బాగాలేదు… అస్సలు బాగాలేదు… ఏపీ రాజకీయాల్లో బూతులు, వ్యక్తిత్వ హననాల గురించి కాదు… ఇప్పుడు కొత్తేమీ కాదు… ఇక్కడితో ఆగేదీ కాదు… చిన్న చిన్న బూతులతో మొదలై, బోసిడికే మీదుగా మగతనాల దాకా ‘అద్భుతంగా ఎదిగిన’ ఏపీ రాజకీయాల నీచస్థాయికి అందరూ బాధ్యులే… ఒకడు తక్కువ కాదు, ఒకడు ఎక్కువ కాదు… చంద్రబాబు దుశ్శాసన చరిత్ర మరిచారా అనే సమర్థనల నుంచి దుశ్వాసనుల తాతలుగా వ్యవహరించాలా అనే వాదనల దాకా..!! చివరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న మహిళల్ని కూడా బజారుకు లాగి శీలహననం చేసే దుర్మార్గాల దాకా… ఛిఛీ… చెప్పుకోవడానికి మాటల్లేవ్..! వాడు ఎవడైతేనేం..? ఏ కర్మను ఎవడు అనుభవిస్తేనేం..?
వాన చినుకుకే మొహం వాచి ఏడిచే రాయలసీమ ఇప్పుడు అకాల వర్షాలతో ఒకవైపు అతలాకుతలం అవుతుంటే… ప్రజలు చచ్చిపోతుంటే, వందలాది పశువులు కొట్టుకుపోతుంటే… రోడ్లు తెగిపోతుంటే… పట్టాలు ధ్వంసం అయిపోతుంటే… ఇళ్లు కూలిపోతుంటే… వరదనీరు ముంచెత్తుతుంటే… ఏం చేశారు..? మగతనపు చర్చల్లో బూతులతో దాడులు చేసుకునే దుర్దినాలను చూస్తున్నాం… (ఆ నీచపు ఎపిసోడ్ల గురించి సోషల్ మీడియాలో లక్షల పోస్టుల చర్చ జరుగుతోంది, ఆ లోతుల్లోకి పోవడం లేదు ఇక్కడ… రాయడానికి సిగ్గేసి…) అసలు వరద విపత్తులో జనం కకావికలం అవుతుంటే మరోవైపు బూతు రాజకీయాలే ధ్యేయంగా వ్యవహరించే నాయకులకు నివాళ్లు… నిజమే, నేను వాడింది సరైన పదమే… వారికి నివాళి…
Ads
ఇంత నికృష్ట రాజకీయాల్ని ఇక ప్రపంచంలోని ఏ సమాజమూ చూడలేదేమో..!! ఒకవైపు భారీ వర్షాలు, వరదలు సీమను ముంచెత్తుతుంటే వీళ్లు చేసిందేమిటి..? సరే, దాన్నలా వదిలేద్దాం… వీళ్లు ఎలాగూ మారరు… ఎవడి ఖర్మ వాడు అనుభవించనీ… కానీ… మీడియా అనే భూతం మాటేమిటి..? నిన్న సాయంత్రం అన్నమయ్య మట్టికట్ట కొట్టుకుపోయి అనేకమంది గల్లంతు అనే వార్తలు వస్తుంటే, మన దిక్కుమాలిన గలీజు చానెళ్లను ట్యూన్ చేస్తుంటే… ప్రతి చానెల్‌లోనూ ఈ బూతు చర్చలే… ఈ బోసిడికే బాపతు డిబేట్లే… సిగ్గుపడండర్రా… ఒక్కటంటే ఒక్క చానెల్‌లో కూడా వరదలు, జనం కష్టాల సమాచారం కనిపిస్తే ఒట్టు…
ఒక్క తిరుపతే కాదు, చిత్తూరు, కడప జిల్లాల్లో పలు గ్రామాలు అతలాకుతలం అయిపోతున్నయ్… ఒక్కడూ దాని గురించి చర్చిద్దాం అనలేదు, మీడియా దృష్టి లేదు… ఇదీ అత్యంత జుగుప్సాకరం అనిపించింది… బహుశా ఆ తెలుగుపదం ఆ భావనను సరిగ్గా వ్యక్తీకరించలేదేమో కూడా…!! అక్కడ మనుషులే చచ్చిపోతుంటే మగతనాల మీద డిబేట్లు…!! ఎంత నికృష్టం…!!! వాడు ఏడ్చాడు, వీడు నవ్వాడు, ఇంకొకడు వెక్కిరించాడు, మరొకడు సమర్థించాడు, ఇంకెవడో పాతవన్నీ తవ్వాడు… ఏమిట్రా భయ్ ఇదంతా…? వెళ్లి, పాలకుడు చినజియ్యర్ స్వామి కాళ్ల మీద పడితే కాపాడతాడా..? ఏడ్చి, విపక్షనేత అసెంబ్లీని బహిష్కరిస్తే బారా ఖూన్ మాఫీ అయిపోతుందా..?
ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ తదితర భాషల పత్రికల్ని వదిలేయండి… తెలుగు పత్రికల్లో ఎవడి డప్పు వాడిదే… ఎవడికీ సిగ్గూశరం లేవు… నిజానికి నిన్న ముఖ్యమైన వార్తలు ఏమిటి..? రైతు చట్టాల రద్దు, చంద్రబాబు ఏడుపు… మరి సీమ కష్టాల మాటేమిటి..? తెలంగాణలో ధాన్యం కొనేవాడు లేక కుప్పల మీదే ప్రాణాలు వదిలేస్తున్న రైతుల మాటేమిటి..? నమస్తే తెలంగాణ మరీ అరాచకం… కేసీయార్ ఒక్క హెచ్చరిక చేస్తే మోడీ గజగజా వణికిపోయి, రైతు చట్టాల్ని రద్దు చేశాడట… ఔనా..? మరి యాసంగి వడ్లపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదట…!! 5 పేజీల డప్పు మోగించింది… (చివరకు షర్మిల పోరాటంతోనే మోడీ గడగడా వణికిపోయి ఆ చట్టాల్ని రద్దు చేశాడట… ఏదో దిక్కుమాలిన భాషలో ఓ పిచ్చి పోస్ట్ కనబడింది లెండి…. ఔను, ఎవరి ఏడుపు వాళ్లది…) ఆంధ్రజ్యోతి వాడిది ఇక చంద్రబాబు ఏడుపును మించిన ఏడుపు… ఆ దరిద్రాన్ని వదిలేస్తే సాక్షి మరీ అరాచకం… అసలు చంద్రబాబు ఏడుపే ఓ డ్రామా అని ఎస్టాబ్లిష్ చేయడానికి నానా ప్రయాస పడింది…
ఫస్ట్ పేజీ ప్రయారిటీల్లో ఈనాడు కాస్త నయం… కానీ లోపలి పేజీల్లోకి వెళ్లేసరికి మళ్లీ అదే పచ్చ కలర్… క్లెమోర్ మైన్స్‌కే భయపడని నేత వెక్కివెక్కి ఏడ్చాడు అని ఓ స్పెషల్ ఆర్టికల్… ఈనాడు పాఠకులంతా మూకుమ్మడిగా శోకాలు పెట్టి ఏడ్వాల్సిన ధోరణి… ఎస్, చంద్రబాబూ… ప్లీజ్, ఏడవకు… ఏడవకు… ఏడ్చే మగాడిని నమ్మొద్దు, ఏడ్చే నాయకుడు జనాన్ని ఏం ఉద్దరిస్తాడు అని కాదు… నీకన్నా ప్రజలు ఎక్కువ ఏడుస్తున్నారు… నువ్వు తక్కువ కాదు, జగన్ ఎక్కువ కాదు… బేసిక్‌గా ప్రజెంట్ రాజకీయ నాయకులే అంత… అందరూ కట్టగట్టుకుని సిగ్గుపడండి, ఏడవండి…!! వెళ్లి తెగిన అన్నమయ్య కట్ట వరదల్లో దూకండి…!!
Share this Article