ల రద్దు నుంచి రైతుచట్టాల రద్దు దాకా పార్టీలోనే ఎవరికీ ఏమీ తెలియడం లేదు… నిజానికి మోడీ వెనక్కి తగ్గడం అనేది కొత్తేమీ కాదు…
తన పాలనలో చాలా నిర్ణయాల నుంచి వెనక్కిపోయాడు… ఇది కొత్తేమీ కాదు… ఉపాధి హమీ చట్టంలో సవరణలు తేవాలనుకున్నాడు, పార్లమెంటులో బిల్లు పెట్టకముందే నిర్ణయం ఉపసంహరణ… భూసేకరణ చట్టంలో సవరణలకు ఆర్డినెన్స్ జారీ చేశాడు, తరువాత వ్యతిరేకత గమనించి, బిల్లు తీసుకురాలేదు… పశువుల విక్రయం, తరలింపుపై నిషేధ నియమావళి తీసుకొచ్చాడు, అదీ కొన్నాళ్లకు పక్కన పెట్టేశాడు… ఎఫ్ఆర్‌డీఐ బిల్లు మీద కూడా బాగా వ్యతిరేకత రావడంతో అదీ ఉపసంహరణ… సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్ ఏర్పాటు మీద నిర్ణయం వాపస్… కోవిడ్ వేక్సిన్ బాధ్యతను మొదట రాష్ట్రాల మీదకు నెట్టేసి, తరువాత జనవ్యతిరేకత గమనించి వెనక్కి తగ్గాడు… ఈపీఎఫ్, పీఎఫ్ విత్‌డ్రాయల్స్ నిబంధనల సవరణ కూడా ఇలాగే… అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆనక నాలుక కర్చుకోవడం మోడీకి అలవాటే… పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు, గ్యాస్ ధర, డ్రగ్స్ ధరల పెంపు, వేక్సిన్ల ధరల ఖరారు, పేదలకు కరోనాకాలంలో ఆసరా వంటి అనేకానేక అంశాల్లో మోడీ వైఫల్యం నిజానికి మోడీ ప్రతిష్టను, పాపులారిటీని బాగా తగ్గించి ఉండాల్సింది… కానీ సరైన రాజకీయ ప్రత్యర్థి లేకపోవడం మాత్రమే తన బలంగా మోడీకి నష్టం జరగడం లేదు… ఐతే మరి ఈ అగ్రి చట్టాల మాటేమిటి..?
Ads
ఈ చట్టాల మీద సుప్రీంలో కేసులున్నయ్, ఈ చట్టాల అమలు మీద నిరవధికంగా స్టే విధించింది… ఓ కమిటీని కూడా సుప్రీం వేసింది… అందులో మహారాష్ట్ర షేత్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వాట్ కూడా ఓ సభ్యుడు… తనేమంటున్నాడంటే… ‘‘రాజకీయ కోణంలో ఈ రద్దు నిర్ణయం తీసుకున్నారు, తప్పు… దీంతో బీజేపీకి ఆశించిన రాజకీయ లబ్ది ఏమీ దొరకదు, పైగా రైతుల ఆందోళన కూడా ఆగదు… పాత చట్టాల వైఫల్యం కారణంగా దేశంలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొత్త చట్టాలు లేదా చట్టాల సంస్కరణ అవసరం… కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది..,? మోడీ తప్పుడు నిర్ణయం వల్ల ఇక వచ్చే యాభై ఏళ్లపాటు ఏ పాలకుడూ ఇక వ్యవసాయ చట్టాల సంస్కరణల జోలికి పోడు… భయపడతాడు… అది రైతుకే కాదు, దేశానికే నష్టం… నిజానికి ఈ చట్టాల్లోనే కొన్ని మార్పులు చేయాల్సి ఉండింది… అవేమిటో కూడా మేం సుప్రీంకు నివేదిక ఇచ్చాం, కానీ దాని మీద అసలు సుప్రీం కూడా విచారణ జరిపితే కదా..!’’ మరో సభ్యుడు అశోక్ గులాటీ కూడా ‘‘కేంద్రం సొంత నిర్ణయం అది, మేం ఇచ్చిన నివేదిక మీద ఆధారపడి సుప్రీమే కొన్ని సూచనలు జారీ చేసేది కదా’’ అంటున్నాడు… నిజానికి కేంద్రమే చట్టాల్ని రద్దు చేసుకున్నాక ఇక సుప్రీం కూడా చేయడానికి ఏముంటుంది..?
మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది… ‘‘మండీ దందా ప్రబలంగా ఉన్న పంజాబ్ రైతాంగం మినహా ఈ చట్టాల మీద దేశంలో ఇంకెక్కడా రైతులు వీథుల్లోకి రాలేదు… ఢిల్లీని ఎవరు సుదీర్ఘకాలం ముట్టడించగలిగితే, ప్రెజర్ బిల్డప్ చేయగలిగితే, ఇక వాళ్లు చెప్పినట్టు ఈ దేశ చట్టాలు మారిపోవాలా..? బయటికి ఎవరేం చెబుతున్నా సరే, పంజాబ్‌లో, పంజాబ్ బయట ఖలిస్థాన్ భావజాలం మళ్లీ బలపడుతోంది… రైతు ఉద్యమాలనూ వాడుకుంటున్నారు… ప్రత్యేకించి కెనడా, లండన్ బేస్డ్ సంఘాలు చాలా చురుకుగా కదులుతున్నాయి… మరి మోడీ దేశానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు..? ఈ ప్రభుత్వం మెడలు వంచడం పెద్ద పనేమీ కాదు అనే ఓ అలుసు చేజేతులా ఇచ్చినట్టయింది కదా, అది దేశస్థిరత్వానికి ప్రమాదకరం కాదా..? చట్టాల్లో లోపాల సవరణ వేరు, మొత్తానికే రద్దు వేరు… ఈ తేడా విలువ చాలా ఎక్కువ..’’ ఈ చర్చ ఇంకొన్నాళ్లు సాగుతుంది… కానీ రైతుచట్టాల రద్దు అనేది దేశంలో ప్రజాస్వామిక శక్తులు, వాతావరణం కొంతైనా నైతికంగా పుంజుకోవడానికి ఉపయుక్తమే..!
Share this Article