………… By…. Bharadwaja Rangavajhala……….. కాదేదీ తీతకనర్హం అన్నారు పెద్దలు
నేను పెద్దల మాటల్ని దారుణంగా గౌరవిస్తాను.
రాముడేయాల్సిన ఎన్టీఆర్ ఆ కారక్టర్ హరనాథ్ కి ఇచ్చి … రావణుడు వేసి సీతారామకళ్యాణం తీస్తే అహో అనేశామా లేదా?
అంతే …
సహజంగా ఓ అభిప్రాయం ఉంటుంది. అదేమనగా … కథలో ప్రధానపాత్రను హీరో అనేసుకుని … హీరోకుండాల్సిన లక్షణాలు ఈ పాత్రకున్నాయా లేవా అని టేపులు పట్టుకుని రంగంలోకి దిగిపోతాం …
కథానాయకుడు ప్రతి నాయకుడు అనే కాన్సెప్టు అన్ని వేళలా వర్కౌట్ కాదు.
ఒక్కోసారి ప్రతినాయకుడుగా కనపించేవాడే నాయకుడు అవుతాడు.
నాయకుడూ ప్రతినాయకుడు అవుతాడు.
ఒక సమాజంలో నాయకుడైన వాడు మరో సమాజంలో ప్రతినాయకుడు అవుతాడు.
శ్రీకాకుళం గిరిజనులకు వెంపటాపు సత్యం హీరో అయితే … జాగృతి పత్రిక సంపాదకుడికి మాత్రం నరకాసురుడు అయ్యాడు.
నరకాసురుడు కూడా ఒక సమాజంలో హీరోనే.
కనుక నాయకుడు అంటే ఇలా ఉండాలనే లక్షణ కొలబద్దలేవీ లేవు … ఉండవు. ఏ సమాజపు విలువలు ఆ సమాజంవే కనుక.
అందుచేతా … ఫలానా పాత్రను హీరోగా పెట్టి ఎలా సినిమా తీస్తారండీ అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని చూసి జాలి పడడం తప్ప చేయగలిగింది లేదండయ్యా …
ఫలానా పాత్రనే హీరోగా చూపించాల … హీరో అంటే ఉదాత్తంగా ఉండాల అని విలువలు ఆపాదించి మాట్లాడడం కూడా అణచివేత కిందకే వస్తుందని కూడా పెద్దలు చెప్పారు.
పెద్దల మాటలను గౌరవిస్తాను అని ఇందాకే చెప్పాను కనుక … ఈ మాటల్నీ గౌరవిస్తున్నాను. అసలు నేను పెద్దల మాటలను తప్ప మరింకేవీ ప్రమోట్ చేయను కూడా….
ఏ సమాజంలో అయితే సినిమా విడుదల అవుతోందో ఆ సమాజపు విలువల ప్రకారం నాయక ప్రతినాయకుల నిర్దారణ జరుగుతుంది అనేది నేను నమ్ముతానన్నమాట.
దాన్ని మెయిన్ స్ట్రీమ్ క్రిటిసిజమ్ అనుకుంటే …
ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించే వర్గమూ అంతే బలంగా ఉంటుంది.
అంచేత ఇందాక పెద్దలు చెప్పినట్టు కాదేదీ తీతకనర్హం.
అలా నయీం డైరీస్ సినిమా చూశాన్నేను నిన్న.
నయీం కథేంటి సినిమా ఏంటి అనుకోవడం కూడా అణిచివేత ఆలోచనా విధానమే అంటాన్నేను. ఆ విషయం పక్కన పెట్టేస్తే …
డిసెంబర్ మొదటి వారం విడుదల కాబోతున్న ఈ సినిమా నయీం గురించిన విషయాలు తెల్సుకోవాలనుకునేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా.
అంతే కాదు … సాయుధ కమ్యునిస్టు పార్టీల్లో జరిగే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలనూ ,,, దొర్లే కొన్ని నివార్యమైనప్పటికీ అనివార్యమైన తప్పులను గురించిన జ్ఞానం పొందడానికి కూడా ఈ సినిమా చూడాలి.
చాలా రహస్యంగా జరిగే చర్చలను … సంధ్యావందనపు మంత్రాల్లా లోలోపల గొణుక్కోవాల్సిన విషయాలను … ఇట్టా బహిరంగ వేదికైన సినిమా ద్వారా చర్చించాలనుకోవడం ఖచ్చితంగా ధైర్యమే.
