హక్కుల్లేవ్… తొక్కల్లేవ్… ఎవరి మీద కోపమొచ్చినా సరే తొక్కేయడమే… అది చైనా ప్రభుత్వం మీదే కాదు, ఆ నాయకుల మీదైనా సరే, ఎవడేం మాట్లాడినా, మాట్లాడతారేమోనని సందేహమొచ్చినా, చెప్పినట్టు వినకపోయినా… మనుషులు మాయం అయిపోతారు… అంతే… ఆ ఇనుప గోడల నడుమ ఎవడి బతుకేమిటో, ఎవడి భవిష్యత్తు ఏమిటో ఎవడికీ తెలియదు… అలీబాబా ఫౌండర్ జాక్ మాను చైనా ప్రభుత్వం ఎంత భ్రష్టుపట్టించిందో మొన్నమొన్ననే కదా చదువుకుంది… తాజాగా ఇదుగో, ఈ టెన్నిస్ మహిళ స్టార్ కూడా ప్రస్తుతం కనిపించడం లేదు… చైనాలో కనిపించడం లేదు అంటే… ఆందోళనకరమే…
ఈమె పేరు పెంగ్ షూ… మాజీ వరల్డ్ నంబర్ వన్ డబుల్స్ ప్లేయర్… 2013 వింబుల్‌డన్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ విజేత… 2014లో యూఎస్ ఓపెన్ సింగిల్స్‌లో సెమిఫైనలిస్ట్… (ఆ రేంజుకు వెళ్లిన మూడో చైనా ప్లేయర్)… మొన్నామధ్య చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబో (చైనా సొంత ట్విట్టర్ అన్నమాట)లో ఆమె ఓ పోస్టు పెట్టింది… కమ్యూనిస్ట్ పార్టీ మాజీ వైస్-ప్రీమియర్ ఝాంగ్ గవోలీ తనను అక్రమ సంబంధానికి ఒత్తిడి చేశాడనీ, తరువాత కొంతకాలం అఫైర్ నడిచిందనీ పేర్కొంది… మిటూ ఆరోపణల టైపులో… తరువాత జస్ట్, అరగంటకే ఆ పోస్టు డిలిట్ చేయబడింది… ఆమె చేయలేదు… అప్పటికే బోలెడన్ని స్క్రీన్ షాట్లు తీసి జనం ప్రైవేటు చాట్లలో షేర్ చేసుకోవడం మొదలైంది… వైరల్ అయిపోయింది…
Ads
చైనాలో ఇంటర్‌నెట్ మీద బోలెడన్ని ఆంక్షలు, పరిమితులు… ఆ పోస్టుకు సంబంధించిన రియాక్షన్లు కూడా నెట్‌లో డిలిట్ కాసాగాయి… ఆమె పేరు కనిపించకుండా బోలెడు ఖాతాల్ని బ్లాక్ చేశారు… తరువాత ఈమే మాయం అయిపోయింది… వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆమె క్షేమం, ఉనికి మీద సమాచారం కావాలని డిమాండ్ చేస్తోంది… అంతేకాదు, సమగ్ర, ఫెయిర్, పారదర్శక విచారణ జరగాలంటోంది… పలువురు ఇతర ఆటల స్టార్లు కూడా సాహసించి ఈ పరిణామం షాకింగ్‌గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు… ‘‘ఆమె నాకు 14 ఏళ్ల వయస్సున్నప్పటి నుంచీ తెలుసు… ఇది సీరియస్ విషయం, ఆమె ఎక్కడుంది, అసలు క్షేమంగా ఉందా..?’’ అని మాజీ వరల్డ్ నంబర్ వన్ క్రిస్ ఎవర్ట్ ట్వీట్ చేసింది… అమెరికా కూడా ఈమె అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు అవసరం, బీజింగ్ స్పందించాలి అని కోరుతోంది… ఐరాస మానవ హక్కుల ఆఫీసు అధికార ప్రతినిధి లిజ్ థ్రాసెల్ ‘‘లైంగిక దాడికి గురయ్యానని చింతించడమే నేరమా..? అసలు ఆమె ఏమైపోయింది..?’’ అని ప్రశ్నించింది… అవునూ, ఆమె ఏమైంది..?!
Share this Article