ఆ ధైర్యం చేసిన దర్శకుడు మిత్రుడు దాము బాలాజీకి ముందుగా అభినందనలు.
ఇది అవసరమైన ధైర్యమే.
ఇంత ధైర్యం చేశాడంటే … ఆయన కులమేమిటి? అని తెల్సుకోవాలనిపిస్తుంది నాకు … అది కూడా వేరు సంగతి … అదీ పక్కన పెట్టేస్తే …
నయీం ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను చర్చించడంగా ఈ నయీం డైరీస్ సినిమా నడుస్తుంది.
ఆ నేపథ్యం తెల్సిన వారికి కొంత డాక్యుమెంటరీలా అక్కడక్కడ అనిపించినప్పటికీ సినిమా తీయుటయందు ఈ దర్శకుడికి చాలా జ్ఞానం కలదు అని మాత్రం అర్ధమౌతుంది …
బేసికల్ గా నయీం ఏమిటి? అతను ఏ ప్రాతిపదిక మీద విప్లవ పార్టీల్లో రిక్రూట్ అయ్యాడు. అట్టి రిక్రూమెంట్ మెథడ్ సబబా ? బేసబబా ? అలా నిజంగా జరిగిందా లేదా?
అలాంటి రిక్రూట్మెంట్ల వల్ల జరిగే నష్టాలేంటి?
అలాంటి వాటి వల్ల ఆ తర్వాత పార్టీ ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి?
పార్టీ వైపు నుంచీ జరిగే తప్పులు ఎలా ఉంటాయి? అవి ఒక వ్యక్తి మనసులో వ్యతిరేక భావనలను ఎలా ప్రోగు చేస్తాయి … అవి ఆ మనిషిని పార్టీకి ఎలా దూరం చేస్తాయి?
ఇలా అన్ని వైపుల నుంచీ సమస్యను గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు దర్శకుడు దాము బాలాజీ.
నయీం ఖచ్చితంగా ఇంట్రస్టింగ్ కారక్టరే … దాన్ని గురించి కాస్తేమిటి? చాలా లోతుగా మాట్లాడుకోవాల్సిందే. చర్చించవలసినదే.
కొట్టి పారేయాల్సిన వ్యవహారం మాత్రం కాదు ఇది.
సినిమా తీయడంలో తన అనుభవం కనిపిస్తుంది.
ముఖ్యంగా యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశాడు.
అక్కడక్కడా సినిమాటిక్ గా అనిపించినప్పటికీ … యాక్షన్ ఎపిసోడ్ బావుంది.
సినిమాకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే … విప్లవ ప్రజాసంఘాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో విపరీతమైన నాటకీయత అనిపించింది.
ప్రత్యేక ప్రయోజనం ఆశించి ఈ సన్నివేశాలనలా రూపకల్పన జరిగి ఉండవచ్చు.
అలాగే జైలుకు సంబంధించి … పార్టీ వ్యవహారాలకు సంబంధించి మామూలు సినిమా వాళ్ల కన్నా కాస్త మెరుగ్గా చూపించగలిగారు.
స్వీయ అనుభవం కారణం కావచ్చు.
అయితే కొంత మెరుగ్గా మాత్రమే అనేది అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇలా … నయీం డైరీస్ అనేది చూడబుల్ సినిమానే. చర్చించదగ్గ సినిమానే. మాట్లాడుకోవాల్సిన అనేక అవసరమైన విషయాల చుట్టూ కథ నడుస్తుంది కాబట్టి నెగెటివ్ గానూ పాజిటివ్ గానూ కూడా చర్చకు దారి తీసే సినిమా అవుతుంది .
తిరుగుబాటు రాజకీయాలను ప్రేమించేవారందరూ … సవరించుకోవాల్సిన అనేక విషయాల గురించి మాట్లాడుకోడానికైనా ఈ సినిమా చూడడం అవసరం అని చెప్తూ …
సినిమా విడుదలయ్యాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం …
ఇలాంటి టాపిక్ తో సినిమా తీసే ధైర్యం చేసిన దాము బాలాజీని మరోసారి అభినందిస్తున్నాను. సాధారణంగా ధైర్యం చేసినోళ్లను అభినందించాల కదా .. అంచేత తప్ప ప్రత్యేకమేమీ లేదు.
అంతకు మించి నాకు పెద్దగా తెల్దు …
Share this Article